మీకు తెలుసా? 2023లో అత్యధిక మంది గూగుల్ సెర్చ్ చేసిన హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవే..

ఇంకా ఆరు రోజులే.. ఇక మనం న్యూ ఇయర్‌లోకి అడుగు పెట్టబోతున్నాం.

Update: 2023-12-24 06:33 GMT

దిశ, ఫీచర్స్: ఇంకా ఆరు రోజులే.. ఇక మనం న్యూ ఇయర్‌లోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ ఏడాదిలో మన అనుభవాలను, జ్ఞాపకాలను పదిలపరుచుకొని, వచ్చే ఏడాదిలో మరింత ఉత్సాహంగా ఉండాలని కోరుకోవడం సహజమే. అదే సందర్భంలో 2023లో జరిగిన పరిణామాలను కూడా గుర్తు చేసుకుంటాం. అలా ముఖ్యమైన అంశాలపై ఫోకస్ పెట్టినప్పుడు 2023లో ఎక్కువమంది ప్రధానంగా ఐదు ఆరోగ్య సమస్యల గురించి గూగుల్‌లో సెర్చ్ చేశారు. అవేంటో చూద్దాం.

హై కొలెస్ట్రాల్ 

ఈ ఏడాది చాలామంది ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై గూగుల్ సెర్చ్ చేయగా అందులో హై కొలెస్ట్రాల్ నివారణ టిప్స్ కోసం అత్యధికమంది ఆన్‌లైన్‌లో వెతికారు. వాస్తవానికి బాడీలో కొలెస్ట్రాల్ పెరగడం అనేది స్ట్రోక్, గుండెపోటు వంటి ఇతర ప్రాణాంతక అంశాలతో ముడిపడి ఉంటుంది. అందుకే అందరి ఫోకస్ కొలెస్ట్రాల్ నివారణపై ఉంటుందనడంలో సందేహం లేదు. హోమ్ రెమిడీస్ విషయానికి వస్తే ధమనులలో పేరుకుపోయిన వ్యర్థాలను, కొవ్వును క్లియర్ చేయడంలో కొత్తిమీర నీరు, సెలెరీ టీ, ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్స్ దోహద పడతాయి. కాబట్టి చాలామంది వీటికోసం వెతికారట.

డయాబెటిస్

చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఇప్పుడు సర్వసాధారణమై పోయింది. అయితే చక్కెర కలిగిన పదార్థాలు తీసుకోకపోవడం, వివిధ ఆహారాలు తీసుకోవడం దీని తీవ్రతను తగ్గిస్తుంది. ఈ ఏడాది అత్యధిక మంది మధుమేహాన్ని అందుపులో ఉంచడానికి, అసలు రాకుండా ఉండటానికి, దాని నివారణకు తీసుకోవాల్సిన ఆహారం, జాగ్రత్తల గురించి గూగుల్‌లో సెర్చ్ చేశారు. హోమ్ రెమిడీస్ విషయానికి వస్తే ఓట్స్ తీసుకోవడం, ఉసిరి రసం, మెంతులు వంటివి డయాబెటిస్ నివారణకు సహాయపడతాయి.

యూరిక్ యాసిడ్

మూత్రంలో మంట లేదా అధిక యూరిక్ యాసిడ్ ప్రాబ్లం నుంచి బయటపడేందుకు ఏం చేయాలనే అంశంపై 2023లో అత్యధిమంది గూగుల్ సెర్చ్ చేశారు. ఇక చిట్కాల విషయానికి వస్తే బార్లీ వాటర్ తాగడం, ఎక్కువగా నీరు తాగడం, ఫైబర్ కంటెంట్ ఫుడ్స్ తీసుకోవడం యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్‌ను క్లియర్ చేయడంలో దోహదపడే హోమ్ రెమిడీస్‌గా ఉన్నాయి.

హై బ్లడ్ ప్రెజర్

హై బీపీని కంట్రోల్‌లో ఉంచడానికి ఏం చేయాలనే విషయాన్ని అత్యధిక మంది గూగుల్ సెర్చ్ చేశారు. దీనికి హోమ్ రెమిడీస్ ఏంటనేది ఆన్‌లైన్‌లో వెతికారు. తగినంతగా వాటర్ తాగడం, నిమ్మరసం, ఫెన్నెల్ టీ వంటివి తీసుకోవడం, మనసు ప్రశాంతంగా ఉంచుకునే జీవన శైలిని అలవర్చుకోవడం వంటివి హైబీపీ నివారణ చిట్కాల్లో భాగంగా ఉన్నాయి.

ఒబేసిటీ

వరల్డ్ వైడ్‌గా చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో ఒబేసిటీ ఒకటి. అధిక బరువు, ఊబకాయం తగ్గించుకోవడానికి ఏం చేయాలి? ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి? అనే సమాచారం కోసం అత్యధిక మంది 2023లో సంవత్సరంలో గూగుల్ సెర్చ్ చేశారు. బొప్పాయి తినడం, గోరువెచ్చని నీటిలో తేనె లేదా నిమ్మరసం కలిగి తాగడం, మితంగా తినడం, వ్యాయామాలు చేయడం వంటివి ఒబేసిటీని సమస్య నివారణ చిట్కాలుగా ఉన్నాయి.


Similar News