Weekend Thoughts: వారాంతంలో అలాంటి ఆలోచనలు.. ఫెయిల్యూర్‌కు దారితీస్తాయా?
ఈ రోజుల్లో చాలామంది ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారు. ఉరుకులు పరుగుల జీవితంలో బిజీ బిజీగా గడిపేస్తున్నారు.
దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో చాలామంది ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారు. ఉరుకులు పరుగుల జీవితంలో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. అత్యధిక సమయం వర్క్ ప్లేస్‌లో కేటాయించడం, పనిపై ఎక్కువగా ఫోకస్ చేయడం వంటి కారణాలతో అలసిపోతుంటారు. కాబట్టి సహజంగా వీకెండ్ కోసం, వీక్లీ ఆఫ్ కోసం ఆత్రుగా ఎదురు చూస్తుంటారు. అయితే వారాంతంలో మీరెలా గడుపుతున్నారు?, ఎలా ఫీలవుతున్నారు?, ఎలాంటి ఆలోచనల్లో నిమగ్నం అవుతారు? అనే దానిని బట్టి కూడా సక్సెస్, ఫెయిల్యూర్స్ ఆధారపడి ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఫెయిల్యూర్స్‌కు దారితీసే ఆలోచనలు, ఆచరణలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
వర్క్ గురించే ఆలోచిస్తారు
వర్క్‌లో పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకోవడం, బెటర్ ప్రొడక్టివిటీ కోసం ప్రయత్నించడం, ఆలోచించడం మంచిదే. దీనివల్ల పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా మరింత ఎదిగే చాన్స్ ఉంటుంది. అయితే దీనిక్కూడా ఓ లిమిట్ అవసరం అంటున్నారు నిపుణులు. మంచి రిజల్ట్ రావాలంటే పని గురించి ఆలోచించడం, కష్టపడటం ఎంత ముఖ్యమో విరామం, విశ్రాంతి కూడా అంతే ముఖ్యం అంటున్నారు. కానీ కొందరు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. వీకెండ్ లేదా సెలవు రోజుల్లో తమ వ్యక్తిగత ఆనందానికి బదులు ఆఫీసు వర్కు గురించి ఆందోళన చెందుతుంటారు. కానీ ఇది ఫెయిల్యూర్‌కి దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు.
ప్లాన్ చేయడంలో ఇబ్బందులు
సక్సెస్ సాధించాలంటే ప్లాన్ లేదా షెడ్యూల్ వంటివి డిసైడ్ చేసుకొని పని చేయడం ముఖ్యమే. అయితే కొన్నిసార్లు ముందస్తు ప్రణాళిక లేకపోయినా అప్పటికప్పుడు పరిస్థితిని బట్టి కూడా అలా చేసుకోవచ్చు. చాలామంది సక్సెస్ పీపుల్‌లో ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి. అలాగని ముందుగానే ప్లాన్ చేయకూడదని కాదు. కానీ వీకెండ్‌లో కొందరు ప్లాన్ చేయడానికి బదులు, అది చేయడం గురించిన ఆలోచనతో ఆందోళనకు గురవుతుంటారు. చివరికి ఇది బెడిసి కొడుతుంది. కాబట్టి మైండ్ రిలాక్స్‌గా ఉన్నప్పుడు ప్లాన్ చేసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.
గాడ్జెట్స్‌లో నిమగ్నమైతే అంతే..
వీకెండ్‌లో లేదా వీక్లీ ఆఫ్ రోజుల్లో కూడా ఆఫీసు వర్క్ గురించి ఆలోచిస్తూ, మెయిల్స్ పంపుతూ.. మెసేజ్‌లు పెడుతూ అవసరం లేకపోయినా తమను తాము బిజీ చేసేసుకుంటారు కొందరు. ఒకవేళ ఇవి చేయపోయినా ఫోన్లలో వ్యక్తిగత ఆసక్తుల రీత్యా నిమగ్నమైపోతుంటారు. అప్పటికే అలసటలో ఉండే ఉద్యోగులు వారంతంలో, సెలవు రోజుల్లో కూడా ఇలా చేయడంవల్ల సక్సెస్ రేటును తగ్గిస్తుందని నిపుణులు చెప్తున్నారు. రోబోలాగా గాడ్జట్స్‌తో గడిపే అలవాటు క్రియేటివిటీని దెబ్బతీయడం ద్వారా, నిద్రలేమిని ప్రేరేపించడం ద్వారా చివరికి ఫెయిల్యూర్‌కు దారితీస్తుందని పేర్కొంటున్నారు.
టైమ్ వేస్ట్ చేస్తూ బాధపడతారు
వీకెండ్స్‌లో సంతోషంగా ఉంటేనే తర్వాత ప్రొడక్టివ్‌గా ఉంటారని నిపుణులు అంటున్న మాట. ఈ సమయంలో ఆనందంగా అనిపించే సందర్భాలను ఆస్వాదించాలని చెప్తుంటారు. కానీ ఫెయిల్యూర్ థాట్స్ ఉన్నవారు అలా చేయరు. ఇటు సంతోషంగా ఉండలేక, అటు తాము అనుకున్నది చేయలేక సమయం వృథా చేస్తుంటారు. ముందు బద్ధకంగా గడిపేసి.. తర్వాత బాధపడుతుంటారు. చివరికి పనుల్ని పూర్తి చేయకుండా వాయిదా వేస్తుంటారు. అలా వీకెండ్‌లు గడిచిపోయినా కొన్నిసార్లు అనుకున్నది పూర్తి చేయలేకపోతారు.
బ్యాడ్ హాబిట్స్
ఫ్రెండ్స్‌తో కలిసి వీకెండ్‌లో బయటకు వెళ్లడం, సరదాగా గడపడం మానసిక ఆనందాన్ని ఇస్తే.. అది మీ వ్యక్తిగత, వృత్తి జీవితానికి మేలు చేయవచ్చు. కానీ కొందరు ఇందుకు భిన్నంగా తమకున్న బ్యాడ్ హాబిట్స్‌తో వీకెండ్ ఎంజాయ్ చేయాలని ట్రై చేస్తారు. మందు కొట్టడం, మత్తులో తూగుతూ గడిపేయడం చేస్తుంటారు. దీనివల్ల రిలాక్స్‌గా గడిపినట్లు అనిపించినప్పటికీ, ఆ అనుభూతిని ఫీలయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ఇదొక బ్యాడ్ హాబిట్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. దాంతోపాటు వీకెండ్‌లో వృథా ఖర్చులు కూడా సక్సెస్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయి.