'వర్క్ ఫ్రమ్ హోమ్' కాదు, 'బైక్ నడుపుతూనే వర్క్..' ఈ జీవితానికి ఏమైంది?!
ప్రశ్నకు సమాధానం మాత్రం సంశయంగానే మిగిలింది!! Bengaluru man spotted working on laptop while riding a bike.
దిశ, వెబ్‌డెస్క్ః ఉరుకుల పరుగుల జీవితం మనిషికి అలవాటుగా మారింది. ఎంతగా అంటే, వీకెండ్ సెలవులో సేదా తీరాలని అనుకునే లోపే సెలవు పూర్తయ్యి, పనికి పరుగుపెట్టాల్సి వచ్చేటంతగా..! వినడానికి కాస్త అతిశయోక్తి అనిపించినా ఇది అసత్యం కాదని అనుభవంలో తెలియకుండా పోదు!! అందులోనూ, ప్రయివేటు జాబులు, 'కార్పొరేట్ కార్మికుల' పరిస్థితి మరింత దారుణం. ఇక, సొంతగా బిజినెస్ పెట్టుకున్నోళ్లైతే క్షణం వేస్టయినా నష్టం నాషాళానికి అంటుద్దన్నట్లే ఉంటుంది. డబ్బుల కోసం బతుకుతున్నామా.. బతకడానికి డబ్బులు సంపాదిస్తున్నామా.. అనే విషయంలో 99% మందికి సంశయం లేకపోదు! అయినా పరుగు ఆగదు, తీరం తెలియదు!! మొత్తానికి ఇలాంటి జీవితం గడుపుతూనే.. పీక్స్‌లో ఎంజాయ్ చేసే పబ్లిక్ కూడా లేకపోలేదు. ఎవరి బాధ్యత వారిది, ఎవరి బాధలు వాళ్లవి..! అలాగని, కళ్లముందు కనిపించే ఆశ్చర్యాన్ని పట్టించుకోకపోతే ఎట్లా..?! అందుకే, ఇప్పుడొక ఫోటో నెట్టింట్లో ప్రత్యక్షమయ్యింది.ఫ్లైఓవర్ మధ్యలో, బైక్‌పై కూర్చొని, ల్యాప్‌టాప్‌లో పని చేస్తున్న ఓ వ్యక్తి ఫోటో వైరల్‌గా మారింది. లింక్డ్‌ఇన్ యూజర్ హర్ష్‌మీత్ సింగ్ పోస్ట్ చేసిన ఈ ఫోటో, 'నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ఫ్లైఓవర్' పై రైడ్ చేస్తున్నప్పుడు ఒక పిలియన్ రైడర్ తన ల్యాప్‌టాప్‌లో పనిచేస్తున్న దృశ్యం చూపిస్తుంది.
"బెంగళూరు అత్యుత్తమంగా ఉందా లేదంటే చెత్తగా ఉందా? సమయం 11pm, బెంగళూరు - నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఫ్లైఓవర్‌లలో ఒకటి.., ఇక్కడ ఒక పిలియన్ రైడర్ తన ల్యాప్‌టాప్‌లో పని చేస్తున్నాడు. ఆఫీస్‌లో బాస్ సహోద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తే, బాస్ సొంత సౌకర్యం, భద్రత కోసం ఉద్యోగులకు డెడ్‌లైన్లు ఇస్తుంటే, వాళ్లు మరోసారి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది" అని సింగ్ ఈ చిత్రాన్ని పోస్ట్ చేస్తూ రాశారు. ముఖ్యంగా మీరు అధికారంలో ఉన్నవారైతే 'IT'S URGENT', 'DO IT ASAP' అని బైక్‌పై ఉన్న కష్టజీవిపై జాలి చూపించారు సింగ్. అయితే, దీనిపై నెటిజన్ల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఒకరు స్పందిస్తూ, "అతను తన ల్యాప్‌టాప్‌లో పని చేస్తున్నాడని అంగీకరిస్తాం. అయితే, అతడు నిజంగా ఆఫీస్ వర్క్ చేస్తున్నాడా.. లేదా ఇంకేదైనా వ్యక్తిగత పనిలో ఉన్నాడా అనేది ఎలా తెలుస్తుంది. డెడ్‌లైన్‌లు, గట్రా అంటూ బాస్‌లను నిందించిడం సరికాదు" అని అన్నాడు. కొంతమంది తమ పనిని కొంచెం ముందుగా పూర్తి చేసుకొని, తమ స్నేహితులతో పార్టీని ఆస్వాదించడానికి, లేదంటే కుటుంబంతో కలిసి టూర్‌లు వెళ్లడానికి ఇలా స్పీడ్‌గా పని పూర్తి చేసుకుంటారని, దానికి ఎవ్వరూ బాధ్యులు కాదని కొందరు నెటిజనులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇలాంటి విభిన్న స్పందనల మధ్య అసలు ఈ జీవితానికి ఏమైంది..?! అనే ప్రశ్నకు సమాధానం మాత్రం సంశయంగానే మిగిలింది!!