Underground Cities : భూగర్భ సౌధాలు..! ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అండర్ గ్రౌండ్ సిటీస్ ఇవే..
అందమైన భవంతులు, అండర్ గ్రౌండ్ నిర్మాణాలు, ఆకాశ హర్మ్యాలు, చారిత్రక లేదా పురాతన కట్టడాలు ఆధునిక హంగులు.. ఇవన్నీ ప్రజల్లో ఆసక్తి రేకెత్తించే అంశాలుగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.
దిశ, ఫీచర్స్ : అందమైన భవంతులు, అండర్ గ్రౌండ్ నిర్మాణాలు, ఆకాశ హర్మ్యాలు, చారిత్రక లేదా పురాతన కట్టడాలు ఆధునిక హంగులు.. ఇవన్నీ ప్రజల్లో ఆసక్తి రేకెత్తించే అంశాలుగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. అన్ని రంగాల్లోనూ నేడు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ప్రవేశించడంతో నిర్మాణ శైలి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ప్రజలు తాము ఊహించిన విధంగా ఇండ్లను, విల్లాలను నిర్మించుకోగలుగుతున్నారు. కానీ ఒకప్పుడు ఇందుకు భిన్నంగా ఉండేది. ఏ టెక్నాలజీ లేని కాలంలో యుద్ధాలు, దాడులు, ప్రకృతి విపత్తులు, భిన్న పర్యావరణ పరిస్థితుల నుంచి రక్షణ కోసం భూగర్భ సౌధాలను, సొరంగాలను నాటి ప్రజలు నిర్మించారు. ప్రస్తుతం అలాంటి కట్టడాలు కలిగిన అండర్ గ్రౌండ్ పట్టణాలు ప్రపంచ వ్యాప్తంగా 36 వరకు ఉండగా ఇప్పుడివి పర్యాటక ప్రదేశాలుగానూ ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం.
బర్లింగ్‌టన్
ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకుంటున్న వాటిలో ప్రస్తుతం యునైటెడ స్టేట్‌లో గల బర్లింగ్‌టన్ (Burlongton) ఒకటి. యుద్ధాల సమయంలో అణుదాడుల నుంచి తమ దేశ ప్రజలను రక్షించుకోవడానికి 1950లో నాటి బ్రిటీష్ ప్రభుత్వం క్రోశాం ఏరియాలో ఈ అండర్ గ్రౌండ్ బంకర్‌ను నిర్మించింది. ఇది 60 మైళ్ల విస్తీర్ణంలో ఉంది. శత్రుదేశాలు కూడా గుర్తించలేని విధంగా దీనిలో అనేక గదులు, వివిధ కట్టడాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వైద్య శాలలు, నిద్రించేందుకు అవసరమైన నేల మాళిగలు, టెలిఫోన్ ఎక్సేంజీ వంటివి ఉన్నాయి. కాగా 1991 వరకు ఈ భూగర్భ సౌధంలో వివిధ ప్రభుత్వ కార్యకలాపాలు కూడా జరిగేవి కానీ 2004 తర్వాత నిలిపివేసి పర్యాటక, చారిత్రక కట్టడంగా ప్రకటించారు.
మాంట్రియల్
భూగర్భ పర్యాటక సౌధంగా కెనడాలోని మాంట్రియల్ గుర్తింపు పొందింది. దీనిని 1962లో నాటి కెనడియన్ సర్కార్ నిర్మించింది. అప్పట్లో దీనికి రెసో అనే పేరు పెట్టారు. ప్రస్తుతం ఆ పేరు మీదుగానే రెసోలో హోటళ్లు, లైబ్రరీలు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు వంటివి కూడా నిర్మించారు. మొత్తం 4.5 చదరపు కిలోమీటర్ల మేర ఇది విస్తరించి ఉంది. సుమారు 200 ద్వారాలు ఉన్నాయి. ఆపద సమయాల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, ఒక గది నుంచి మరో గదికి వెళ్లేందుకు ఇందులో సొరంగ మార్గాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఇది ప్రజలను ఆకట్టుకుంటోంది. ఇందులో అతిపెద్ద షాపింగ్ మాల్ కూడా ఉంది. దేశంలో హిమపాతం పెరిగితే గనుక సమీప ప్రాంతాల్లోని ప్రజలు ఈ మాంట్రియల్‌కు వచ్చి తలదాచుకుంటారు.
