చలి తీవ్రతవల్ల హైపో థర్మియా తలెత్తే అవకాశం.. అందుకు పాటించాల్సిన నివారణ చర్యలివే..

చలికాలంలో ఉష్ణోగ్రతల్లో మార్పులవల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని మనకు తెలిసిందే.

Update: 2023-01-13 06:32 GMT

దిశ, ఫీచర్స్: చలికాలంలో ఉష్ణోగ్రతల్లో మార్పులవల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని మనకు తెలిసిందే. సైనస్, జలుబు వంటి సమస్యలతో పాటు ఈ కాలంలో ఎదురయ్యే మరో ప్రధాన సమస్య హైపో థర్మియా. ఇది అత్యధిక చలివల్ల తలెత్తుతుంది. అసలే జనవరి మాసం.. పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత బాగా పెరుగుతోంది. పిల్లలు, పెద్దలు, చలికి తట్టుకోలేని పరిస్థతి ఏర్పడింది. ఇటువంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు, విహార యాత్రలకు వెళ్లేవారు చలితీవ్రతకు, అల్ప ఉష్ణోగ్రతల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఉష్ణోగ్రత తీవ్రంగా పడిపోవడంతో ఏర్పడే అనారోగ్య సమస్యనే హైపో థర్మియా అని పిలుస్తారు. దీనికి గురైన వ్యక్తులు తీవ్రమైన ఆరోగ్య సమస్యను ఎదుర్కుంటారు. కొన్నిసార్లు పరిస్థితి అధిగమిస్తే ప్రాణహాని కూడా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగాను, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా పగటి ఉష్ణో గ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరిగింది. పొద్దున్నపూట గజగజా వణుకు పుట్టిస్తున్న చలిని చూసి భయపడే పరిస్థితి ఈ వారం రోజులుగా నెలకొంది. ఈ జనవరి మాసంలో పగటి కంటే రాత్రిపూట ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవడంవల్ల శరీర ఉష్ణో గ్రతలు తగ్గిపోయి ఇబ్బంది పడే పరిస్థితి సహజంగానే ఎదురవుతూ ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. చలిగాలు వీయడం, చలితోపాటు ఉదయంపూట మంచు కూడా కురుస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. అంతలోనే సంక్రాంతి పండుగ కూడా రావడంతో పాఠశాలలకు, ఆఫీసులకు సెలవులు దొరికాయి. పండుగకు ఊరెళ్లేవారు. లేదా విహారాలకు వెళ్లేవారు ఉదయం పూట ప్రయాణాలు చేస్తుంటారు. కచ్చితంగా ఇలాంటప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. చలి తీవ్రతవల్ల శరీర ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు వస్తుంటాయి. ప్రయాణాల వేళ తగిన వెచ్చదనం లేకుంటే హైపోథర్మియాకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రయాణాలు చేసేవారు, విహారాలకు వెళ్లేవారు తమ శరీర ఉష్ణో గ్రతలను కాపాడుకునేందుకు ముందుగానే ప్లాన్ చేసుకోవడం బెటర్.

హైపోథర్మియా, దాని లక్షణాలు

తీవ్రమైన చలి ప్రభావంవల్ల శరీర ఉష్ణోగ్రతలు పడిపోతే తట్టుకోలేని పరిస్థితివల్ల అనారోగ్యానికి గురికావడాన్ని హైపో థర్మియా అంటారు. ఇక దీని లక్షణాల విషయానికి వస్తే వణుకు, అమోమయం, మాట్లాడడంలో తడబాటు, మగత, కండరాలు బిగుసుకుపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. పసిపిల్లల విషయంలో లక్షణాలను పరిశీలిస్తే.. శరీర ఉష్ణోగ్రత 97.5 ఫారెన్‌హీట్ కంటే తక్కువకు పడిపోవడం, సాధారణంకంటే భిన్నంగా ఏడ్వడం, ఇబ్బంది పడటం, యాక్టివ్ నెస్ తగ్గడం, బద్ధకం, శరీరంపై ఎర్రటి దద్దుర్లు, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, పాలు తాగడంపై, ఆహారం తినడంపై అనాసక్తి వంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తుంటాయి.

నివారణ చర్యలు తప్పనిసరి

హైపో థర్మియాకు గురికాకుండా నివారణ చర్యలు తీసుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. అవేమిటంటే... ఇంటి బయట అతి చల్లటి వాతావరణంలో ఎక్కువ సేపు గడపవద్దు. బయటకు వెళ్లాల్సి పరిస్థితి వస్తే చలిగాలుల నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలి. స్వెట్టర్ ధరించడం, శరీరాన్ని దుప్పటితో కప్పుకోవడం వంటి చర్యలు తీసుకోవాలి. అలాగే చల్లటి వాతావరణంలో ఎక్కువసేపు ఉండకపోవడం మంచిది. తక్కువగా బరువుతో వదులుగా, వెచ్చగా ఉండే దుస్తులు ధరించడం మంచిది. చెవులు, మెడ, చేతులు, కాళ్లు కూడా వాతావరణ ప్రభావానికి గురికాకుండా కప్పి ఉండేలా చూసుకోవాలి. టైటుగా ఉండే దుస్తులవల్ల బ్లడ్ సర్క్యులేట్ సమస్యలు తలెత్తుతాయి కాబట్టి వాటిని ధరించవద్దు.

చలి నుంచి రక్షణకోసం హ్యాట్, గ్లోవ్స్, బూట్లు ధరించాలి. విపరీతమైన చలి నుంచి ఊపిరితిత్తుల రక్షణ కోసం ముఖాన్ని కవర్ చేసేలా క్యాపులు, వెచ్చటి దుస్తులు కప్పుకోవాలి. వీలైనంత వరకు ద్రవ పదార్థాలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. నాన్-ఆల్కాహాల్, కేఫిన్ రహిత ద్రవపదార్థాలు తీసుకోవాలి. ఆహారంలో సూప్, టీ, ముతక తృణధాన్యాలు ఉంటే.. శరీరానికి వెచ్చదనాన్ని కలిగిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. అంతేగాక శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే తేనె, అల్లం, పసుపు, తులసి, బెల్లం వంటి వాటిని ఆహారంలో భాగంగా తీసుకోవడంవల్ల చలి నుంచి తట్టుకోవచ్చు. ఈ విధమైన జాగ్రత్తలతో అధిక చలివల్ల, హైపో థర్మియావల్ల ఎదురయ్యే సమస్యలను నివారించుకోవచ్చు.

Read More...

ఆర్టిఫిషియల్ నివాసాలు ఏర్పరుచుకుంటున్న దోమలు.. వ్యాధుల వ్యాప్తి వేగవంతం 

Tags:    

Similar News