చూస్తుండగానే కుప్పకూలుతారు.. సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలు ఎలా ఉంటాయంటే..

అప్పటి వరకూ బాగానే ఉన్న ఓ వ్యక్తి సడెన్‌గా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయే సంఘటనలు అక్కడక్కడా జరుగుతుండటం మనం చూస్తూనే ఉంటాం.

Update: 2024-06-07 12:40 GMT

దిశ, ఫీచర్స్ : అప్పటి వరకూ బాగానే ఉన్న ఓ వ్యక్తి సడెన్‌గా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయే సంఘటనలు అక్కడక్కడా జరుగుతుండటం మనం చూస్తూనే ఉంటాం. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ కొందరు, డ్యాన్స్ చేస్తూ ఇంకొందరు, తమ తమ పనుల్లో నిమగ్నమై ఉండగా మరి కొందరు సైలెంట్‌గా హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు. అసలీ సైలెంట్ గుండెపోటు ఎందుకు వస్తుంది?, నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం

* శరీరంలో ముందస్తుగా లక్షణాలు కనిపిస్తే అలర్ట్ కావచ్చు. కానీ సైలెంట్ హార్ట్ ఎటాక్ అలా కాదు. వారాలు లేదా నెలల తరబడిగా గుండె దెబ్బతింటూ వస్తుంది కానీ ఈ విషయం బాధితులకు ఏమాత్రం తెలియదు. ఎందుకంటే ఆ తాలూకూ సింప్టమ్స్ వారిలో కనిపించవు. కుప్పకూలే వరకు తాము బాగానే ఉన్నామని అనుకుంటారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఇటీవల రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నమోదు చేయబడిన 8,05,000 గుండెపోటు కేసుల్లో 1,70,000 సైలెంట్ హార్ట్‌ ఎటాక్‌కు సంబంధించినవే ఉంటున్నాయి.

* నిశ్శబ్ద గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో లక్షణాలు పైకి కనిపించవు. అరుదుగా కొందరిలో గుండెల్లో మంట, జ్వరం లేదా ఛాతీ కండరాలు బిగుతుగా అనిపించడం వంటివి రెండు మూడు రోజులుగా కనిపించవ్చు. అలాంటప్పుడు టెస్టులు చేయించుకోవడం బెటర్. ఎందుకంటే కొన్నిసార్లు గుండెకు వెళ్లే రక్త ప్రవాహానికి ఆటంకం కలగడంవల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉంది. సైలెంట్ హార్ట్ ఎటాక్ కూడా గుండె కండరాలకు నష్టం కలిగిస్తుంది. అలాగని సైలెంట్ హార్ట్ ఎటాక్ వల్ల కచ్చితంగా ఛాతీ నొప్పి లేదా శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపించకపోవచ్చు.

* మరికొన్నిసార్లు సైలెంట్ హార్ట్ ఎటాక్‌కు ముందు బాధిత వ్యక్తి శరీరమంతా ప్రభావితం అవుతుంది. రెండు లేదా ఒక చేతిలో, అలాగే మెడ, దవడ, పొత్తికడుపు భాగంలో అసౌకర్యంగా అనిస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయితే అందరిలో ఇలాంటి లక్షణాలే ఉండకపోవచ్చు కూడా. వ్యక్తికీ వ్యక్తికీ మారుతుంటాయి. దీంతోపాటు సాధారణం కంటే ఎక్కువగా చెమటలు పట్టడం, వ్యాయామాలు చేయకపోయినా చెమటలు పడుతూ అలసి పోవడం సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే ముందు జరగవచ్చు. ఎందుకంటే మూసుకుపోయిన ధమనుల ద్వారా రక్తాన్ని పంప్ చేయడానికి గుండె ఎక్కువ శ్రమ పడటంవల్ల ఇలా జరుగుతుంది.

* నిపుణుల ప్రకారం.. గుండె కండరాలకు ఆక్సిజన్ తీసుకువెళ్లడానికి తగినంత రక్తం లభించనప్పుడు గుండెపోటు లేదా సైలెంట్ హార్ట్ ఎటాక్ వస్తుంది. వయస్సు మీదపడటం, వంశపారంపర్య లేదా జన్యుపరమైన సమస్యలు, హైబీపీ, హై కొలెస్ట్రాల్, ఊబకాయం, దీర్ఘాలిక ఒత్తిడి, రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరగడం వంటివి గుండెపోటుకు దారితీస్తాయి. ఇవన్నీ సైలెంట్ హార్ట్ ఎటాక్ రావడానికి కూడా కారణం అవుతాయి. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడం ద్వారా సైలెంట్ హార్ట్ ఎటాక్ బారినుంచి తప్పించుకోవచ్చు.


Similar News