ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన 10 మంది మహిళలు వీరే..

ప్రస్తుత కాలంలో మహిళలు ఎందులోనూ తక్కువ కాదు. పురుషులకు సమానంగా మహిళలు అన్ని పనులను చేస్తున్నారు.

Update: 2024-03-07 11:01 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుత కాలంలో మహిళలు ఎందులోనూ తక్కువ కాదు. పురుషులకు సమానంగా మహిళలు అన్ని పనులను చేస్తున్నారు. మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ పురోగమిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 మంది ప్రతిభావంతులైన మహిళల జాబితాను 2023లో ఫోర్బ్స్ విడుదల చేసింది. రాజకీయాలు, ఫైనాన్స్, వ్యాపారం, మీడియా, వినోదం, దాతృత్వం, విధాన రూపకల్పన వంటి అన్ని రంగాల్లో మహిళలు అగ్రస్థానంలో ఉన్నారు.

యూరోపియన్ కమిషన్ అధిపతి, జర్మనీలో ఎక్కువ కాలం పనిచేసిన క్యాబినెట్ మంత్రి ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఫోర్బ్స్ ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ జాబితాలో చేరిన టాప్-10 మహిళల విజయాలను తెలుసుకుందాం.

1- ఉర్సులా వాన్ డెర్ లేయెన్..

ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న యూరోపియన్ కమిషన్ అధిపతి ఉర్సులా వాన్ డెర్ లేయెన్ జూలై 2019లో యూరోపియన్ యూనియన్ కార్యనిర్వాహక శాఖకు అధిపతిగా నియమితులయ్యారు. 450 మిలియన్లకు పైగా యూరోపియన్ పౌరుల కోసం చట్టాలను రూపొందించడానికి బాధ్యత వహించే ఈ పదవిని పొందిన మొదటి మహిళ ఆమె. దీనికి ముందు 2005 నుండి 2019 వరకు జర్మనీలోని ఏంజెలా మెర్కెల్ క్యాబినెట్‌లో సభ్యురాలిగా ఉన్నారు.

ఆమె చివరి ఆరు సంవత్సరాల క్యాబినెట్ పదవీకాలంలో జర్మనీ రక్షణ మంత్రిగా ఉన్నారు. ఆమె నాయకత్వంలో 750 బిలియన్ యూరోల కోవిడ్ రిలీఫ్ బిల్లు 2020లో ఆమోదించారు. రష్యాతో పోరాటంలో ఆమె ఉక్రెయిన్‌కు అతిపెద్ద మద్దతుదారుగా ఉన్నారు. 65 ఏళ్ల ఉర్సులా వాన్ డెర్ లేయెన్ అనే జర్మన్ పౌరురాలు బెల్జియంలో నివసిస్తున్నారు.

2- క్రిస్టీన్ లగార్డ్..

యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ హెడ్ క్రిస్టీన్ లగార్డ్ ఫోర్బ్స్ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఆమె నవంబర్ 1, 2019న ఈ బ్యాంకుకు అధిపతిగా నియమితులయ్యారు. అధిక ద్రవ్యోల్బణ వాతావరణంలో ఆర్థిక వృద్ధిని కొనసాగించడం ఐరోపా ఆర్థిక విధానాల నిర్ణయకర్త అయిన లగార్డ్‌కు అతిపెద్ద సవాలు. ఆమె 2011 నుండి 2019 మధ్యకాలం వరకు అంతర్జాతీయ ద్రవ్య నిధిని కూడా నిర్వహించారు.

ఈ పదవికి చేరుకున్న మొదటి మహిళ ఆమె. 2008 ఆర్థిక సంక్షోభాన్ని పరిశీలిస్తే క్రిస్టీన్ లగార్డ్ ఈ పురుష-ఆధిపత్య రంగంలో లింగ సంస్కరణకు చిహ్నం. 68 ఏళ్ల లగార్డ్, ఫ్రాన్స్ పౌరురాలు ప్రస్తుతం జర్మనీ నివాసి.

