ఆలోచనే ఆయుధం.. విజ్ఞానానికి, వికాసానికి అదే ఆధారం

కొన్ని ఆలోచనలు మనలో విజ్ఞానాన్ని, వికాసాన్ని పెంపొందిస్తే.. మరికొన్ని అజ్ఞానానికి కారణం అవుతాయి. అగాధంలోకి నెట్టేస్తాయి. అందుకే 'వేయి ఆలోచనలు సంఘర్షించనివ్వండి..

Update: 2023-01-02 03:47 GMT

దిశ, ఫీచర్స్ : కొన్ని ఆలోచనలు మనలో విజ్ఞానాన్ని, వికాసాన్ని పెంపొందిస్తే.. మరికొన్ని అజ్ఞానానికి కారణం అవుతాయి. అగాధంలోకి నెట్టేస్తాయి. అందుకే 'వేయి ఆలోచనలు సంఘర్షించనివ్వండి. కానీ అందులో నుంచి పుట్టుకొచ్చే మంచి ఆలోచనే ఆచరించండి' అంటుంటారు పెద్దలు. చెడు ఆలోచనలతో ప్రభావితమై దారితప్పుతున్న యువతకు ఇదొక మంచి సజెషన్‌‌. మీరొక ప్రశంసను పొంది ఉంటారు లేదా విమర్శను ఎదుర్కొని ఉంటారు. ఒక రంగంలో వైఫల్యం చెంది ఉంటారు.. మరొక రంగంలో విజయం సాధించి ఉంటారు. అందుకు కారణం కూడా ఆలోచనా తీరే అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. సమాజంలో మంచి-చెడు, సక్సెస్-ఫెయిల్యూర్ అనేవి కూడా ఆయా వ్యక్తుల పాజిటివ్, నెగెటివ్ ఆలోచనా విధానంపై ఆధారపడుతుందనేది నిపుణుల మాట.

ఎప్పుడూ చలాకీగా ఉండే వరుణ్ ఈ మధ్య మూడీగా ఉంటున్నాడు. ఏదో కోల్పోయినట్టు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతున్నాడు. తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. ఎందుకలా?.. ఉంటున్నావని తల్లి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోగా చిరాకు పడుతున్నాడు. ప్రతి విషయంలోనూ కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు. దీంతో అతడిని సైకియాట్రిస్టు వద్దకు తీసుకెళ్లారు. రెండు మూడు కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారా తెలిసిందేంటంటే.. క్లాస్‌లు ఎగ్గొట్టి సినిమాలు, షికార్లు, డ్రగ్స్, మందు అంటూ తిరుగుతున్న ఫ్రెండ్స్.. తనను కూడా అలాగే చేయమంటున్నారు. కానీ మనసు ఒప్పని వరుణ్ అది చేయలేక.. విషయాన్ని పెద్దలకు చెప్పలేక.. కుంగిపోయాడు. ఈ పరిస్థితుల్లో ఎదురైన ర్యాగింగ్, అవమానం గురించి చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోయాడు. ఓవర్ థింకింగ్, నెగెటివ్ థాట్స్ మెదడు నరాలపై ప్రభావం చూపడంతో నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలతో పాటు డిప్రెషన్‌కు గురయ్యాడు. ఇందుకు కారణం అతని ఆలోచన తీరు. సమస్యకు పరిష్కారం దిశగా ఆలోచించకుండా, పగలు రాత్రి నిద్ర పోకుండా తదేకంగా ఆలోచించాడు. ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు. అంటే ఆలోచనల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి పై ఉదాహరణను పరిశీలించవచ్చు.

టెక్నాలజీని వాడుకునే తీరు

ఆ మధ్య ఓ బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనలో పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. నిందితులు నేరపూరిత ఆలోచనలతో ప్రభావితం అయ్యారని తేలింది. తరచూ పోర్న్ సైట్లు చూడటం వల్ల ఆ అనుభూతి పొందాలన్న బలమైన ఆలోచన వారి మెదళ్లలోకి ఎక్కిందని భావించారు పోలీసులు. సైకాలజిస్టులతో కలిసి నిర్వహించిన ఇంటరాగేషన్‌లో ఇది స్పష్టమైంది. కొన్ని విషయాలు మనిషిని ప్రభావితం చేసే తీరును ఇక్కడ వారు తెలుసుకున్నారు. చుట్టూ ఉండే పరిసరాలు, స్మార్ట్ ఫోన్లలో యువత వీక్షించే కొన్ని సైట్లు, కొన్ని రకాల సోషల్ మీడియా వేదికలు, సినిమాలు యువతలో తప్పుడు ఆలోచనలకు, తప్పుడు నిర్ణయాలకు దారి తీస్తున్నాయి. అంటే ఈ ప్రభావం అందరిపైనా అలాగే ఉందా? అన్నప్పుడు కచ్చితంగా కాదంటున్నారు మానసిక నిపుణులు. టెక్నాలజీ రెండువైపులా పదునున్న కత్తి లాంటిది. అందులో మంచి ఆలోచనలు రేకెత్తించే అంశాలు, చెడును ప్రేరేపించే విషయాలూ ఉంటాయి. ఏది వాడుకున్నామనేది ఇంపార్టెంట్.

