పిల్లలు టీవీ చూస్తున్నారా.. అయితే వారిపై ఈ ప్రభావాలు పడొచ్చు !

చిన్న పిల్లల మనస్తత్వం తెల్లకాగితం లాంటిది అంటారు. బాల్యంలో వారు ఎటువంటి ప్రభావాలకు లోనైతే అటువంటి భావాలు, వ్యక్తిత్వం వారిలో రూపు దాల్చే అవకాశం ఉంటుంది.

Update: 2023-02-13 08:23 GMT

దిశ, ఫీచర్స్: చిన్న పిల్లల మనస్తత్వం తెల్లకాగితం లాంటిది అంటారు. బాల్యంలో వారు ఎటువంటి ప్రభావాలకు లోనైతే అటువంటి భావాలు, వ్యక్తిత్వం వారిలో రూపు దాల్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ హానికరమైన ప్రభావాలు పిల్లలపై పడితే వారు పెద్దయ్యాక వాటి తాలూకు సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. కాబట్టి పేరెంట్స్ పిల్లలను ప్రభావితం చేసే అంశాలు, ప్రసార సాధనాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మానసిక, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో టెలివిజన్ పిల్లలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. తదేకంగా చూడటంవల్ల అందులోని కంటెంట్, అడ్వర్టయిజ్ మెంట్స్‌కు ప్రభావితం అయ్యే సందర్భాలు ఉంటున్నాయి.

పిల్లలు ప్రతీ విషయంలో చురుకుగాను, ఆసక్తిగాను ఉంటారు. ఇంట్రెస్ట్ చూపుతున్న పలు విషయాల నుంచి వారి దృష్టి మరల్చడం, వారిని నియంత్రించడం కొంత కష్టమే. ఈ రోజుల్లో పిల్లలను ఆకట్టుకుంటున్న వాటిలో టీవీ ప్రధానంగా ఉంటోంది. కొన్ని అంశాల్లో ఇది పిల్లల్ని అలరిస్తున్నప్పటికీ, అందులోని పలు ప్రోగ్రామ్స్ పిల్లలపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి.


విలువైన సమయాన్ని కోల్పోతారు

టెలివిజన్ చూడటం వల్ల అందులోని వివిధ కార్యక్రమాలు పిల్లల జీవితాలపై ప్రభావం చూపుతాయి. పిల్లల రోజువారీ కార్యక్రమాలైన చదువు, హోం వర్క్, ఆటలు, వ్యాయామాలు, సామాజిక కార్యక్రమాలు వంటి కార్యక్రమాలకు పిల్లలు టీవీ వల్ల దూరం అయ్యే అవకాశాలున్నాయి. అంతేగాక టీవీల ద్వారా అనుసరించ కూడని, లేదా తప్పుడు సమాచారం గ్రహిస్తారు. అందులోని పాత్రలు, సన్నివేశాల ద్వారా నేర్చుకుంటారు. టీవీల్లో ప్రసారమయ్యే ఫాంటసీకి, వాస్తవికతకు మధ్య తేడాను గుర్తించే పరిపక్వత లేకపోవడం వల్ల పిల్లలు దారి తప్పే అవకాశం ఉంటుంది. ప్రతి ఏడాది టీవీల్లో వస్తున్న రకరకాల వాణిజ్య ప్రకటనలకు పిల్లలు ప్రభావితం అవుతున్నారు. ఈ ప్రకటనల్లో చాలా వరకు మద్యంపానం, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్‌లు, బొమ్మలు వంటివి కూడా ఉంటాయి.

వాస్తవానికి దూరంగా..

టీవీల్లో అనేక కార్యక్రమాలు వాస్తవాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు మాత్రమే ఉంటాయి. అతిశయోక్తి సన్నివేశాలు పిల్లల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు. సమాజ పోకడల గురించి కాకుండా ఆకట్టుకుకోవడమే లక్ష్యంగా ఉండే టీవీ ప్రోగ్రామ్స్ పిల్లలను తప్పుదారి పట్టించవచ్చు. పిల్లల్లో తప్పుడు భావాలకు, ఆలోచనలకు దారి తీయవచ్చు. నిజానికి టెలివిజన్‌లలో చూపించే విధంగానే బయటి పరిస్థితులు ఉండవు. ఉదాహరణకు సీరియల్స్‌లో మహిళలు, యువకులు, వృద్ధులు తదితర పాత్రలు, సన్నివేశాలు సాధారణ మానవుల వాస్తవ జీవితానికి భిన్నంగా ఉంటాయి. టీవీల్లో డ్రగ్స్ దుర్వినియోగం, మద్యపానం, సెక్స్ పరమైన విషయాలు చూడటం అనేది పిల్లలపై చెడు ప్రభావం చూపుతాయి. పైగా టీవీల్లోని కార్యక్రమాల్లో ఫాంటసీ ఏది, వాస్తవం ఏదీ అని వేరు చేసి చూసే విచక్షణ పిల్లల్లో ఉండదు.


