ఎకో ఫ్రెండ్లీగా ఉంటున్న ప్రజలు.. గతంకంటే 32 శాతం పెరిగిన పర్యావరణ స్పృహ
పర్యావరణ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ మానవ మనుగడకు ప్రమాదకరంగా మారుతోందన్న ఆలోచన ప్రజలను అప్రమత్తం చేస్తోందని, ప్రకృతికి హానికలిగించే చర్యలకు దూరంగా ఉండాలన్న స్పృహ పెరుగుతోందని ఒక సర్వేలో వెల్లడైంది.
దిశ, ఫీచర్స్: పర్యావరణ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ మానవ మనుగడకు ప్రమాదకరంగా మారుతోందన్న ఆలోచన ప్రజలను అప్రమత్తం చేస్తోందని, ప్రకృతికి హానికలిగించే చర్యలకు దూరంగా ఉండాలన్న స్పృహ పెరుగుతోందని ఒక సర్వేలో వెల్లడైంది. కాలుష్య రహితంగా, స్థిరంగా జీవించే విధానంపట్ల మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నది. గతేడాదితో పోల్చితే ప్రస్తుతం ప్రతీ ముగ్గురిలో ఒకరు అప్రమత్తంగా ఉంటున్నారని ఇటీవల 2000 మందిపై వన్‌పోల్ నిర్వహించిన సర్వేలో తేలింది. 2022లో కంటే 2023లో 34 శాతం మంది ఎకో ఫ్రెండ్లీ జీవనశైలివైపు మొగ్గు చూపతున్నారని పరిశోధకులు గుర్తించారు.
అయితే మరో 32 శాతం మంది ఇప్పటికీ పర్యావరణంపట్ల పెద్దగా పట్టింపులేని అలవాట్లను కలిగి ఉన్నారని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మరో 79 శాతం మంది మారుతున్న పర్యావరణ వ్యవస్థపట్ల ఆందోళన చెందుతున్నారని పరిశోధకుల పరిశీలనలో వెల్లడైంది. ఈ పరిస్థితివల్ల 2021తో పోలిస్తే ప్రస్తుతం చాలామంది తరచుగా లేదా మరింత పూర్తిగా తాము వాడే వస్తువులు, వనరులను రీసైక్లింగ్ చేయడానికి కట్టుబడి ఉన్నట్లు సర్వే పేర్కొన్నది.
గత సంవత్సరం పర్యావరణ అనుకూల ప్రవర్తనలలో భాగంగా 51 శాతం వస్తువులు పునర్వినియోగించబడ్డాయని పరిశోధకులు తెలిపారు. 43 శాతం మంది ఎక్కువ మొక్కల ఆధారిత ఆహారాలు తినడానికి మొగ్గు చూపుతున్నారని, 44 శాతం మంది ఉత్పత్తి చేయబడిన ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణాన్ని తగ్గించారని పేర్కొన్నారు. అలాగే గాలి, నీరు, భూమి కాలుష్యాలపట్ల ప్రజల్లో అవగాహన పెరుగుతోందని, ఏదో విధంగా పర్యావరణాన్ని రక్షించాలన్న స్పృహ పెరగడం సంతోషించదగిన విషయమని నిపుణులు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి: ఎకో ఫ్రెండ్లీ ట్రెడీషనల్ గ్లాస్.. కొత్తగా క్రియేట్ చేసిన సైంటిస్టులు