Vultures : అంతరిస్తున్న రాబందులు.. ప్రమాదంలో మానవ ఆరోగ్యం!

రాబందులు.. కాస్త పొడువాటి మెడ, పదునైన ముక్కును కలిగి ఉండే ఈ పక్షుల పేరు వినగానే చాలా మందికి చనిపోయిన జంతువులను పీక్కు తింటాయనే మాట గుర్తుకు వస్తుంది. మరి కొందరు వీటిని దురదృష్టానికి నిదర్శనంగా, అపశకునంగా భావిస్తుంటారు.

Update: 2024-07-19 13:45 GMT

దిశ, ఫీచర్స్ : రాబందులు.. కాస్త పొడువాటి మెడ, పదునైన ముక్కును కలిగి ఉండే ఈ పక్షుల పేరు వినగానే చాలా మందికి చనిపోయిన జంతువులను పీక్కు తింటాయనే మాట గుర్తుకు వస్తుంది. మరి కొందరు వీటిని దురదృష్టానికి నిదర్శనంగా, అపశకునంగా భావిస్తుంటారు. కానీ పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో, మానవ మనుగడలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయని తెలుసా?.. భూమిపై అనేక అంటు వ్యాధుల వ్యాప్తిని అడ్డుకోవడంలోనూ తమవంతు పాత్ర పోషిస్తాయని, అవి మానవాళి మనుగడలో సహాయపడే నిజమైన బంధువులని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ ప్రస్తుతం వాటి సంఖ్య ఇండియాలో 99.9 శాతం వరకు క్షీణించింది. ఇది పర్యావరణ సమతుల్యతపై, మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

మనుగడకు ముప్పు

నిజానికి భూమిపై మానవ మనుగడ కేవలం మనుషుల మధ్య మంచి సంబంధాలు, అభివృద్ధి, సంక్షేమాల వంటి అంశాలపైనే ఆధారడి ఉండదు. ప్రకృతి పరిణామాలు, పర్యావరణ వ్యవస్థలు, జీవ వైవిధ్యాలు కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తమవంతు పాత్ర పోషిస్తాయి. ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలిగే పరిస్థితులను క్రియేట్ చేస్తాయి. అలాంటి వాటిలో రాబందులు కూడా ఉన్నాయి. ఇవి చనిపోయిన జంతు కళేబరాలను తినడంవల్ల వాటి బ్యాక్టీరియా, వైరస్‌ల పుట్టుకను, వ్యాప్తిని, నీటి, పర్యావరణ కాలుష్యాలను అడ్డుకునేవి. కానీ వాటి సంఖ్య భారత దేశంలో ఇప్పుడు 99.9 శాతం క్షీణించింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొత్తం 23 రాబందు జాతులలో 17 శాతం తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి.

కారణాలేమిటి?

రాబందులు అంతరించి పోవడానికి ఆధునిక మానవ చర్యలే కారణం. ముఖ్యంగా భారత్‌లో పశువుల చికిత్సలో పెయిన్ కిల్లర్‌గా వాడే డైక్లో ఫినాక్ మెడికేషన్స్ అందుకు కారణమని 2004 నాటి అధ్యయనంలో తేలింది. ఎందుకంటే ఈ మందులు ఇచ్చిన జంతువుల కళేబరాలను రాబందులు తిన్నప్పుడు వాటి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో అవి అనారోగ్యాలు, కిడ్నీల వైఫల్యం వంటివి సంభవించి చనిపోతూ వచ్చాయి. ఆ తర్వాత కేంద్ర సర్కారు ఈ ఔషధాన్ని పశువులకు వినియోగించడంలో నిషేధించినప్పటికీ, ప్రత్యామ్నాయ ఔషధాలు అందుకు భిన్నంగా లేకపోవడం రాబందుల క్షీణతకు దారితీశాయి. ఒక నివేదిక ప్రకారం 1990లలో 10 నుంచి 16 కోట్ల వరకు రాబందులు భారత్‌లో ఉండేవి. 1992 నుంచి 2007 మధ్య వీటి సంఖ్య 97 శాతంకంటే ఎక్కువగా పడిపోగా, ప్రస్తుతం 99.9 శాతం పడిపోయింది.

బ్యాక్టీరియాలు, వైరస్‌ల పుట్టుక

గ్రామాలు, అడవులు, కొండ ప్రాంతాలు, వివిధ చోట్ల జంతువులు చనిపోయినప్పుడు వాటి కళేబరాలు కుళ్లిపోవడం, నీటి వనరుల్లోకి కొట్టుకు రావడం కారణంగా కాలుష్యం ఏర్పడి రోగాలు వ్యాపిస్తాయి. అలాగే కుళ్లిన జంతు కళే బరాల్లో హానికరమైన బ్యాక్టీరియాలు, వైరస్‌లు పుట్టుకొస్తాయి. ఇవి పర్యావరణ, గాలి మార్గాల ద్వారా మనుషులకు వ్యాపించి రోగాలకు కారణం అవుతాయి. అయితే రాబందుల సంఖ్య గణనీయంగా ఉన్నప్పుడు కళేబరాలను అవి తినడంవల్ల ఈ పరిస్థతి ఉండేది కాదు. ఇప్పుడు అవి 99.9 శాతం తగ్గడంతో రకరకాల వ్యాధులు పుట్టుకురావడం, వ్యాపించడం కారణంగా మావన మరణాల రేటు కూడా గతంకంటే 4 శాతం పెరిగింది.

రేబిస్ వ్యాధి వ్యాప్తి

ఇంగ్లండ్‌లోని బాత్ యూనివర్సిటీ పరిశోధకుల ప్రకారం ఇండియాలో రాబందుల సంఖ్య తగ్గడం రేబిస్ వ్యాధి వ్యాప్తికి కారణమవుతోంది. ఎందుకంటే ప్రకృతిలో జంతు కళేబరాలను ఇప్పుడు అడవి కుక్కలు, వీధి కుక్కలు తింటున్నాయి. అయితే ఇవి తాజా కళే బరాలను కాకుండా.. కుళ్లిన తర్వాత తినడం కారణంగా వ్యాపించే బ్యాక్టీరియాతో ముందుగా కుక్కలకు రేబిస్ వ్యాధి సోకుతుంది. తద్వారా అవి కాటు వేయడంవల్ల మనుషులకు కూడా వ్యాపిస్తుంది. 1992 నుంచి 2006 మధ్య 3.83 కోట్ల కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా రాబందుల సంఖ్య గణనీయంగా తగ్గడంవల్ల 1993 నుంచి 2006 మధ్య వివిధ వ్యాధుల వ్యాప్తిని అరికట్టే ఖర్చులు పెరగడంవల్ల భారత్ 34 బిలియన్ డాలర్లను నష్టపోయిందని నివేదికలు పేర్కొంటున్నాయి.

Tags:    

Similar News