ఈ-టెక్నాలజీ బాధితురాలిగా హీరోయిన్ రష్మిక.. ఫేక్ వీడియో/ఆడియో ఇలా గుర్తుపట్టొచ్చు
వేగవంతమైన సాంకేతిక పురోగతి యుగంలో ‘డీప్‌ఫేక్’ అని పిలువబడే టెక్నాలజీ డిజిటల్ కంటెంట్ ప్రామాణికత, తప్పుడు సమాచారం సంభావ్యత గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ‘
దిశ, ఫీచర్స్: వేగవంతమైన సాంకేతిక పురోగతి యుగంలో ‘డీప్‌ఫేక్’ అని పిలువబడే టెక్నాలజీ డిజిటల్ కంటెంట్ ప్రామాణికత, తప్పుడు సమాచారం సంభావ్యత గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ‘డీప్ లెర్నింగ్’, ‘ఫేక్’.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీల ప్రొడక్ట్ కాగా.. వ్యక్తుల రూపం, ప్రసంగం, చర్యలు వారివి కాకపోయినా వారివే అని నమ్మించేలా వీడియో, ఆడియో కంటెంట్‌ను మార్చగలదు.
ఒక రకంగా చెప్పాలంటే రియల్ పర్సన్స్ ఎప్పుడూ చేయని పనులతో సినిమా తీయడం లాంటిది. రీసెంట్‌గా హీరోయిన్ రష్మిక ఈ టెక్నాలజీ బాధితురాలిగా మారగా.. ‘డీప్‌ఫేక్స్’ ఎందుకు ఆందోళన కలిగిస్తుంది? వీటిని గుర్తించి, నివారించడం ఎలా?
డీప్‌ఫేక్స్.. డిజిటల్ మాజిక్ ట్రిక్స్ లాంటిది. ఈ టెక్నాలజీ జనరేటర్, డిస్క్రిమినేటర్ అనే రెండు కీలక అల్గారిథమ్‌ల పరస్పర చర్య ద్వారా ఆపరేట్ చేయబడుతుంది. ఈ అల్గారిథమ్‌లు జెనరేటివ్ అడ్వర్సరియల్ నెట్‌వర్క్ (GAN) అని పిలువబడే ఫ్రేమ్‌వర్క్‌లో కలిసి పని చేస్తాయి. నకిలీ కంటెంట్‌ను క్రియేట్ చేయడానికి, డౌట్ రాకుండా మెరుగుపరచడానికి డీప్ లర్నింగ్ ప్రిన్సిపుల్స్‌ను ఉపయోగిస్తాయి.
* జనరేటర్ అల్గారిథమ్: ఆడియో, ఫొటో, వీడియో ఏదైనా ఇనిషియల్ ఫేక్ డిజిటల్ కంటెంట్‌ను ఉత్పత్తి చేయడం జెనరేటర్ అల్గారిథమ్ ప్రైమరీ రోల్‌గా ఉంటుంది. దీని లక్ష్యం వ్యక్తి రూపం, వాయిస్ లేదా ప్రవర్తనను వీలైనంత దగ్గరగా అనుకరించడం.
* డిస్క్రిమినేటర్ అల్గారిథమ్: జనరేటర్ ద్వారా సృష్టించబడిన కంటెంట్ ఎంత ప్రామాణికమైనది లేదా నకిలీగా కనిపిస్తుందో విశ్లేషిస్తుంది. ఈ రెండింటి మధ్య ఫీడ్ బ్యాక్ లూప్ అనేక సార్లు రిపీట్ అవుతుంది. నకిలీ కంటెంట్‌ను నిజమని నమ్మించేందుకు ఫైనల్ అవుట్‌పుట్ వచ్చేవరకు ఈ సైకిల్ కొనసాగుతుంది.
