Gym mistakes : జిమ్‌కు వెళ్లే వారిలో బట్టతల వచ్చే చాన్స్.. ఈ పొరపాట్లే కారణం!

Gym mistakes : జిమ్‌కు వెళ్లే వారిలో బట్టతల వచ్చే చాన్స్.. ఈ పొరపాట్లే కారణం!

Update: 2024-12-24 08:05 GMT

దిశ, ఫీచర్స్ : ఇటీవల యువతలో ఫిట్‌నెస్‌పై మరింత ఆసక్తి పెరుగుతోంది. శరీర సౌష్టవం కోసం చాలామంది రెగ్యులర్‌గా జిమ్‌కు వెళ్తుంటారు. అయితే ఇలా వెళ్లేవారిలో బట్టతల సమస్య కూడా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. అక్కడ చేసే కొన్ని పొరపాట్లు, నిర్లక్ష్యమే ఇందుకు కారణమని అంటున్నారు. ఇంతకీ మిస్టేక్స్ ఏమిటి? ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక చెమటతో..

జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నప్పుడు చెమట రావడం సహజమే. అయితే ఇది జుట్టు రాలే సమస్యకు కూడా కారణం అవుతుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వర్కౌట్ ముగిశాక కూడా పలువురు చాలా సేపటి వరకు స్నానం చేయరు. అదే ఆరిపోతుంది లే అనుకొని చెమటను కూడా తుడుచుకోరు. కానీ దీనివల్ల చెమటలో ఉండే సోడియం కంటెంట్‌తో పాటు హానికరమైన బ్యాక్టీరియా ఫామ్ అవుతుందట. ఇది జుట్టు రాలి క్రమంగా బట్టతల రావడానికి కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జిమ్‌కు వెళ్లేవారు వర్కౌట్ మధ్యలో లేదా ముగిశాక చెమటను తుడుచుకోవాలి. అలాగే ఇంటికి రాగానే తల స్నానం చేయాలి. ఇక మహిళలైతే జిమ్‌కు వెళ్లేటప్పుడు, అక్కడ వర్కౌట్స్ చేసేటప్పుడు జుట్టును గట్టిగా కట్టుకుంటారు. దీనివల్ల అధిక చెమటకు గురై జుట్టు రాలడం ప్రారంభం అవుతుంది. అలా జరగకూడదంటే జుట్టును వర్కౌట్ చేసేటప్పుడు జుట్టు వదులుగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు.

క్యాప్స్ పెట్టుకోవడం

కొందరు వ్యాయామం చేసేటప్పుడు తలకు టోపీలు ధరిస్తుంటారు. చలికాలంలో అయితే చాలామంది ఇదే చేస్తుంటారు. అయితే జిమ్‌లో ఇలా చేయడంవల్ల వెంట్రుకల కుదుళ్లకు తగిన వెంటిలేషన్ ఉండదు. పైగా జుట్టుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. కేర్ తీసుకోకపోతే బట్టతల రావచ్చు.

పరిశుభ్రత పాటించకుంటే..

వర్కౌట్స్ చేస్తున్న యంత్రాలు, పరికరాలు, అలాగే ఆ చుట్టు పక్కల ప్రదేశం శుభ్రంగా లేకపోయినా జుట్టుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు వచ్చిన చెమటకు తోడు దుమ్ము, ధూళి వంటివి తల వెంట్రుకల్లో చేరడం వల్ల చుండ్రు, జుట్టు రాలే సమస్యకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. దీనివల్ల జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. తద్వారా బట్టతలకు చాన్స్ ఉండదు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 

Tags:    

Similar News