మహిళల్లో లంగ్స్ క్యాన్సర్ ఎందుకు పెరుగుతోంది..?
లంగ్ క్యాన్సర్.. ఈ రోజుల్లో మరణానికి దారి తీస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఇదొకటి.
దిశ, ఫీచర్స్: లంగ్ క్యాన్సర్.. ఈ రోజుల్లో మరణానికి దారి తీస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఇదొకటి. ఒకప్పుడు ధూమపానం చేసే వారిలో అధికంగా కనిపించే ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రస్తుతం ధూమపానం అలవాటు లేని మహిళల్లోనూ అధికంగా కనిపిస్తోందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే స్మోకింగ్ హ్యాబిట్స్ లేని మహిళలల్లో ఇది ఎందుకు వస్తోందనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న ప్రశ్న కాగా నిపుణుల సమాధానం ఏమిటో తెలుసుకుందాం.
లంగ్ క్యాన్సర్ అనగానే చాలా మందికి ఒక పెద్దాయన సిగరెట్ కాల్చుతున్న దృశ్యం కళ్ల ముందు కదులుతుంది. ఎందుకంటే మనం టీవీల్లో, సినిమాల్లో ధూమపానం వల్ల క్యాన్సర్ వస్తుందనే యాడ్స్ చూసుంటాం. కానీ ప్రస్తుతం లంగ్ (ఊపిరితిత్తులు) క్యాన్సర్ రూపురేఖలు మారుతున్నాయి. గత 15 ఏండ్లుగా గమనిస్తే ధూమపానం చేసే పురుషులకన్నా, ధూమపానం చేయని మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇందుకు జెనెటిక్ ప్రభావం.. ఫిల్టర్డ్ సిగరెట్లు తాగడం.. తాగేవారి వల్ల ప్రభావితం కావడం.. లక్షణాలు కనిపించినా, క్యాన్సర్లను గుర్తించినా స్క్రీనింగ్ టెస్టులు, చికిత్సలు ఆలస్యం కావడం.. కారణాలుగా ఉంటున్నాయి.
మహిళల్లోనే అధికం..
మహిళల్లో సంభవిస్తున్న క్యాన్సర్ కారక మరణాలల్లో ఎక్కువగా లంగ్ క్యాన్సర్‌కు సంబంధించినవే ఉంటున్నాయి. రొమ్ము, అండాశయం, కొలొరెక్టల్ క్యాన్సర్లతో పోలిస్తే ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణిస్తున్న మహిళలు అధికంగా ఉంటున్నారు. అమెరికన్ లంగ్స్ అసోసియేషన్ రిపోర్టు ప్రకారం గత 44 ఏళ్లలో లంగ్ క్యాన్సర్ రేటును పరిశీలించినప్పుడు స్త్రీలలో 79 శాతం ఉండగా, పురుషులలో 43 శాతంగా ఉంది. క్యాన్సర్ కారక అధ్యయన చరిత్రలోనే మొట్టమొదటిసారిగా లంగ్ క్యాన్సర్ బారిన పడుతున్న వారిలో పురుషుల కంటే మహిళలు, యువతులు ఎక్కువ మంది ఉంటున్నట్లు తేలింది.
యూనివర్శిటీ ఆఫ్ మియామి హెల్త్ సిస్టమ్‌లో భాగమైన సిల్వెస్టర్ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్‌లో థొరాసిక్ ఆంకాలజిస్ట్ ప్రకారం.. లంగ్ క్యాన్సర్ అనేది ఏమాత్రం ధూమపానం అలవాటు లేని యువతీ యువకుల్లో వస్తోంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఎందుకలా జరుగుతుందనే పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు కొన్ని కారణాలను పరిశోధకులు గుర్తించారు.
మహిళల్లో క్యాన్సర్ పెరుగుదలకు కారణాలు..
