న్యూయార్క్ ఫ్యాషన్ వీక్.. తొలి ట్రాన్స్ గర్ల్ మోడల్ రికార్డ్
దిశ, ఫీచర్స్ : ఇల్లినాయిస్(అమెరికా)కు చెందిన పదేళ్ల నోయెల్లా మెక్‌మహెర్ మోడలింగ్‌లో దూసుకుపోతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
దిశ, ఫీచర్స్ : ఇల్లినాయిస్(అమెరికా)కు చెందిన పదేళ్ల నోయెల్లా మెక్‌మహెర్ మోడలింగ్‌లో దూసుకుపోతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇదే క్రమంలో న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో నడిచి అతి పిన్న వయస్కురాలైన లింగమార్పిడి మోడల్‌గా చరిత్ర సృష్టించింది. పాపులర్ క్లాత్ బ్రాండ్ 'మెల్ అట్కిన్సన్'కు సంబంధించిన ట్రాన్స్ క్లాతింగ్ కంపెనీ కోసం ఆమె ఈ వేదికపై నడవడం విశేషం.
నోయెల్లా లైంగిక ధోరణిని అంగీకరించిన పేరెంట్స్ డీ మెక్‌మహెర్, రే మెక్‌మహెర్.. ఆమెకు ఇష్టమైన మోడలింగ్ రంగంలో రాణించేందుకు ప్రోత్సాహం అందిస్తు్న్నారు. ఈ క్రమంలోనే ఆ చిన్నారి ఫ్యాషన్ వేదికలపై ఆకట్టుకుంటూ పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాదు నవంబర్ వరకు ఆమె షెడ్యూల్స్ అన్నీ కాల్షీట్స్‌తో నిండిపోయాయి. ఇక ఏడేళ్ల వయసులోనే చికాగో ఫ్యాషన్ వీక్‌లో మొదటిసారి పాల్గొన్న నోయెల్లా.. రెండేళ్ల వయసులోనే తన లైంగిక ధోరణి గురించి తల్లిదండ్రులకు తెలియజేసింది. ఈ మేరకు నాలుగేళ్లకు సామాజికంగా పరివర్తన చెందితే ఏడేళ్లకు చట్టబద్ధంగా అమ్మాయిలా మారింది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం నోయెల్లా తల్లిదండ్రులు కూడా లింగమార్పిడి వ్యక్తులే. ఆమె తల్లి 'డీ' చైల్డ్ అండ్ ఫ్యామిలీ అడ్వొకేట్‌గా పనిచేస్తూనే పాఠశాలల్లో 'జెండర్ సపోర్ట్ ప్లాన్స్' అనుసరించేందుకు కృషి చేస్తోంది.
ట్రాన్స్‌జెండర్ మోడల్, కార్యకర్తగా గొప్ప పేరు సంపాదించాలని నోయెల్లా కోరుకుంటోంది. ఇప్పటివరకు ఆమె తన ర్యాంప్ వాక్ సహా ఇతర ఈవెంటస్ ద్వారా ఎల్‌జీబీటీక్యూ హక్కుల కోసం గొంతు వినిపించింది. సైతం ట్రాన్స్ సమస్యలపై అవగాహన పెంచేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వినియోగిస్తోంది. ఈక్రమంలోనే LGBTQ వ్యక్తుల కోసం ఆన్‌లైన్ కమ్యూనిటీ, మానసిక ఆరోగ్య వనరుల సేకరణ కోసం కృషి చేసే 'ఎల్‌జీబీటీక్యూ అండ్ ఆల్' అనే ఎన్‌జీవోకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది.
'నోయెల్లా ఎప్పుడూ దేనికీ భయపడదు. రన్‌వేపై నడుస్తూ ప్రజలను, కెమెరాలను తనదైన కోణంలో చూసేందుకు ఉత్సాహంగా ఉంటుంది. ప్రేక్షకుల కోసం ఎలా పని చేయాలో ఆమెకు బాగా తెలుసు. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో పార్టిసిపేట్ చేస్తున్న తొలి ట్రాన్స్ చైల్డ్ అయినందుకు మేము చాలా గర్విస్తున్నాం. ఆమె విశ్వాసం, దృఢ నిశ్చయానికి ఇది ఆరంభం మాత్రమే' అని నోయెల్లా పేరెంట్స్ పేర్కొన్నారు.