డోరీకుయు, టర్కీ
అత్యంత పురాతన భూగర్భ సౌధాల్లో టర్కీలోని డోరీకుయు (Derinkuyu) పట్టణం ఒకటి. క్రీ.పూ. 8వ శతాబ్దంలో నాటి యుద్ధాల నుంచి రక్షణ కోసం సైన్యం, సాధారణ ప్రజలు తలదాచుకోవడానికి దీనిని నిర్మించారు. వలయాకారంలో ఉన్న ఈ నగరం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని అండర్ గ్రౌండ్ సిటీస్‌లలో లోతైనదిగా చెప్తారు. డోరీకుయులో ఒక చోటు నుంచి మరో చోటకు వెళ్లడానికి చాలా సొరంగ మార్గాలు, నేల మాళిగలు ఉన్నాయి. నేడు వీటిని బంకర్లు అని పిలుస్తున్నారు.
జోర్డాన్‌లోని పెట్రా
పెట్రా.. నైరుతి జోర్డాన్‌లోని ఎర్రటి పర్వత శ్రేణుల మధ్య గల అండర్ గ్రౌండ్ సిటీ ఇది. అక్కడి వారసత్వ సంపదగా పేర్కొంటారు. యునెస్కో గుర్తింపు కూడా సాధించింది. క్రీ. పూ. 4వ శతాబ్దంలో నాటి నాబాటేయన్ తెగ పెట్రా(Petra) అనే భూగర్భ పట్టణాన్ని నిర్మించగా.. క్రీ. శ. 1800లో మొదటిసారి దీని గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. కాగా ఇప్పటికీ ఇది నాబాటేయన్ ప్రజల నాగకరితకు చిహ్నంగా ఉంది. ఇక్కడ సుమారు 30 వేలమంది నివసించేందుకు అనువైన గుహల వంటి నిర్మాణాలు ఉన్నాయి. క్రీ. శ. ఏడవ శతాబ్దం నుంచి నాబాటేయన్లు ఈ పట్టణంపై తమ ఆధిపత్యాన్ని కోల్పోయారు. కాలక్రమంలో రోమ్ సామ్రాజ్యంలో విలీనమైంది.
ఫ్రాన్స్‌లోని నౌర్స్
ఫ్రాన్స్ దేశంలోనే అత్యంత పురాతన భూగర్భ పట్టణంగా నౌర్స్ (Naours) ప్రసిద్ధి చెందింది. దీనిని క్రీ. శ. 3వ శతాబ్దంలో నిర్మించారు. వేలాది మంది నివసించేందుకు వీలుగా ఇక్కడ 300 గదులు ఉన్నాయి. దేశంలోనే అత్యంత సీక్రెట్ ప్లేస్ అని చెప్తుంటారు. అప్పట్లో యుద్ధాల నుంచి ప్రభువు, సైన్యం, ప్రజలు తలదాచుకునేందుకు నిర్మించిన ఈ నౌర్స్ ఇప్పుడు పురాతన పర్యాటక ప్రాంతం.
డిక్సియా చెంగ్, చైనా
ప్రచ్ఛన్న యుద్ధాల నుంచి రక్షణ కోసం 1960లో నాటి చైనా ప్రభుత్వం బీజింగ్ సమీపంలో 80 చదరపు కిలోమీటర్ల మేర ఓ పెద్ద భూగర్భ సౌధాన్ని నిర్మించింది. ఒకవేళ పెద్ద యుద్ధం వచ్చినా నాలుగు నెలలపాటు 10 లక్షల మందికి ఆశ్రయం కల్పించేలా ఈ బంకర్‌ను నిర్మించారు. ఇళ్లు, ఆస్పత్రులు, స్కూళ్లు, రెస్టారెంట్లు, ధాన్యాగారాలు ఇలా అన్నీ ఇక్కడ దర్శనమిస్తాయి. అప్పట్లో యుద్ధం ముగిశాక దీని అవసరం పెద్దగా లేనందున ప్రభుత్వం డిక్సియా చెంగ్‌ను (Dixia Cheng) పర్యాటక ప్రాంతంగా మార్చింది.
కూపర్ పెడీ, ఆస్త్రేలియా
భూగర్భ సౌధాలతో అలరారుతున్న పట్టణాల్లో ఆస్ట్రేలియాలోని కూపర్ పెడీ ఒకటి. కూప - పెడీ అనే పదం నుంచి ఈ పేరు వచ్చిందని చెప్తారు. అక్కడి ప్రజల భాషలో దీని అర్థం నీళ్ల రంధ్రం లేదా తెల్లటి మనిషి. ప్రస్తుతం సౌత్ ఆస్ట్రేలియా ప్రాంతంలో టూరిస్టులను ఆకర్షించే ప్రాంతాల్లో ఇది ఫేమస్. ఓపాల్ అనే అరుదైన రత్నాలు దొరికే ప్రదేశంగానూ దీనిని పేర్కొంటారు. ఇక్కడి జనాభా మొత్తం 2,500 మంది కాగా, అత్యల్ప ఉష్ణోగ్రతల సమయంలో కూపర్ పెడీలో తలదాచుకుంటారు.