దిశ, ఫీచర్స్ : బంధాలను కాపాడుకునేందుకు ఇరుపక్షాలు సిద్ధంగా ఉంటే తప్ప నిలబడలేవు. దంపతులు కలిసి సాగించాల్సిన ప్రయాణంలోనూ ఒడిదొడుకులు తప్పవు. కానీ ఆ మార్గంలో దొర్లే చిన్న తప్పిదాలే.. వైవాహిక బంధానికి ముగింపు పలికే వరకు లాక్కెళ్తాయి. ఒకప్పటితో పోల్చితే ఇటీవల కాలంలో డివోర్స్ రేటు పెరిగేందుకు అనేక కారణాలున్నాయి. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో కాలక్రమేణా చోటుచేసుకున్న సాంస్కృతిక మార్పులు పెళ్లి అర్థాన్ని పునర్నిర్వచించడంలో సాయపడ్డాయి. ప్రతిగా మారుతున్న నమ్మకాలు, ఒకప్పటి కళంకాలను సాధారణీకరించడంతో పాటు చాలావరకు తొలగించాయి కూడా. క్రమంగా వివాహ బంధంలోనూ వ్యక్తిగత స్వేచ్ఛ, సంతృప్తికి ప్రాధాన్యతనిస్తున్న నేటి జంటలు.. తాము కోరుకునేవి వేర్వేరు దారులని గ్రహిస్తూ బంధానికి గుడ్‌బై చెప్పేస్తున్నాయి. ఇప్పటి సమాజంలో విడాకులు నిత్యకృత్యమే కానీ అసలు జంటలు చేస్తున్న పొరపాట్లు ఏంటి?
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ నాగచైతన్య-సమంత జంట ఇటీవలే విడిపోగా.. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్-ఐశ్వర్యలు తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలికారు. అయితే సెలబ్రిటీలనే కాదు, వివాహం జరిగిన తొలి ఐదేళ్లలో దాదాపు 22 శాతం జంటలు ఏదో రకమైన 'వైవాహిక అంతరాయం' అనుభవిస్తున్నట్లు పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. ఇక పెళ్లయిన 20 ఏళ్ల తర్వాత కూడా 53 శాతం మంది తమ భాగస్వామి నుంచి దూరం అవుతున్నారు.
ఇంచుమించు ఆలుమగలు అందరూ తమ వైవాహిక జీవితంలో అశాంతి, అసంతృప్తి లేదా నిరాశ వంటి సమస్యలు ఎదుర్కొంటుండగా.. ఆ టైమ్‌లో ఒకరితో మరొకరు వ్యవహరించే విధానంపైనే ఆ బంధం బలపడుతుందా? లేదా అక్కడితో ముగుస్తుందా? అన్నది ఆధారపడుతుంది. విడాకులకు మూలం తగాదాలు, వాదనలే కాగా.. తప్పుగా మాట్లాడటం, ఊహించడం వారి మధ్య దూరాన్ని పెంచుతుంది. అయితే గృహ హింస, శారీరక లేదా భావోద్వేగ దుర్వినియోగం వంటి అంశాలే కాక ఆర్థిక సమస్యలు కూడా విడాకులకు కారణంగా నిలుస్తున్నాయి.
చీటింగ్ :
విడాకులకు సంబంధించి ప్రధాన కారణాల్లో 'మోసం' ఒకటి. నేటి కమ్యూనికేషన్ ప్రపంచంలో.. భౌతిక వ్యవహారాలతో పాటు భావోద్వేగ వ్యవహారాలూ ముఖ్యమే. సామాజిక మాధ్యమాల్లో తమ 'ఎక్స్' లవర్స్‌తో మళ్లీ కనెక్ట్ కావడం సులభమే. కానీ ఇదే వివాహ బంధంలో చిచ్చురేపుతుంది. ఒక్కసారి నమ్మకం కోల్పోతే ఇక ఆ బంధం బీటలు వారాల్సిందే. ఇదే కాదు ఎలాంటి ఎఫైర్ ఉన్నా అది వివాహ ఒప్పందాన్ని విచ్ఛిన్నం చేస్తుందని గ్రహించాలి. ఇలాంటి విషయాల్లో పార్టనర్స్ ఇద్దరూ తమ వైవాహిక బంధానికి విలువనిస్తూ ఇతర సంబంధాలను అవాయిడ్ చేయడం వల్ల తమ దాంపత్యాన్ని అద్భుతంగా లీడ్ చేయొచ్చని కౌన్సిలర్స్ సూచిస్తున్నారు.
