swimming : వైల్డ్ స్విమ్మింగ్ అంటే ఏమిటి?.. ఇటీవల ఎందుకంత పాపులర్ అయింది?
స్విమ్మింగ్ చేయడం కేవలం సరదా మాత్రమే కాదు. దీనివల్ల ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. వేసవి వచ్చిందంటే చాలు ఒకప్పుడు గ్రామాల్లో పిల్లలు, పెద్దలు ఊరిబయట చెరువుల్లో, పొలాల వద్ద గల బావుల్లో ఈతకొట్టేవారు.
దిశ, ఫీచర్స్ : స్విమ్మింగ్ చేయడం కేవలం సరదా మాత్రమే కాదు. దీనివల్ల ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. వేసవి వచ్చిందంటే చాలు ఒకప్పుడు గ్రామాల్లో పిల్లలు, పెద్దలు ఊరిబయట చెరువుల్లో, పొలాల వద్ద గల బావుల్లో ఈతకొట్టేవారు. ప్రస్తుతం ఆ నీటి వనరులు కాస్త తగ్గిపోయి స్విమ్మింగ్ పూల్స్ అందుబాటులోకి వచ్చాయి. అయినా ఈత కొట్టాలన్న ఆసక్తి, దానివల్ల కలిగే ప్రయోజనాల్లో మాత్రం ఎటువంటి తేడా లేదని అందరూ అంగీకరిస్తు్న్నారు. పైగా ఇటీవల ఈతకు సంబంధించిన ‘వైల్డ్ స్విమ్మింగ్’ అనే ఒక కొత్త ట్రెండ్ వరల్డ్ వైడ్ పాపులర్ అయింది. ప్రజెంట్ సోషల్ మీడియాలోనూ చాలామందిని ఆకట్టుకుంటోంది. రోజు రోజుకూ జనాదరణ పొందుతున్న ఈ సరికొత్త స్విమ్మింగ్ గురించి తెలుసుకుందాం.
2020 నుంచే మొదలు..
అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆరుబయట గల జలాశయాల్లో సరదాగా ఈత కొట్టడమే ‘వైల్డ్ స్విమ్మింగ్’. నదులు, చెరువులు, బావులు, సముద్రాలు.. ఇలా ఉచితంగా స్విమ్మింగ్ చేయగలిగే నీటి వనరులన్నీ వైల్డ్ స్విమ్మింగ్ పరిధిలోకి వస్తాయి. వాస్తవానికి 2020 -21 మధ్య కాలంలో మహమ్మారి లాక్‌డౌన్ సమయంలో ప్రజల్లో ఈ ఆలోచన మెదిలింది. అప్పట్లో స్విమ్మింగ్ పూల్స్ మూసి వేయడం, భౌతిక దూరం పాటించాల్సి రావడం కారణంగా ఎక్కడికైనా బయటకు వెళ్లి అడవిలో లేదా ప్రకృతి మధ్యలో గల జలాశయాల్లో స్విమ్మింగ్‌ను ఆస్వాదించాలనే ప్రయత్నాలు చేశారు. ఈ విపరీతమై కోరిక ఆ తర్వాత జనాదరణ పొందింది. ఇదే వైల్డ్ స్విమ్మింగ్ ట్రెండ్ క్రియేషన్‌కు దారితీసింది.
36 శాతం పెరుగుదలతో..
చల్లటి ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ, వేడి వాతావరణంలోనూ ఈ బహిరంగ ఈత బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఏడాది పొడవునా సాహస ఈతగాళ్లు వైల్డ్ స్విమ్మింగ్‌ను ఆస్వాదిస్తున్నారు. 2020లో ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వైల్డ్ స్విమ్మింగ్ ట్రెండ్ చాలా పాపులర్ అవుతూ వస్తోంది. ఈ కాలక్షేపం క్రమంగా అవుట్ డోర్ లేదా వైల్డ్ లైఫ్ స్విమ్మింగ్ సొసైటీల ఏర్పాటుకు కూడా ప్రేరణగా నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఔట్‌డోర్ స్విమ్మింగ్ సొసైటీ మెంబర్‌షిప్ 36 శాతం పెరిగిందట. ఇక బ్రిటన్‌లో అయితే ‘వైల్డ్ స్విమ్మింగ్’ అనే పదానికి సంబంధించిన ఇంటర్నెట్ సెర్చింగ్స్ 2019 నుంచి 2020 మధ్య 94% పెరిగాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగానూ ఇది మూడు రెట్లు పెరిగిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మహిళల్లోనూ ఆదరణ
ప్రస్తుతం పురుషులతోపాటు స్త్రీలలోనూ వైల్డ్ స్విమ్మింగ్ విషయంలో ఆసక్తి, ఆదరణ పెరుగుతోంది. 2017 నుంచి 2020 మధ్య ఆరుబయట స్విమ్మింగ్‌లో స్త్రీల భాగస్వామ్యం 50% నుంచి 65% వరకు పెరిగిందని పరిశోధనలు చెబుతున్నాయి. ఎటువంటి గాయాలు తగిలే అవకాశం లేని ఫిజికల్ యాక్టివిటీగా ఉండటం, అనేక ఆరోగ్య ప్రయోజనాలతోపాటు ప్రకృతి ఆస్వాదన, ఆనందంతో ముడిపడి ఉండటం కారణంగా ఇది జనాదరణ పొందుతోంది. పైగా ఈత కొట్టడంవల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుందని, కార్డియో వాస్క్యులర్ ఫిట్‌నెస్ డెవలప్ అవుతుందని, కండరాల బలానికి మంచిదని నిపుణులు చెప్తున్నారు.
వైల్డ్ స్విమ్మింగ్ బెనిఫిట్స్
వైల్డ్ స్విమ్మింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న అర్బనైజేషన్‌లో ఈతకు అనుకూలమైన నీటి వనరులు లేకుండా పోయాయి. స్విమ్మింగ్ పూల్స్ ఉన్నప్పటికీ వాటివల్ల కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. పైగా స్విమ్ సూట్ కొనడం, నెలవరీ ఫీజులు కట్టి ఈత కొట్టడం వంటివి ఖర్చుతో కూడుకున్నవి. దీంతో పోల్చినప్పుడు ‘వైల్డ్ స్విమ్మింగ్’ భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఖర్చులు ఉండవు. ఒకవేళ దూరపు ప్రదేశాలకు ట్రావెల్ చేసి వైల్డ్ స్విమ్మింగ్ ఆస్వాదించినప్పుడు కొంత ఖర్చు ఉన్నప్పటికీ ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. కుటుంబంతో కలిసి వైల్డ్ స్వి్మ్మింగ్‌ను ఆస్వాదించవచ్చు. ప్రకృతి మధ్యలో ఈతకొట్టడం శారీరక ఆరోగ్యాన్ని, మానసిక శ్రేయస్సును పెంపొందిస్తుంది. ఫలితంగా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ప్రస్తుతం వైల్డ్ స్విమ్మింగ్ గడ్డకట్టే ఉష్ణోగ్రతలలో కూడా డైవ్ చేయగలిగే కోల్డ్ వాటర్ స్విమ్మింగ్, అలాగే లిథువేనియా, ఉక్రెయిన్ వంటి ఐరోపా దేశాల్లో మంచుతో నిండిన చలికాలంలోనూ ప్రకృతి నడుమ ఆస్వాదించే సబ్ జీరో స్వి్మ్మింగ్ వైల్డ్ స్విమ్మింగ్‌లో భాగంగా ఉన్నాయి.