Zero Valley: ప్రకృతి అందాల నెలవు జీరో వ్యాలీ.. ఎత్తైన కొండలు.. పచ్చని పొలాలతోపాటు ఇంకెన్నో..!
ఎగుడు.. దిగుడు కొంత ప్రాంతాలు.. వాటి మధ్యలోంచి పారుతున్న నీటి కాల్వలు, పచ్చని చెట్లు, పక్షుల కిల కిల రావాలు.. అసలు ఇవన్నీ వింటుంటేనే ఆ అందమైన ప్రదేశం ఎక్కడుందో కానీ.. ఒక్కసారైనా చూడాలనిస్తుంది కదూ..! అదే జీరో వ్యాలీ.
దిశ, ఫీచర్స్ : ఎగుడు.. దిగుడు కొంత ప్రాంతాలు.. వాటి మధ్యలోంచి పారుతున్న నీటి కాల్వలు, పచ్చని చెట్లు, పక్షుల కిల కిల రావాలు.. అసలు ఇవన్నీ వింటుంటేనే ఆ అందమైన ప్రదేశం ఎక్కడుందో కానీ.. ఒక్కసారైనా చూడాలనిస్తుంది కదూ..! అదే జీరో వ్యాలీ. ఈశాన్య భారతంలోని అరుణాచల్ ప్రదేశ్‌లో గల బ్యూటీఫుల్ హిల్ స్టేషన్ ఇది. దీనిచుట్టు పక్కల అనేక గిరిజన తెగలకు చెందినవారు నివసిస్తుంటారు. ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో ఇక్కడి ప్రకృతి దృశ్యాలను చూసేందుకు చాలా మంది పర్యాటకులు వస్తుంటారని నిపుణులు చెప్తున్నారు.
జీరో వ్యాలీలో ప్రాచీన గిరిజన తెగకు చెందిన అనేక కుటుంబాలు, సంచార జాతులు నివసిస్తున్నాయి. వీరి సంస్కృతి, సంప్రదాయం, భాష, మాండలికం, జీవన శైలి చూడముచ్చటగా ఉంటాయని పర్యాటక నిపుణులు అంటున్నారు. ఇక చూడదగిన ప్రదేశాల విషయానికి వస్తే ఇక్కడి కొండ ప్రాంతాలన్నీ పచ్చని చెట్లతో, పొదలతో అలరారుతుంటాయి. మార్గ మధ్యలో సిద్ధేశ్వరాలయం కూడా ఉంది. ఇక్కడ 25 అడుగుల ఎత్తు, 22 అడుగుల వెడల్పు గల శివలింగం ఉంది. కాబట్టి చాలా మంది పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహిస్తుంటారు.
ప్రత్యేక వాతావరణం
జీరో వ్యాలీ సెప్టెంబర్‌లోనే సందర్శకులను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ఇందుకు కారణం ఇక్కడి అందమైన, అనువైన వాతావరణమే. ఉష్ణోగ్రతల విషయానికి 15 నుంచి 25 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్యనే ఉంటాయి. అంతేకాకుండా ఈ కొండప్రాంతంలోని పొలాలన్నీ పచ్చగా కళ కళలాడుతుంటాయి. ముఖ్యంగా అపాటానీ అనే గిరిజన తెగ సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు ఎంతో ఆకట్టుకుంటాయి.
మ్యూజిక్ ఫెస్టివల్
జీరో వ్యాలీలో ప్రతీ సంవత్సరం సెప్టెంబర్‌లో అంతర్జాతీయ స్థాయి మ్యూజిక్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. దేశ, దేశాల నుంచి వచ్చిన సంగీత కళాకారులు ఇక్కడ నిర్వహించే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటాయి. దీంతోపాటు ఈ ప్రాంతానికి కొద్ది దూరంలో వన్యప్రాణుల అభయారణ్యం కూడా ఉంటుంది. పర్యాటకులను, ప్రకృతి ప్రేమికును ఇది బాగా ఆకట్టుకుంటుంది. ఎత్తైన కొండలు, పచ్చటని చెట్లు, రకరకాల పక్షులు, జంతువులు, స్వచ్ఛమైన గాలి.. వంటి ప్రకృతి దృశ్యాలన్నీ పర్యాటకులను ఆకర్షిస్తాయి. కాగా జీరో వ్యాలీని సందర్శించడానికి భారతీయులకు ఎలాంటి అనుమతి అవసరం లేదు. కానీ విదేశీయులు మాత్రం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇన్నర్ లైన్ పర్మిట్ పొందాలని నిపుణులు చెప్తున్నారు.