Viral: కోతులు పెళ్లిళ్లు చెడగొడుతున్నాయంటూ ఆవేదన.. అక్కడ అడుగు పెట్టాలంటేనే..

కొన్ని విషయాలు వినడానికి విచిత్రంగా అనిపిస్తుంటాయి. ఫలానాచోట అలా జరిగిందని చెప్తుంటే.. వినేవారు సైతం ‘అవునా.. నిజమా!’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. ఇంకొన్నిసార్లు వెంటనే నమ్మశక్యంగా కూడా ఉండవు.

Update: 2024-09-19 06:24 GMT

దిశ, ఫీచర్స్ : కొన్ని విషయాలు వినడానికి విచిత్రంగా అనిపిస్తుంటాయి. ఫలానాచోట అలా జరిగిందని చెప్తుంటే.. వినేవారు సైతం ‘అవునా.. నిజమా!’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. ఇంకొన్నిసార్లు వెంటనే నమ్మశక్యంగా కూడా ఉండవు. కానీ అలాంటి సంఘటనలే పలువురికి సమస్యగా మారుతుంటాయి. ఆ కోవకు చెందిన న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ గ్రామంలోని ప్రజలు కోతులు తమ పిల్లల పెళ్లిళ్లు చెడగొడుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అదే ఊరు? అసలేం ఏం జరుగుతోంది?

అది బిహార్ రాష్ట్రంలోని రతన్‌పూర్ గ్రామం..పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి సంబంధాలు వస్తున్నాయని, అయితే ఇటీవల ఓ సంబంధం వచ్చినప్పటికీ.. పెళ్లి కొడుకు తరపువారు ఓకే చేసుకోకుండానే వెళ్లిపోయారని ఆ ఊరిలోని ఓ వ్యక్తి అవేదన వ్యక్తం చేశాడు. అతనొక్కడే కాదు, ఆ గ్రామంలోని చాలా మంది తల్లిదండ్రులు ఇదే చెప్తున్నారు. ఎందుకంటే.. అక్కడ కోతుల బెడద కారణంగా పెళ్లిళ్లు, వివిధ శుభ కార్యాలు ప్రశాంతంగా జరగడం లేదట. ఎంత పడిగాపులు కాసినా.. ఏదో ఒక సందర్భంలో కోతులు గుంపుగా వచ్చి పెళ్లి ఏర్పాట్లను, వండిన వంటకాలను చిందర వందర చేయడం, అలాగే పెళ్లికి వచ్చే వారిపై దాడులకు పాల్పడటం వంటివి చేస్తుంటాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చాలా మంది రతన్‌పూర్ గ్రామంలో పెళ్లి అంటేనే భయపడి రాకుండా మానేస్తున్నారని స్థానికులు చెప్తున్నారు.

కొందరు తమ ఇండ్లల్లో పెళ్లి ఫిక్స్ చేసుకున్నప్పటికీ వధూ వరులు పెళ్లి పీఠల మీదకు రాకముందో, సరిగ్గా వచ్చాకనో ఎవరి హడావిడిలో వాళ్లు ఉండగా, అక్కడ పెట్టిన వస్తువులు, స్వీట్లు, చివరికి జీలకర్ర బెల్లం వంటివి కూడా కోతులు ఎత్తుకుపోయిన సంఘటనలు జరిగాయని రతన్‌పూర్ గ్రామస్తులు పేర్కొంటున్నారు. కేవలం పెళ్లిళ్ల విషయంలోనే కాదు, వ్యవసాయ పొలాల్లో పంటలు నాశనం చేయడం, పగటిపూట ఇండ్లల్లో చొరబడి ఆహారం ఎత్తుకుపోవడం వంటివి కోతులు చేస్తున్నాయని చెప్తున్నారు. వాటి బెదడ నుంచి తమ గ్రామాన్ని రక్షించేందుకు ప్రభుత్వమే ఒక పరిష్కారం చూపాలని అక్కడి జనాలు కోరగా.. అందుకోసం ఏం చేయాలని సర్కార్ ఆలోచిస్తోందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. చివరికి కోతులు కూడా పెళ్లిళ్లు చెడగొడుతున్నాయి. ఇదేం విచిత్రమో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పలువురు. 


Similar News