మనీ ప్రాబ్లమ్స్ :
విడాకులకు 'డబ్బు' కారణం కాదు కానీ పేదరికంలో జీవించడం మాత్రం కాస్త ఒత్తిడితో కూడుకున్న వ్యవహారం. పోరాటాలకు దారితీసే ఆర్థిక ఒత్తిళ్లు విడాకులకు కారణం కావచ్చు. ఇక సక్సెస్‌ఫుల్ ఉమెన్ విషయంలో 'డబ్బు' సంబంధిత సమస్య విషయానికొస్తే.. ప్రస్తుత కాలంలో వారు తమ జీవిత భాగస్వాములను మించి సంపాదిస్తున్నారు. ఈ పరిణామాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతుండగా.. ఇద్దరి మధ్య మాటల యుద్ధాలు, అహం పెరిగిపోయి చివరకు ఆ బంధం దారి తప్పుతుంది. అదే దంపతులిద్దరూ కలిసి ఆమోదయోగ్యమైన లెక్కలేసుకుని, సంసారాన్ని ముందుకు తీసుకెళ్తే అగాథాన్ని అవలీలగా దాటేయొచ్చు.
అననుకూలత :
జీవితంలో మతం, ఆచార సంప్రదాయాలతో పాటు మనం ఎక్కడ జీవించాలనుకుంటున్నాం? ఎలా జీవించాలనుకుంటున్నాం? వంటి విషయాల్లో సమలేఖనం చేయనప్పుడు ఘర్షణ చోటుచేసుకుంటుంది. ఉదాహరణకు భర్త తన ఉద్యోగావసరాల కోసం ఢిల్లీ వెళ్లాలనుకుంటున్నాడు, కానీ భార్య మాత్రం ఫ్యామిలీ మూలాలున్న బెంగళూరులోనే ఉండాలనుకుంటుంది. ఈ విషయం గురించి పెళ్లికి ముందెప్పుడూ చర్చించకపోవడమే తర్వాత గొడవలకు దారితీస్తుంది. ఇక కపుల్స్ ఇద్దరూ వేర్వేరు మతస్థులైతే.. తమ పిల్లలను ఎవరి మత విశ్వాసంతో పెంచాలనే విషయంలో ఏకాభిప్రాయం కుదరదు. ఇలాంటి అనుకూలతను ఎదుర్కోవడం అంత సులభం కాదు. ప్రత్యేకించి జీవిత భాగస్వామి కాలక్రమేణా ఊహించని రీతిలో మారిపోతే.. ఆ బంధం బలహీనపడుతుంది. కౌన్సిలింగ్ సాయంతో సమస్యను అధిగమించి జీవితాన్ని చక్కదిద్దుకోవడమే ప్రధానం.
వాదించడం మాని తమ ఆలోచనలు, భావాలను ఒకరికొకరు అర్థవంతంగా కమ్యూనికేట్ చేస్తే 90శాతం సమస్యలు సాల్వ్ అవుతాయని కౌన్సిలర్స్ సూచిస్తున్నారు. బంధం బలపడాలంటే.. ఇద్దరి మధ్యనున్న సంఘర్షణ వారి కనెక్షన్‌ను మెరుగుపరిచే విధంగా పరిష్కరించబడాలి. కానీ అది బ్లేమ్ గేమ్‌గా మారి, అన్ని వేళ్లు ఒకరివైపే చూపడం సరికాదన్నది గ్రహించాలి. ప్రపంచం, ప్రజలు ఎప్పటికప్పుడు మారుతున్నట్లే.. కాలక్రమేణా జంటలు కూడా వేర్వేరు విషయాలను కోరుకోవచ్చు. ప్రత్యేకించి యవ్వనంలో అనుభవించిన ఆలోచనలకు, ఇప్పటికి తేడాలు ఉండొచ్చు. అంతమాత్రాన అప్పటితో పోల్చుతూ విభేదించడం సరికాదు. ఇక చాలా మంది జంటలు సాన్నిహిత్యాన్ని కోల్పోతారు. అయితే ఇది సెక్స్ గురించి మాత్రమే కాదు. ముఖ్యంగా మహిళలకు భావోద్వేగ సాన్నిహిత్యం లేకపోవడమే ఇందుకు కారణం. ఇక నుంచైనా జంటగా కూర్చొని పరస్పర బాధలు, సంతోషాలు, భవిష్యత్ ప్రణాళికలు రచించుకుంటే బంధం మరింత బలపడే అవకాశం ఉంది.
అదనంగా 'మ్యారేజ్ కౌన్సెలింగ్, రిలేషన్‌షిప్ ఎడ్యుకేషన్, ఫ్యామిలీ లా థెరపిస్ట్' వంటి వనరులు జంటల మధ్య సంఘర్షణను పరిష్కరించడంలో, విడాకులు అనివార్యమయ్యే ముందు ఆరోగ్యకరమైన వివాహాలను నిర్మించడంలో సాయపడతాయి. వివాహ భాగస్వాములు తమ అవాస్తవిక, నెరవేరని అంచనాల నిరాశను నివారించేందుకు ఓపెన్ మైండ్‌తో ఆలోచించగలగాలి. అప్పుడే తాము ఎదుర్కొనే సవాళ్లను అధిగమించేందుకు జంటగా ఒక్కటవుతారు.