అధిక ఉష్ణోగ్రతల నడుమ పనిచేసే గర్భిణులకు రిస్క్.. అబార్షన్ అయ్యే చాన్స్ ఉందంటున్న నిపుణులు

ప్రపంచ పర్యావరణ వ్యవస్థలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంతో పోల్చితే భూగోళం వేడెక్కడం, అధిక ఉష్ణోగ్రతలు పెరగడంవల్ల ప్రజలు పలు రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

Update: 2024-04-09 06:35 GMT

దిశ, ఫీచర్స్ : ప్రపంచ పర్యావరణ వ్యవస్థలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంతో పోల్చితే భూగోళం వేడెక్కడం, అధిక ఉష్ణోగ్రతలు పెరగడంవల్ల ప్రజలు పలు రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వేసవిలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటుంది. ఎండ వేడికి తట్టుకోలేక మనుషులే కాదు, వివిధ జీవాలు అవస్థలు పడుతుంటాయి. అయితే ఎండల్లో పనిచేయాల్సి రావడంవల్ల గర్భిణులైన శ్రామిక మహిళల్లో అబార్షన్ అయ్యే అవకాశం పెరుగుతుందని ఒక అధ్యయనం పేర్కొన్నది.

ఏయే దేశాల్లో ..

వేసవిలో అధిక ఉష్ణోగ్రతల నడుమ వర్క్ చేసే గర్భిణులు అబార్షన్‌కు గురికావడం లేదా ప్రసవ సమయంలో బిడ్డను కోల్పోవడం వంటి ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. అయితే ఈ పరిస్థితి కేవలం ఉష్ణ మండల ప్రాంతాల్లో మాత్రమే కాకుండా, భారత్, బ్రిటన్ సహా యూరోపియన్ దేశాల్లోనూ ఉంటోంది. స్టడీలో భాగంగా యూకేకు చెందిన జార్జ్ ఇన్‌స్టిట్యూట్‌లోని గ్లోబల్ ఉమెన్స్ హెల్త్ వింగ్ నిపుణులు వివిధ దేశాల్లో అధిక ఉష్ణోగ్రతల మధ్య పనిచేసే మహిళల హెల్త్ డేటాను విశ్లేషించారు.

ఇక్కడ పనిచేసేవారికి ప్రమాదం

ఎండాకాలంలో ఇటుక బట్టీలు, ఉప్పు తయారీ పరిశ్రమలు, వ్యవసాయ పనులు, పరిశ్రమల్లో అధిక ఉష్ణోగ్రతల నడుమ పనిచేయాల్సి రావడంవల్ల మహిళల్లో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా గర్భిణులు నెలలు నిండకముందే ప్రసవించడం లేదా అబార్షన్లకు గురికావడం పెరుగుతోందని కనుగొన్నారు. ఎండ తీవ్రవ, వేడిగాల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పనిచేసేవారితో పోల్చితే, సాధారణ వాతావరణం లేదా చల్లటి వాతావరణంలో పనిచేసే మహిళల్లో హెల్త్ ఇష్యూస్ చాలా తక్కువగా ఉంటున్నాయని నిపుణులు అంటున్నారు.

రిస్క్ మరింత పెరగనుందా?

హీట్‌వేవ్, హై టెంపరేచర్ మధ్య పనిచేయాల్సి రావడం కరాణంగా నెలలు నిండకముందే ప్రసవాలు, అబార్షన్లకు గురికావడం, డీహైడ్రేషన్ కేసులు పెరగడం వంటివి ఇప్పటికే 5 శాతం వరకు ఉంటున్నాయని, రాబోయే కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 15 శాతం పెరిగే ప్రమాదం ఉందని రీసెర్చర్స్ అంటున్నారు. అలాగే శిశువులు, వృద్ధుల మరణాల సంఖ్య పెరగవచ్చని కూడా పేర్కొంటున్నారు.

పరిష్కారం ఏమిటి?

అధిక ఉష్ణోగ్రతల నడుమ పనిచేయడం మంచిది కాదన్న విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. కానీ పేద, మధ్య తరగతి ప్రజలు తమ జీవనోపాధికోసం పనిచేయక తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎండాకాలంలో వీరికి ఉపశమనం కలిగించే చర్యలు ఆయా దేశాల ప్రభుత్వాలు చేపట్టాలి. ప్రస్తుతానికైతే చాలా దేశాల్లో హీట్ వేవ్ ఏరియాస్‌లో వర్క్ చేసే గర్భిణులను ఉద్దేశించిన అధికారిక మార్గదర్శకాలు ఉండట్లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక వ్యక్తులుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే దీర్ఘకాలంపాటు వేడి వాతావరణంలో ఉండకుండా చూసుకోవాలి. పనిచేసేటప్పుడు నిర్ణీత విరామాలు తీసుకోవాలి. ఎండాకాలంలో బయట పనిచేయాల్సి వస్తే ఉదయం, సాయంత్రం వేళ్లలో చేసుకోవడం మంచిది. అలాగే ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి.


Similar News