మహిళల్లో లంగ్ క్యాన్సర్ పెరగడానికి మొదటి కారణం.. కొందరు మహిళలు ఫిల్టర్డ్ సిగరెట్లు తాగడం ప్రారంభించడం ఒకటైతే, పొగాకు ఉత్పత్తులను వాడటం మరో కారణం. అలైన మరో కారణం ఏమిటంటే ఇండ్లల్లో సిగరెట్ తాగే అలవాటు ఉన్న పురుషులకు సన్నిహితంగా ఉంటున్నందువల్ల సిగరెట్ తాగిన వారికంటే ముందుగా దాని పొగను పీల్చే మహిళలు లంగ్ క్యాన్సర్ బారిన పడుతున్నారు.
చాలామంది పురుషులు తమ భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ సమక్షంలో సిగరెట్స్ కాల్చడం ఫ్యాషన్‌గా భావిస్తూ కానిచ్చేస్తారు. అప్పుడు వారు వదిలే పొగను పీల్చిన మహిళలకే అధిక ప్రమాదం పొంచి ఉంటోంది. అలాగే కుటుంబ పెద్ద సిగరెట్ తాగుతున్నప్పుడు వారి చుట్టూ ఉండే వారికి కూడా క్యాన్సర్ కారకాలు చేరే అవకాశం ఉంటుంది. వీటితోపాటు ఫిల్టర్డ్ సిగరెట్లు, టొబాకో ఉత్పత్తులను (జర్దా పాన్, గుట్కా వంటి) కూడా లంగ్ క్యాన్సర్ కారకాలుగా చూపుతున్నారు.
అధ్యయనాలు ఏం చెప్తున్నాయి..?
సిగరెట్ తాగి వదిలినప్పుడు దాని పొగను పీల్చడం కారణంగా అడెనోకార్సినోమా అని పిలువబడే ఒక రకమైన క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచిందని నిపుణుల అధ్యయనాలు చెప్తున్నాయి. సెకండ్ హ్యాండ్ స్మోక్(ఇతరులు పొగ తాగుతున్నప్పుడు పరోక్షంగా దానిని పీల్చడం) వల్ల మహిళలు క్యాన్సర్ కారక ప్రభావాలకు లోనవుతారని కూడా అధ్యయనంలో తేలింది.
ప్రమాదకరం అని తెలిసినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. ఇప్పటికీ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న వారిలో ఎక్కువమంది తరచుగా ధూమపానం చేసే అలవాటు గలవారో, ధూమపానం చేసే వారికి సన్నిహితంగా ఉంటున్నవారో (భార్య, కూతురు, కుటుంబ సభ్యులు) కావడం గమనించాల్సిన విషయం. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళల్లో 20 శాతం ఇతరులు ధూమపానం చేయగా పీల్చడంవల్లో, ఫిల్టర్ సిగరెట్ అలవాటు గలవారో అయి ఉంటున్నారు.
ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాద కారకాలు..
ధూమపానం, సెకండ్‌హ్యాండ్ పొగతో పాటు కుటుంబ చరిత్ర, ఆస్బెస్టాస్, రాడాన్, వాయు కాలుష్యం కూడా లంగ్ క్యాన్సర్‌కు దారి తీస్తున్నాయి. ఆర్సెనిక్, బెరీలియం, కాడ్మియం, సిలికా నికెల్ వంటివి కూడా క్యాన్సర్ కారకాలుగా పనిచేస్తాయనేది ఆందోళన కలిగించే అంశంగా ఉంది. అలాగే కొందరిలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు జెనెటిక్ కారణాలు కూడా ఉంటాయి.
వంశ పారంపర్యంగా క్యాన్సర్ చరిత్ర కలిగిన కుటుంబాల్లోని వారు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మహిళల్లో క్యాన్సర్ కారకాలకు జన్యుశాస్త్రం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని ఇటీవల పరిశోధకులు కనుగొన్నారు. పర్యావరణ మార్పులు, జెనెటిక్ హిస్టరీ లంగ్స్ క్యాన్సర్లకు కారణం అవుతున్నాయి.
జెనెటిక్ ప్రభావం..
రొమ్ము క్యాన్సర్‌లో (BRCA1, BRCA2) జెనెటిక్ ప్రభావాలు ఉంటున్నాయి. కణితి అభివృద్ధిని ప్రోత్సహించే జన్యువులలో మార్పులు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. లంగ్ క్యాన్సర్‌కు కారణమయ్యే పూర్తిగా నిర్దిష్ట కారణాలను పరిశోధకులు ఇంకా గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకైతే కుటుంబ జెనెటిక్ ప్రభావాలే ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎలా అభివృద్ధి చెందుతుందో వివరించడంలో సహాయపడుతున్నాయి.
ఊపిరితిత్తుల క్యాన్సర్ స్క్రీనింగ్..
2021లో యునైటెడ్ స్టేట్స్ ప్రివెంటివ్ సర్వీసెస్ టాస్క్ ఫోర్స్ అరుదుగా ధూమపానం చేసే యువతను కూడా లంగ్ క్యాన్సర్ ప్రమాదాలు పొంచి ఉన్నవారి జాబితాలో చేరుస్తూ మార్గదర్శకాలను అప్ డేట్ చేసింది. ఇప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్ స్క్రీనింగ్ 50 నుంచి 80 సంవత్సరాల వయస్సు గల పెద్దలకు సిఫార్సు చేస్తున్నారు.
అలాగే 20 సంవత్సరాలుగా రోజుకు కనీసం ఒక ప్యాక్ సిగరెట్లు తాగే అలవాటు ఉన్నవారికి, సిగరెట్ పొగను పీల్చే పరిస్థితుల్లో అధికంగా ఉంటున్న వారికి లంగ్ క్యాన్సర్ ప్రమాదాలు ఉంటాయని, వీరు అనారోగ్యం బారిన పడినప్పుడు కూడా లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులకు సిఫార్సు చేస్తున్నారు. గత 15 సంవత్సరాలలో ధూమపానం మానేసిన వారికి కూడా స్క్రీనింగ్ సిఫార్సు చేయబడింది. ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్న మహిళలు ఊపిరితిత్తుల క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం చాలా తక్కువగానే సిటి స్కాన్ సిఫార్సులను కలిగి ఉంటున్నారు.
మహిళల్లో క్యాన్సర్ టెస్టుల శాతం..
దేశవ్యాప్తంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్న మహిళల్లో 70 శాతం కంటే ఎక్కువ మంది రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకుంటున్నారు. అయితే ధూమపానం చేసేవారిలో 6 శాతం కంటే తక్కువ మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ స్క్రీనింగ్‌ను చేయించుకుంటున్నారు. ఈ కొత్త స్క్రీనింగ్ మార్గదర్శకాల కారణంగా కూడా లంగ్ క్యాన్సర్ బారిన పడుతున్న మహిళల రేటు 40 శాతం పెరిగి ఉండవచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.
ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణ..
ఇటీవలి సంవత్సరాలలో క్యాన్సర్‌కు దారితీసే జన్యు మార్పులపై అవగాహన పెరుగుతోంది. క్యాన్సర్ నివారణలో భాగంగా, అలాగే ట్రీట్ మెంట్ కోసం కూడా ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవాల్సిన అవసరాన్ని చాలామంది గుర్తిస్తున్నారు. దీంతో ఏమాత్రం అనుమానాలు కలిగినా లంగ్స్ క్యాన్సర్ల గురించి నిర్ధారించే టెస్టులు, క్యాన్సర్ బారిన పడితే గనుక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్ల నివారణ కోసం ఇమ్యునోథెరపీలు కూడా ఈ రోజుల్లో అందుబాటులోకి వచ్చాయి.
లక్షణాలను గుర్తించడమెలా..?
కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ కారకాలు శరీరంలో ఉన్నప్పటికీ వెంటనే బయట పడకపోవచ్చు. అందుకే దగ్గు, ఊపిరి ఆడకపోవడం, విపరీతమైన అలసట, వెన్ను, ఛాతీ లేదా భుజంలో నొప్పి వంటి ఇబ్బందులు కలిగితే క్యాన్సర్ లక్షణాలకు దారితీసే సూచనలుగా భావించి టెస్టులు చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను గుర్తించడం, స్క్రీనింగ్ చేయించుకోవడం, జెనెటిక్ హిస్టరీ గురించి తెలుసుకోవడం వంటివి మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి దోహద పడతాయి.