3. కమలా హారిస్

ఈ జాబితాలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మూడో స్థానంలో ఉన్నారు. భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్ జనవరి 20, 2021న ఈ పదవిని అందుకున్నారు. ఆమె US వైస్ ప్రెసిడెంట్ పదవికి చేరుకున్న మొదటి మహిళ, మొదటి నల్లజాతి, మొదటి దక్షిణాసియా-అమెరికన్. అంతే కాదు ఆమె 2016లో యునైటెడ్ స్టేట్స్ సెనేట్‌కు ఎన్నికైనప్పుడు ఈ స్థానానికి చేరుకున్న మొదటి భారతీయ - అమెరికన్ మహిళ.

2010 సంవత్సరం ప్రారంభంలో ఆమె కాలిఫోర్నియా అటార్నీ జనరల్ అయిన మొదటి మహిళ, మొదటి ఆఫ్రికన్-అమెరికన్. కాలిఫోర్నియా నివాసి కమలా హారిస్ ఓక్లాండ్‌లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ వలస వచ్చినవారు. ఆమె తల్లి భారతదేశం వారు కాగా, తండ్రి ఆఫ్రికన్ దేశం జమైకా వాసి. హార్వర్డ్ యూనివర్సిటీలో చదివిన 59 ఏళ్ల హారిస్ ప్రస్తుతం వాషింగ్టన్ నివాసి.

4- జార్జియా మెలోని..

ప్రధాని నరేంద్ర మోదీ స్నేహితురాలు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల్లో నాలుగో స్థానంలో ఉన్నారు. 22 అక్టోబర్ 2022న ఇటలీ ప్రధాన మంత్రి అయిన మెలోని ఈ పదవికి చేరిన మొదటి మహిళ. ఆమె రైట్ వింగ్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి అధ్యక్షురాలు కూడా. మార్చి 2014 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. 15 సంవత్సరాల వయస్సులో ఆమె ఇటలీ మాజీ నియంత బెనిటో ముస్సోలినీ మద్దతుదారులతో స్థాపించిన ఇటాలియన్ సోషల్ మూవ్‌మెంట్ యువజన విభాగంలో చేరింది. నవంబర్ 2023లో ప్రధానమంత్రిని ప్రత్యక్షంగా ఎన్నుకోవడం కోసం ఇటలీలో తీసుకొచ్చిన రాజ్యాంగ సంస్కరణకు మద్దతు ఇవ్వడం ద్వారా ఆమె వెలుగులోకి వచ్చింది.

5. టేలర్ స్విఫ్ట్..

టేలర్ స్విఫ్ట్ మీడియా - వినోద రంగం నుంచి ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలోని ఐదవ అత్యంత శక్తివంతమైన మహిళ జాబితాలో ఉన్నారు. అక్టోబర్ 2023లో బిలియనీర్‌గా మారిన టేలర్ స్విఫ్ట్ ఆమె పాటలు, ప్రదర్శనల కారణంగా జాబితాలో చేరుకున్న మొదటి సంగీత విద్వాంసురాలు.

నేడు ఆమె రాయల్టీలు, పర్యటనల ద్వారా $500 మిలియన్ల నికర విలువను సంపాదిస్తున్నారు. ఆమె వద్ద $500 మిలియన్ల విలువైన సంగీత కేటలాగ్, $125 మిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నాయి. 2021లో మొదటిసారిగా ఆమె తన మొదటి ఆరు ఆల్బమ్‌ల రీ - రికార్డ్‌లను విడుదల చేయడం ప్రారంభించారు.

6. కరెన్ లించ్..

కరెన్ లించ్ ఈ జాబితాలో ఆరవ స్థానంలో ఉన్నారు. 2021 నుండి మూడు లక్షల మంది వ్యక్తులతో ఆరోగ్య సంరక్షణను అందించే కంపెనీకి అధిపతిగా ఉన్నారు. ఆమె 2018 సంవత్సరంలో ఈ కంపెనీ CVS హెల్త్‌తో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. గత సంవత్సరం 2023లో, లించ్ ప్రైమరీ కేర్ ప్రొవైడర్ ఓక్ స్ట్రీట్ హెల్త్‌ను $10 బిలియన్లకు, హోమ్ హెల్త్ కేర్ స్పెషలిస్ట్ సిగ్నిఫై హెల్త్‌ను $8 బిలియన్లకు కొనుగోలు చేసింది. లించ్ 60 ఏళ్ల అమెరికన్ పౌరురాలు.