ప్రయోజనాల కంటే.. ప్రభావాలే అధికం

కొన్ని టెలివిజన్ కార్యక్రమాల వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, అనేక విషయాల్లో ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశాలే అధికం. సోషల్ బిహేవింగ్ పరంగా సానుకూలతలు చాలా తక్కువనే చెప్పాలి. పైగా టీవీల్లోని పాత్రలు, సన్నివేశాలు వంటివి పిల్లల మనసుల్లో నాటుకుపోవడం, వాటి ప్రభావానికి గురై దూకుడుగా వ్యవహరించడం జరగవచ్చు. సెక్స్ సంబంధిత సన్నివేశాలు ఇంకా శారీరకంగా ఎదగని పిల్లల్లో అనుమానాలు రేకెత్తించవచ్చు. తరచూ టీవీ చూడటం‌ వల్ల ఫుడ్ విషయంలో సమయం, నియంత్రణ కోల్పోవడం, ఊబకాయం సమస్యలు తలెత్తడం జరగవచ్చు. కొన్ని కార్యక్రమాలు యువతలో తప్పుడు భావాలకు కారణం కావచ్చు. అలాంటి ప్రోగ్రాములకు పిల్లలు, యువత అడిక్ట్ కావచ్చు. టీవీల్లో తమ అభిమాన పాత్రదారులు సిగరెట్ తాగడం, మందు కొట్టడం, కిస్ చేయడం వంటివి పరిస్థితులు పిల్లల్ని తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

అనుకరణ మంచిది కాదు

టీవీల్లోని వివిధ ప్రకటనలు, కార్యక్రమాలు పిల్లలు చూసినప్పుడు అందులోని హీరోలను, మోడల్స్‌ను అనుసరించే ప్రయత్నం చేస్తారు. తాము కూడా హీరోల్లాగా లేదా సూపర్‌మెన్‌ లాగా గాలిలో ఎగరొచ్చని, పైనుంచి దూకవచ్చని గనుక పిల్లలు భావించి, ఆ ప్రయత్నం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటివి పిల్లలు అనుసరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు పలు సందర్భాల్లో పేరెంట్స్ ఆరోపించిన సందర్భాలు ఉన్నాయి. చిన్న పిల్లల్లో, టీనేజర్స్‌లో వివిధ నేర ప్రవర్తనలకు టెలివిజన్ కారణం కావచ్చు. వీటిలోని బాక్సింగ్, టామ్ అండ్ జెర్రీ వంటి ప్రోగ్రామ్‌లు పిల్లలను ప్రభావితం చేస్తుంటాయి. తోటి పిల్లలపైనో, సరదాగానో టీవీల్లోని ఈ పాత్రలకు సంబంధించిన ప్రవర్తన పిల్లలు అనుసరిస్తూ ఉంటారు.


హింసాత్మక ప్రవృత్తిని నివారించేదెలా?

పిల్లలు టీవీల్లోని హింసా కార్యక్రమాలకు ప్రభావితం అయ్యే చాయిస్ ఉంటుంది. బాధ, నొప్పి, బంధం, ప్రేమ వంటి అంశాలను పట్టించుకోని నేర స్వభావం కలుగవచ్చు. టీవీల్లోని కార్యక్రమాల ప్రభావంతో తమ చుట్టూ ఉన్న పరిసరాలు, ప్రపంచం గురించిన భయంకర ఆలోచనలతో పిల్లలు ఇబ్బందులకు గురి కావచ్చు. ప్రవర్తనలో ప్రతికూల మార్పులు రావచ్చు. ఇతరుల పట్ల దురుసుగా, దూకుడుగా వ్యవహరించవచ్చు. అందుకే పేరెంట్స్ పిల్లలు టీవీ చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వారు విననప్పుడు వారిని సపరేట్‌గా చూసే అవకాశం ఇవ్వకుండా వారితో కలిసి టీవీ చూడాలి. నేరపూరిత హింసాయుత కార్యక్రమాలు పర్యవసానాల గురించి వివరించాలి.

పిల్లలకు వాస్తవాలను చెప్పాలి. ఆయా కార్యక్రమాల్లో చూపించేవన్నీ కరెక్టు కాదని, కల్పితాలని వివరించాలి. హింస లేకుండా సంఘర్షణలు ఎలా పరిష్కారం అవుతాయో పిల్లల్ని అడగాలి. ఎలా పరిష్కరించవచ్చో చెప్పాలి. అలాగే వినోద కార్యక్రమాలలోని కొన్ని సన్నివేశాలు, హింస వాస్తవం కాదని తెలపాలి. హింసాత్మక పాత్రలకు ప్రభావితం కాకుండా చూడాలి. పరస్పరం సహాయ సహకారాలు అందించుకునే సన్నివేశాలు, ప్రేమానురాగాలు పెంచే పాత్రలు, ప్రోగ్రామ్స్ చూసేలా ప్రోత్సహించవచ్చు.

