శరీరంపై తెల్లటి పొలుసులా?.. అయితే సోరియాసిస్ కావచ్చు..
శరీరంపై తెలుపు రంగుతో కూడిన పొలుసులు, తెల్లటి మచ్చలు కనిపిస్తున్నాయా..? అవి తరచూ దురద పుడుతున్నాయా..? అయితే ‘సోరియాసిస్’ అనే చర్మ వ్యాధిగా అనుమానించవచ్చు అంటున్నారు డెర్మటాలజిస్టులు.
దిశ, ఫీచర్స్: శరీరంపై తెలుపు రంగుతో కూడిన పొలుసులు, తెల్లటి మచ్చలు కనిపిస్తున్నాయా..? అవి తరచూ దురద పుడుతున్నాయా..? అయితే ‘సోరియాసిస్’ అనే చర్మ వ్యాధిగా అనుమానించవచ్చు అంటున్నారు డెర్మటాలజిస్టులు. ఇది త్వరగా సమసి పోయేది కాదు కాబట్టి, గుర్తించిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. చూడటానికి చర్మ సమస్య లాగానే కనబడుతుంది.
కానీ సోరియాసిస్ శరీరంలో వాపుతో కూడుకున్న సమస్య. క్రమంగా అన్ని అవయవాలను ప్రభావితం చేస్తుంది. అధిక బరువు సమస్యను పెంచుతుంది. దీని కారణంగా గుండె, మిగిలిన అవయవాలపై ఒత్తిడి పెరుగుతుంది. అధిక బరువు క్రమంగా డయాబెటిస్, మధుమేహం, వివిధ గుండె జబ్బులకు కారణం అవుతుంది. మిగిలిన వారితో పోలిస్తే సోరియాసిస్ బాధితులు సగటున 7 శాతం ఎక్కువ బరువు ఉంటారు. కాబట్టి అధిక బరువును పెంచే ఆహార పదార్థాలు అతిగా తీసుకోవద్దు.
వ్యాయామంలో ఇబ్బందులు..
వ్యాయామం చేయాలని తెలిసినప్పటికీ చాలామంది సోరియాసిస్ బాధితులు దానిని విస్మరిస్తుంటారు. కారణం చర్మంపై పొలుసులు ఇతరులకు కనబడతాయేమోనని బయటకు వెళ్లరు. చివరికు రన్నింగ్, నడక వంటి వాటికి కూడా దూరంగా ఉంటుంటారు. ఆటల్లో పాల్గొన్నప్పుడు, వ్యాయామం చేసేటప్పుడు చర్మంపై అనుకోకుండా గీసుకు పోతే పొలుసుల్లో నొప్పి పుడుతుంది. అదే విధంగా చెమట, చర్మం ముడతల రాపిడితో కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. శారీరక శ్రమ అధికమైనప్పుడు కీళ్లల్లో నొప్పులు కలుగవచ్చు. అందుకే వ్యాయామానికి ముందు సోరియాసిస్ బాధితులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇబ్బందిలేని విధంగా వ్యాయామం చేసే పద్ధతిని ఎంపిక చేసుకోవాలి.
జాగ్రత్తలు..
ఎక్సర్ సైజ్ చేస్తున్నప్పుడు వదులుగా ఉండే దుస్తులు వేసుకోవడం మంచిది. దీంతో చర్మంపై రాపిడి లేకుండా ఉంటుంది. చర్మాన్ని రుద్దటం, నలపడం వంటివి కూడా చేయకూడదు. చెమటను పీల్చుకునే పౌడర్లు, క్రీములు వాడకూడదు. రొమ్ముల కింద, చంకలు, గజ్జలు వంటి చోట్ల చర్మం ముడతలు అంటుకుని, రాసుకోకుండా ఉండేందుకు పెట్రోలియం జెల్లీ వంటివి వాడితే బాగుంటుంది. శారీరక శ్రమ, వ్యాయామాల సమయంలో సోరియాసిస్ లక్షణాలు అధికంగా కనిపిస్తే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి పైపూత క్రీములు రాసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. వ్యాధి తగ్గడానికి మాత్రం స్పెషాలిటీ డాక్టర్ల సూచన మేరకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.