సూసైడ్ బెదిరింపుతో సెల్ టవర్ ఎక్కింది.. ఓ కందిరీగ వల్ల ఇలా..?! (వీడియో)
ఒక్కోసారి బెడిసికొట్టి, అవి మనకే మేలు చేస్తాయి. Wasp Swarm Attack Saved A Women Climbs Mobile Tower Threatening Suicide
దిశ, వెబ్‌డెస్క్ః ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు ఒక్కోసారి బెడిసికొట్టి, అవి మనకే మేలు చేస్తాయి కూడా. ఇలాంటి సంఘటనే ఇటీవల కేరళలో చోటుచేసుకుంది. కుటుంబ గొడవల వల్ల మొబైల్ టవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన మహిళను కందిరీగలు చుట్టుముట్టాయి. చచ్చిపోవడానికి వెళ్లిన ఆమె ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని టవర్‌పై నుంచి కిందకు దిగక తప్పలేదు. కేరళలోని అలప్పుజా పట్టణంలోని కాయంకుళంలో సోమవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో వివాదాల కారణంగా భర్త తీసుకెళ్లిన తన బిడ్డను తిరిగి ఇవ్వకపోతే దూకేస్తానని బెదిరిస్తూ, ఆమె బీఎస్ఎన్ఎల్ మొబైల్ టవర్ ఎక్కింది. ఆమెను కిందికి దింపేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆమె టవర్ ఎక్కే హడావిడిలో కందిరీగ గూడును గమనించలేదు. తమ గూడును భంగపరిచిన మహిళలను కందిరీగలు అకస్మాత్తుగా చుట్టుముట్టాయి. కొన్ని ఆమెను కుట్టడంతో నొప్పి, మంటకు తాళలేక ఆమె కేకలు వేస్తూ, వేగంగా కిందకు దిగడం ప్రారంభించింది. కాస్త ఎత్తులో ఉండగా కాలుజారి, పోలీసులు పట్టుకున్న వలలో పడింది. స్థానిక టీవీ ఛానళ్లలో ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రసారం చేయగా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కందిరీగలే లేకుంటే ఆమె కిందికి దిగి ఉండేది కాదని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తమిళనాడుకు చెందిన ఈ మహిళ ఆసుపత్రిలో చేరిందని, పరిస్థితి నిలకడగా ఉందని కాయంకులం పోలీసు అధికారులు తెలిపారు.