వెరైటీ వెడ్డింగ్ కార్డు.. ఎంత ఎంబసీలో పని చేస్తే మాత్రం ఇలా ప్రింట్ చేస్తారా..?
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన ఘట్టం. మన జీవితంలో శాశ్వత బంధాన్ని స్వాగతం పలికే అద్భుత కార్యం.
దిశ, ఫీచర్స్: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన ఘట్టం. మన జీవితంలో శాశ్వత బంధాన్ని స్వాగతం పలికే అద్భుత కార్యం. అయితే పెళ్లికి బంధువులను ఆహ్వానించడానికి పెళ్లి కార్డు అనేది తప్పనిసరి. మేళతాళాలతో చుట్టాల ఇంటింటికి తిరుగుతూ నుదుటన బొట్టు పెట్టి మరీ, పెండ్లి పత్రికలు అందజేస్తుంటారు. ఒకవేళ ఇంట్లో ఎవరూ లేకపోతే గుమ్మానికి బొట్టు పెట్టి వెడ్డింగ్ కార్డు తలుపులకు కట్టి వస్తారు. అయితే కొంతమంది స్తోమతను బట్టి ప్రింట్ చేయిస్తారు. మరికొంత మంది గ్రాండ్‌గా ముద్రిస్తారు. కానీ ఇప్పుడు చూసే వెడ్డింగ్ కార్డు భిన్నంగా ఉంటుంది. అసలు విషయంలోకి వెళితే..
కువైట్ ఎంబసీలో పనిచేసే భారతీయ తెలుగు మహిళ రషీదా తన కొడుకు వివాహ పత్రికను పాస్‌పోర్ట్ టైప్‌లో తయారు చేయించారు. టక్కున చూస్తే అచ్చం పాస్‌పోర్ట్ మాదిరిగా కనిపించే విధంగా ప్రింటింగ్ చేయించారు. వెడ్డింగ్ పాస్‌పోర్ట్ అని అచ్చం పాస్‌పోర్ట్, వీసా మీద ఏ విధంగా అయితే లెటర్స్ ఉంటాయో ఆ విధమైన లెటర్స్ తో ప్రింట్ చేయించారు. అలాగే ఫ్లైట్ టికెట్ టైప్‌లో పోలిన రిసెప్షన్, పెళ్లిరోజు తేదీలను ముద్రించి కార్డును చూడముచ్చటగా తయారు చేశారు.
అందులో పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ పార్ట్ పేరుతో పెళ్లి రోజు తేదీలను సమయాన్ని పెళ్లి జరిగే ప్రదేశాన్ని వధూవరుల పేర్లను ముద్రించారు. మరొక ఫ్లైట్ టికెట్ పోలిన కార్డులు రిసెప్షన్ పాస్ అనే పేరుతో రిసెప్షన్ జరిగే సమయం తేదీ వధూవరుల పేర్లను ముద్రించి బంధుమిత్రులను ఆహ్వానిస్తున్నారు. వీరి వివాహం గోవా పక్కనే ఉన్న బెల్గావీలో జరుగుతుండగా రిసెప్షన్ మాత్రం ఆంధ్రప్రదేశ్ లోని గూడూరు జిల్లాలో పెళ్లి కుమారుని ఇంటి దగ్గర జరగనుంది. ఏది ఏమైనా కువైట్‌లో పనిచేస్తున్న రషీదా అనే మహిళ తన కొడుకు వివాహానికి అందరినీ ఆకట్టుకునే విధంగా తాను పనిచేసే ఉద్యోగాన్ని గుర్తు చేసే విధంగా పాస్‌పోర్ట్ నమూనాతో వివాహ పత్రికలను తయారు చేయించి బంధుమిత్రులను ఆహ్వానిస్తున్నారు. దీంతో తన వినూత్న ఆలోచనకు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.