Health : యువతలోనూ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్..! ఎలా గుర్తించాలి?
Health : యువతలోనూ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్..! ఎలా గుర్తించాలి?
దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు మద్యం తాగేవారిలోనే లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపించేవి. కానీ ప్రస్తుతం మారుతున్న ఆహారపు అలవాట్లు కూడా కాలేయ వ్యాధులకు కారణం అవుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డ్రింక్ చేయని వారిలో కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యలు తలెత్తున్నాయి. కాగా ఇటీవల యువతలోనూ కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం సమస్యగా మారుతోంది. అయితే ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే నివారణ, చికిత్స వంటివి ఈజీవు అవుతాయని, రిస్క్ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలా గుర్తించదగ్గ లక్షణాలేమిటో ఇప్పుడు చూద్దాం.
* ఫ్యాటీలివర్ సమస్య ఉన్నవారిలో కనిపించే ప్రధాన లక్షణాల్లో ఒకటి లివర్ సైజ్ పెరగడం. అంటే మీ శరీరంలో కాలేయం ఉన్న భాగంలో ఉబ్బెత్తుగా ఉంటుంది. దానిని ప్రెస్ చేస్తే నొప్పిగా అనిపిస్తుంది. అయితే ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో హెపాటోమెగాలిగా అంటారు. కాబట్టి మీలో ఇలాంటి ఇబ్బంది కనిపించినా, కడుపు భాగంలో ఓ వైపున తరచుగా ఉబ్బినట్లు అనిపించినా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
*కాలేయంలో కొవ్వు పేరుకుపోయిన వారిలో కనిపించే మరో సింప్టమ్ పాదాల్లో వాపు. కొందరికి కాళ్లు, చేతులు ఉబ్బుతుంటాయి. కొంతకాలంగా ఈ సమస్య కనిపిస్తే గనుక మీరు ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నట్లు అనుమానించాల్సిందే. అలాగే అజీర్తి, వికారం వంటివి కూడా ఎక్కువగా ఉంటాయి. ఆహారం తిన్నప్పటికీ వెంటనే వాంతికి వచ్చినట్లు అనిపించడం, ఒక్కోసారి వాంతింగ్స్ అవ్వడం ఫ్యాటీ లివర్ లక్షణాలే. అలాగే శరీరక బలహీనత, ఉదయాన్నే ఏ పనిచేయకపోయినా అలసటగా అనిపించడం ఎక్కువ రోజులు కనిపిస్తే మీ కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఉండవచ్చు.
*లివర్ దెబ్బతిన్నప్పుడు లేదా దానిచుట్టూ ఫ్యాట్ పేరుకుపోయినప్పుడు కొందరిలో చర్మంపై దద్దుర్లు, దురద వంటివి తరచుగా వస్తుంటాయి. దీనిని బట్టి ముందుగానే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, డాక్టర్ల సలహాలు పాటించడం చేస్తే ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే అది లివర్ సిర్రోసిస్‌గా మారే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తు్న్నారు. కాబట్టి లక్షణాలను బట్టి అలర్ట్ అవడం బెటర్.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.