Health tips: బాలింతల ఆరోగ్యానికి, తల్లిపాల సమృద్ధికి సహాయపడే ఫ్రూట్స్
బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలు చాలా మంచిది. పైగా తల్లిపాలలో ఉండే పోషక విలువలు శిశువులకు మరెందులోనూ లభించవు.
దిశ, ఫీచర్స్: బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలు చాలా మంచిది. పైగా తల్లిపాలలో ఉండే పోషక విలువలు శిశువులకు మరెందులోనూ లభించవు. అందుకే కనీసం ఆరు నెలలకు తగ్గకుండా శిశువుకు తల్లిపాలు తప్పనిసరి అంటారు గైనకాలజిస్టులు, పిడియాట్రిస్టులు. అయితే బిడ్డకు పాలివ్వాలంటే తల్లులు కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా.. మరి తల్లిపాల సమృద్ధికి దోహదం చేసే పలు పండ్లు ఉన్నాయని, వీటిని తీసుకుంటే తల్లీ బిడ్డల ఆరోగ్యం బాగుటుందని నిపుణులు చెప్తున్నారు. అవేమిటో చూద్దాం.
పచ్చి బొప్పాయి: బాలింతలు అంటే పాలిచ్చే తల్లులు ఆకుపచ్చ బొప్పాయి తినడం చాలామంచిది. ఇది రొమ్ము క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది. పాల ఉత్పత్తికి దోహదం చేస్తుంది. ఆమ్ల రహిత విటమిన్ అయిన సి పుష్కలంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు, మలబద్దకాన్ని దూరం చేయడంతోపాటు తల్లీ బిడ్డల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందజేస్తుంది.
అరటి: అరటి జీర్ణక్రియలో సహాయ పడుతుంది. ఇందులోని ఫైబర్ మలబద్దకం సమస్యను నివారిస్తుంది. పొటాషియం పుష్కలంగా ఉండటంవల్ల బాలింతలకు మేలు జరుగుతుంది. ప్రసవం తర్వాత ఆరోగ్య మెరుగుదలకు తోడ్పడే పొటాషియం అరటిలో ఉంటుంది.
అవోకాడో: తల్లీ, బిడ్డ ఆరోగ్యానికి మంచిది. ఇందులోనూ పొటాషియం అధికంగా ఉంటుంది. బిడ్డకు కంటిచూపునకు, దట్టమైన జుట్టు పెరుగుదలకు, గుండె ఆరోగ్యానికి, జీర్ణశక్తికి సహాయపడుతుంది.
సపోటా: అధిక కేలరీలను కలిగి ఉంటుంది సపోట. పాలిచ్చే తల్లులకు చాలా ఉపయోగకరం. తల్లి బిడ్డకిచ్చే పాలకోసం వినియోగించే కేలరీల మొత్తాన్ని సపోటా ద్వారా పొందవచ్చునట. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. సపోట యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
అంజీర్: అంజీర్‌లో మాంగనీస్, మెగ్నీషియం, రాగి, కాల్షియం, ఇనుము, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, విటమిన్-కె, విటమిన్-బి కలిగిన ఉన్నందువల్ల పాలిచ్చే తల్లికి, పాలు తాగే బిడ్డకు ఇది మేలు చేస్తుంది.