మెదడుపై ప్రభావం చూపుతున్న హవానా సిండ్రోమ్.. బాధితుల్లో వీళ్లే ఎక్కువ..

హవానా సిండ్రోమ్.. ప్రపంచ వ్యాప్తంగా యూఎస్ దౌత్య వేత్తలు, గూఢచారులను ప్రభావితం చేస్తున్న ఒక మానసిక రుగ్మత ఇది. ఎందుకు వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు కానీ బాధితుల మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Update: 2024-04-03 14:45 GMT

దిశ, ఫీచర్స్ : హవానా సిండ్రోమ్.. ప్రపంచ వ్యాప్తంగా యూఎస్ దౌత్య వేత్తలు, గూఢచారులను ప్రభావితం చేస్తున్న ఒక మానసిక రుగ్మత ఇది. ఎందుకు వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు కానీ బాధితుల మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక వింత శబ్దం చెవుల్లో మారుమోగుతూ ఇబ్బంది పెడుతుంది. మెదడులో ఒత్తిడి పెరిగిన భావన కలుగుతుంది. మానసిక కల్లోలం ఏర్పడుతుంది. జ్ఞాపకశక్తి తగ్గిపోయే చాన్స్ ఉంటుంది. దీనిని మొదట క్యూబా రాజధాని హవానా నగరంలో అమెరికా దౌత్య కార్యాలయ సిబ్బందిలో గుర్తించారు. అయితే దీని వెనుక ఏదైనా కుట్రకోణం ఉండవచ్చనే అనుమానంతో నాటి నుంచి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

‘డైరెక్ట్ ఎనర్జీ’ వెపన్స్ !

ఇటీవల యూఎస్ జాయింట్ మీడియా ఇంటెలిజెన్స్ హవానా సిండ్రోమ్ గురించి ఒక ఇన్వెస్టిగేటివ్ నివేదికను సమర్పించింది. దీని ప్రకారం.. రష్యన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ యూనిట్ సభ్యులు గూఢ చర్య వ్యతిరేక సాంకేతిక పరిజ్ఞానంతో ‘డైరెక్ట్ ఎనర్జీ’ వెపన్స్‌ను ఉపయోగించడం ద్వారా యునైటెడ్ స్టేట్స్ అఫీషియల్స్ మెదడులను టార్గెట్ చేసుకొని ఉండవచ్చని పేర్కొన్నది. అయితే దీనిని సోమవారం నాడు రష్యా తోసిపుచ్చింది. రష్యన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోన్ మాట్లాడుతూ.. యూఎస్ జాయింట్ మీడియా ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టులో ఆరోపించిన వాటికి ఆధారాల్లేవని, తమపై అనవసర ఆరోపణ చేస్తున్నారని పేర్కొన్నారు.

ఎప్పుడు బయటపడింది?

హవానా సిండ్రోమ్ అనేది యునైటెడ్ స్టేట్స్ ఇంటెలిజెన్స్, వివిధ దేశాల్లోని ఎంబసీ ఆఫీసర్లు అనుభవించిన ఒక మెంటల్ హెల్త్ సింప్టమ్స్‌ను సూచిస్తుంది. సాధారణంగా ‘సిండ్రోమ్’ అనే పదానికి కేవలం దాని లక్షణాల సమితి అని అర్థం. ఇదొక ప్రత్యేకమైన వైద్య పరిస్థితి అని చెప్పలేం కానీ, సాధారణంగా అనుభవించే ఒక రుగ్మత. దీని మూలాలను నిర్ధారించడం కష్టం. పేరులో సూచించినట్లుగానే 2016 చివరలో మొదటిసారిగా దాని మూలాలను క్యూబాలో గుర్తించారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 130 కేసులు నమోదయ్యాయి. ఇక ఇండియాలో 2021 జులైలో హవానా సిండ్రోమ్ తరహా ఒక కేసును మాత్రమే గుర్తించినట్లు ఇండియన్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్ మెంట్ వర్గాలు 2023లో నివేదించాయి.

లక్షణాలు - పరిష్కారం

హవానా సిండ్రోమ్ బాధితులకు సాధారణంగా బయటి శబ్దాల మాదిరి కాకుండా కొన్ని ప్రత్యేక శబ్దాలు వినిపిస్తాయి. దీంతోపాటు వికారం, తలనొప్పి, వెర్టిగో, జ్ఞాపకశక్తి కోల్పోవడం, నిస్సత్తువ, కళ్లు తిరగడం, నిద్రలేమి, వినికిడిలోపం, వంట ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. క్యూబాలో ఈ రుగ్మతకు లోనైనవారిలో మూడోవంతు మందికి వినికిడి శక్తి దెబ్బతిన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. వారి మెదళ్లు సైతం దెబ్బతిన్నట్లు స్కానింగ్‌లలో బయటపడింది. క్యూబా, చైనాల్లోని దౌత్య కార్యాలయాల్లో పనిచేసే వారిలోనే ఈ హవానా సిండ్రోమ్ బాధితులు అధికంగా ఉంటున్నట్లు యూఎస్ నిపుణులు గుర్తించారు. ప్రస్తుతం లక్షణాలకు వివిధ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కానీ సమస్య ఎందుకు తలెత్తుతోందనేది మాత్రం పూర్తి సైంటిఫిక్ ఎవిడెన్స్‌తో నిరూపించబడలేదు. ఇదే జరిగితే చికిత్స, పరిష్కార మార్గాల్లో మరింత క్లారిటీ వస్తుంది.


Similar News