7.జేన్ ఫ్రేజర్

సిటీ బ్యాంక్ తొలి మహిళా సీఈవో జేన్ ఫ్రేజర్ ఫోర్బ్స్ జాబితాలో ఏడో స్థానంలో నిలిచారు. 2020లో ఆమె మైఖేల్ కార్బెట్ తర్వాత పదవికి ఎంపికయ్యారు. మార్చి 2021లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన వాల్ స్ట్రీట్ బ్యాంకును నడుపుతున్న మొదటి మహిళ కూడా ఆమె. CEO కాకముందు ఫ్రేజర్ సిటీ గ్రూప్ అధ్యక్షుడిగా, గ్లోబల్ కన్స్యూమర్ బ్యాంకింగ్, CEOగా కూడా పనిచేశాడు. 56 ఏళ్ల ఫ్రేజర్ 2004లో సిటీ గ్రూప్‌లో చేరారు.

8. అబిగైల్ జాన్సన్..

2014 నుంచి ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సీఈఓగా కొనసాగుతున్న అబిగైల్ జాన్సన్ పేరు ఫోర్బ్స్ జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది. దీనికి ముందు ఆమె 2016 నుండి దాని ఛైర్మన్‌గా ఉన్నారు. ఆమె తండ్రి తర్వాత CEO అయ్యారు. ఈ ప్రముఖ మ్యూచువల్ ఫండ్ కంపెనీని 1946లో అబిగైల్ తాత ఎడ్వర్డ్ జాన్సన్ II బోస్టన్‌లో స్థాపించారు. దీనిని అబిగైల్ మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. ఈ సంస్థలో అబిగైల్‌కు 28.5 శాతం వాటా ఉంది. సెప్టెంబర్ 2023లో దీని మొత్తం విలువ $4.5 ట్రిలియన్. 2018లో జాన్సన్ క్రిప్టోకరెన్సీ ప్రపంచంలోకి ప్రవేశించింది.

9. మేరీ బర్రా..

అమెరికా మూడు అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ కంపెనీలలో ఒకటైన జనరల్ మోటార్స్ CEO మేరీ బర్రా ఫోర్బ్స్ జాబితాలో తొమ్మిదవ స్థానంలో ఉన్నారు. 2014లో ఈ పదవికి అందుకున్న మొదటి మహిళ బర్రా. ఆమె నాయకత్వంలో కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీలో ట్రిలియన్ల పెట్టుబడి పెట్టింది. 2025 చివరి నాటికి కంపెనీ ఒక మిలియన్ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలన్నది వారి లక్ష్యం. బర్రా 1980లో జనరల్ మోటార్స్‌లో కో-ఆప్ ప్రోగ్రాం కింద విద్యార్థిగా చేరారు.

10. మెలిండా

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల ఫోర్బ్స్ జాబితాలో మెలింగా పేరు 10 వ స్థానంలో ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆమె గురించి తెలుసు. మెలింగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో కనిపించారు. మెలిండా, బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ కోచైర్, ప్రపంచంలోని 10వ అత్యంత శక్తివంతమైన మహిళ. మే 2021లో బిల్ గేట్స్, మెలిండా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ, వారు ఇప్పటికీ ఈ ఫౌండేషన్‌కు సహ-అధ్యక్షులుగా ఉన్నారు. విడాకుల సమయంలో బిల్ గేట్స్ మెలిండాకు వివిధ కంపెనీలలో కనీసం ఐదు బిలియన్ డాలర్ల స్టాక్‌లను బదిలీ చేశాడు. ఇదిలావుండగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సంక్షేమం కోసం ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు లేవు. మెలిండా ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికల హక్కుల కోసం తన స్వరాన్ని పెంచుతూనే ఉంది.


Tags:    

Similar News