పిల్లలపై ఆలోచనా ప్రభావం

చిన్న పిల్లల మనసు తెల్లకాగితం లాంటిదని పలువురు మానసిక నిపుణులు తరచూ ప్రస్తావిస్తుంటారు. బాల్యంలో వారి మెదడులో ఎటువంటి ఆలోచనలు బలంగా నాటుకుపోతాయో అవే వారిని జీవితాంతం ప్రభావితం చేస్తుంటాయి. అందుకే పేరెంట్స్ తమ పిల్లలను ఎలాంటి ఆలోచనలతో పెంచాలని అనుకుంటున్నారో జాగ్రత్తగా నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు సామాజిక కార్యకర్త, మానవ సంబంధాల విశ్లేషకులు దీప్తీ శర్మ. మీరు మీ పిల్లలకు చిన్నప్పటి నుంచి నైతిక విలువలకు అలవాటు చేస్తే వారు అదే నేర్చుకుంటారు. పెద్దయ్యాక అటువైపే ఆలోచిస్తారు. చిన్నప్పటి నుంచి నెగెటివ్ ఆలోచనలు రేకెత్తించే అంశాలు వారి జీవితంలో ముడిపడే ఉంటే పెద్దయ్యాక కూడా వాటి ప్రభావమే ఉంటుంది. మరి సామాజిక, వాతావరణ పరిస్థితుల్లో పుట్టి పెరిగిన వారి ఆలోచనలు పెద్దయ్యాక అందరిలో ఒకేలా ఎందుకు ఉండవన్న సందేహాలూ ఇక్కడ తలెత్తుతుంటాయి. అయితే పిల్లలు ఎదిగేకొద్దీ కుటుంబం, సమాజం నుంచి నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడే కొందరు తమ ఆలోచనల్ని దేనిపై ఎక్కువగా కేంద్రీకరిస్తే వాటికి సంబంధించిన ఫలితాలు ప్రతిబింబిస్తుంటాయి. అయితే ఇవన్నీ బలమైన ఆలోచనలుగా ఉన్నప్పుడే ప్రభావం అధికంగా ఉంటుంది.

థింకింగ్ ట్యూన్ సెట్ చేసుకోండి

మనిషి ఆలోచన చాలా పవర్ ఫుల్. టీవీలో మనం చూడాల్సిన చానల్ లేదా కార్యక్రమాన్ని రిమోట్ ద్వారా సెట్ చేసుకొని లేదా క్లిక్ చేసి చూస్తాం. అలాగే మనం సమర్థవంతులుగా, గొప్ప ఆలోచనా పరులుగా, తెలివైన వారిగా మారాలంటే కూడా మన ఆలోచన అనే రిమోట్ కంట్రోల్‌ను యూజ్ చేయాలి. ఏ చానల్ బటన్ నొక్కితే ఆ చానల్ టీవీలో ప్రత్యక్ష ప్రసారమైనట్టు, ఏ ఆలోచనలకు ప్రాధాన్యతనిస్తే ఆ ఆలోచనల ప్రభావం పిల్లలపై, పెద్దలపై పడే అవకాశం ఉంది. అందుకే మిమ్మల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దే ఆలోచనలను, సక్సెస్ వైపు నడిపించే పాజిటివ్ థికింగ్‌ను ఆహ్వా నించాలి తప్ప.. అవస్థల పాలు చేసే నెగెటివ్ థింకింగ్‌, ఓవర్ థికింగ్‌ కాదు అంటున్నారు మానసిక నిపుణులు.

అతి ఆలోచనలకు అవకాశం ఇవ్వకండి

ఏ విషయమైనా సరే అది మీ కంట్రోల్‌లో ఉండాలి తప్ప, మనల్ని తీవ్రంగాను, నెగెటివ్‌గాను ప్రభావితం చేసేదిగా ఉండకూడదు. మీ వికాసానికి తోడ్పడాలి తప్ప, మిమ్మల్ని నిరాశకు గురిచేసేదిగా ఉండవద్దు. అలా ఉండాలంటే మీ ఆలోచనా తీరును సానుకూల దృక్పథం వైపు మరల్చుకోండి. ఓవర్ థింకింగ్‌ను ఎట్టి పరిస్థితిలో అలో చేయకండి. ఎందుకంటే అటువంటి ఆలోనా తీరు మిమ్మల్ని మానసికంగా బాధ పెడుతుంది. నిరాశా నిస్రృహలకు గురిచేస్తుంది. బీ కేర్ ఫుల్. మంచి ఆలోచన అపజయాలను ఛేదించే ఆయుధమైతే అతి ఆలోచన, నెగెటివ్ ఆలోచన మిమ్మల్ని ఛేదించే మారణాయుధంగా మారుతుంది. అందుకే మంచివైపే అడుగేద్దాం.

Also Read...

ప్రతి రోజూ గుడు తీసుకుంటే ఏమౌతుందో తెలుసా ? 

Tags:    

Similar News