డీప్‌ఫేక్స్‌తో ఆందోళన
* తప్పుడు సమాచారం వ్యాప్తి: డీప్‌ఫేక్‌లు వ్యక్తులు తాము ఎన్నడూ చేయని పనులను చేస్తున్నట్లుగా ఒప్పించేందుకు ఆడియో, వీడియో రికార్డింగ్‌లను రూపొందించేందుకు వినియోగించబడతాయి. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రతిష్టకు నష్టం కలిగించి.. వారిపై ప్రజల అభిప్రాయాన్ని మారుస్తాయి.
* ప్రైవసీపై దాడి : డీప్‌ఫేక్ టెక్నాలజీ హానికరమైన ప్రయోజనాల కోసం అమాయక వ్యక్తుల ఫొటోలు లేదా ఆడియోను మార్చగలదు. వారి ప్రైవసీని ఉల్లంఘించి.. వేధింపులు, బ్లాక్‌మెయిల్, దోపిడీకి కూడా దారితీయవచ్చు.
* ఎలక్షన్ ఇంటర్‌ఫియరెన్స్: ఎన్నికల సమయంలో ప్రజల అవగాహనను దెబ్బతీసే విధంగా నకిలీ ప్రసంగాలు, ఇంటర్వ్యూలను సృష్టించడం ద్వారా రాజకీయాలను తారుమారు చేయవచ్చు.
* నేరం, మోసం: నేరస్థులు మోసపూరిత కార్యకలాపాలలో ఇతరుల వలె నటించడానికి డీప్‌ఫేక్ సాంకేతికతను ఉపయోగించుకోవచ్చు. దీని వలన అధికారులు దోషులను గుర్తించడం, విచారించడం కష్టమవుతుంది.
* సైబర్ సెక్యూరిటీ: డీప్‌ఫేక్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. మానిప్యులేటెడ్ వీడియో లేదా ఆడియో రికార్డింగ్‌లపై ఆధారపడే సైబర్‌టాక్‌లను గుర్తించడం, నిరోధించడం మరింత సవాలుగా మారవచ్చు.
ఎలా గుర్తించవచ్చు?
* ముఖ కవళికలు, ఆడియోకు మ్యాచ్ కాకుండా అసాధారణ శరీర కదలికలపై శ్రద్ధ వహించాలి.
* మాట్లాడే పదాలు, పెదవి కదలికల మధ్య నాన్ సింక్ ఉంటుంది.
* వీడియోలోని లైటింగ్, షాడోలను అబ్జర్వ్ చేయండి. డీప్‌ఫేక్ కంటెంట్ లైటింగ్‌లో అసమానతలు కలిగి ఉండవచ్చు. అది అవకతవకలను బయటపెడుతుంది.
* అస్పష్టమైన లేదా తప్పుగా అమర్చబడిన అంచులు: సబ్జెక్ట్ యొక్క ముఖం చుట్టూ వక్రీకరించిన లేదా అస్పష్టమైన అంచుల కోసం తనిఖీ చేయండి, ముఖ్యంగా హెయిర్‌లైన్ లేదా గడ్డం దగ్గర, ఇది డిజిటల్ మానిప్యులేషన్‌ను సూచిస్తుంది.
* డీప్‌ఫేక్‌లు బ్యాగ్రౌండ్ లేదా పరిసరాల్లో అసమానతలు ఉండవచ్చు. స్ట్రేంజ్ ప్యాటర్న్స్, రిఫ్లెక్షన్స్ వెతకండి.
* ఆడియో అవాంతరాలు, బ్యాగ్రౌండ్ నాయిస్, ఆడియో మానిప్యులేషన్‌ను సూచించే వాయిస్ టోన్‌లో మార్పులు చూడండి.
* డీప్‌ఫేక్ కంటెంట్‌ను గుర్తించడానికి అనేక ఆన్‌లైన్ టూల్స్, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ రూపొందించబడ్డాయి. వాటిని ఉపయోగించి రియల్, ఫేక్ గుర్తించొచ్చు.