పిల్లలు టీవీ చూసే బదులు వారికి ఉపయోగపడే ఇతర పనుల్లో నిమగ్నమయ్యేలా చూడాలి. చదువుకోవడం, హోం వర్క్ చేసుకోవడం ప్రోత్సహించాలి. ఆలోచనాత్మక కథలు చదివించాలి. నైతిక విలువలు, సైన్స్ గురించిన విషయాలు తెలిసే పుస్తకాలను కొని పిల్లలు చదివేలా చూడాలి.


పేరెంట్స్‌కు నిపుణుల సూచనలు

* పిల్లలు టీవీ చూడకపోవడం మంచిదని నచ్చజెప్పాలి. పిల్లలు వినని పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటప్పుడు రోజుకూ ఒకటి లేదా రెండు గంటల కంటే ఎక్కువ సమయం టీవీ చూసేందుకు అవకాశం ఇవ్వొద్దు.

* పిల్లల స్టడీ రూమ్ లో, బెడ్ రూమ్ లో టీవీలను పెట్టకూడదు.

* రెండేళ్ల కంటే తక్కువ ఏజ్ కలిగిన పిల్లల టీవీ చూసే అవకాశం అస్సలు ఇవ్వొద్దు. మాటలు, ఆటలు, పాటలు, చదవడం వంటి కార్యకలాపాల్లో వారు నిమగ్నమయ్యేలా చూడాలి.

* పిల్లలు, టీనేజర్స్ టీవీల్లో ఏం చేస్తున్నారనేది వారికి తెలియకుండా పేరెంట్స్ ఓ కన్నేసి ఉంచాలి. తప్పదనుకున్నప్పుడు పిల్లలు టీవీ చూస్తుంటే గనుక వారికి ఉపయోగపడే కార్యక్రమాలనే చూసేలా ప్రోత్సహించాలి. నాలెడ్జ్ పరమైన సమాచారం, చదువు, హింసకు తావులేని సన్నివేశాలు, హెల్పింగ్ నేచర్ ప్రోగ్రామలు చూసేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

* పిల్లలతో పాటు పేరెంట్స్, లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు పిల్లలతో పాటు టెలివిజన్ కార్యక్రమాలను కలిసి చూడాలి. సందర్భానుసారంగా కంటెంట్ గురించి వివరించాలి.

* వీక్లీ వన్స్ టీవీ చూడటం పూర్తిగా ఆపేయాలి. మీరు ఆమోదించే కార్యక్రమాలనే మిగతా రోజుల్లో పిల్లలు కొద్దిసేపు చూసేలా ప్లాన్ చేయాలి. తినేటప్పుడు, నిద్ర పోయే వేళ టీవీని అస్సలు చూడవద్దు.

*పిల్లలు తమ పేరెంట్స్‌ను అనుకరిస్తారని తెలిసిందే. వారి ముందు పేరెంట్స్ ఎక్కువగా టీవీ చూస్తుంటే పిల్లలు కూడా చూస్తారు. కాబట్టి పిల్లలతో కలిసి చూసే విషయంలో ఓ క్లారిటీ ఉండాలి.

*టీవీలోని ప్రోగ్రాముల్లో ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది నమ్మాలి. ఏది నమ్మ కూడదు. అనే విషయాలు పిల్లలకు చెప్పాలి.



వాణిజ్య ప్రకటనలు-ప్రభావాలు

ఆరు నుంచి ఎనిమిదేండ్ల కంటే తక్కువ ఏజ్ గల పిల్లలు ప్రకటనల ఉద్దేశం పట్ల అవగాహన కలిగి ఉండరు. అడ్వర్టయిజ్ మెంట్స్‌కు వివిధ టీవీ ప్రోగ్రాములకు మధ్య తేడాను వారు గుర్తించలేరు. పైగా వాటికి త్వరగా ప్రభావితం అవుతుంటారు. తరచుగా స్క్రీన్‌పై చూసే ప్రొడక్ట్స్‌ను ప్రస్తావించడం, అలాంటివి కావాలని పిల్లలు మారాం చేయడం చేస్తుంటారు. దీనిని బట్టి అవి పిల్లల్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పిల్లలు వాటిని చూడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని చూడాల్సి వచ్చినా వాటి గురించిన అంశాలపై చర్చించి పిల్లలకు అవగాహన కల్పించాలని మానసిక, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి : మహీంద్రా కంపెనీ కల్చరల్ ఫెస్ట్ కు చీఫ్ గెస్ట్ గా స్వీట్ కార్న్ వెండర్..!



Tags:    

Similar News