ప్లాస్టిక్ తిని, అరిగించుకుంటున్న సూపర్ పురుగులు.. మనకి లాభమేంటీ..?!
పాలీస్టైరీన్‌ను బయోప్లాస్టిక్‌గా మార్చే అవకాశం. “superworms” Insects can eat and digest polystyrene plastic waste.
దిశ, వెబ్‌డెస్క్ః భూమిపైన పెరిగిపోతున్న కాలుష్యంతో మనిషి మనుగడకే ప్రమాదం వాటిల్లబోతుందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా, ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిని సర్వనాశనం చేస్తున్న తరుణంలో ప్లాస్టిక్ రిసైక్లింగ్ ఆవశ్యకత మనిషికి అర్థమయ్యింది. ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించే క్రమంలో ప్లాస్టిక్‌ను పర్యావరణహితంగా మార్చే అవకాశంపై పలు పరిశోధనలు ఊపందుకున్నాయి. అయితే, ఇటీవల ప్రచురించిన ఒక పరిశోధన ప్లాస్టిక్ సమస్యకు చెక్ పెట్టే ఫలితాలను వెలువరించింది. దీని ద్వారా పాలీస్టైరీన్‌ను బయోప్లాస్టిక్‌గా మార్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇందులో హీరోలుగా సూపర్‌వార్మ్స్ నిలుస్తున్నాయి. 5సెంటీమీటర్ల పొడవైన ఈ క్రిమి లార్వా అత్యంత విషపూరితమైన ప్లాస్టిక్‌లలో ఒకటైన పాలీస్టైరిన్‌ను జీర్ణం చేయగలదని సదరు అధ్యయనం వెల్లడించింది.
ఈ పరిశోధన ప్రకారం, ప్లాస్టిక్-జీర్ణ ఎంజైమ్‌లను కలిగి ఉన్న ఈ పురుగుల పేగుల్లో ప్లాస్టిక్‌ను తిని, అరిగించుకోగల్గిన సామర్థ్యం గల బ్యాక్టీరియా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ సూక్ష్మజీవులు చివరికి ప్లాస్టిక్‌ను ప్రాసెస్ చేయడం, రీసైక్లింగ్ చేయడంలో ఉపయోగపడుతున్నట్లు తెలిసింది. సూపర్‌వార్మ్ మైక్రోబయోమ్ జెనోమిక్స్‌ను వివరించే ఈ పరిశోధనను క్వీన్స్‌ల్యాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయోసైన్సెస్‌లో పరిశోధకుడు డాక్టర్ క్రిస్ రింకే, మైక్రోబియల్ జెనోమిక్స్‌లో ప్రచురించారు. "సూపర్‌వార్మ్‌లు మినీ రీసైక్లింగ్ ప్లాంట్ల వంటివి. వాటి నోటితో పాలీస్టైరిన్‌ను ముక్కలుగా చేసి తింటాయి. తర్వాత వాటి పేగుల్లోని బ్యాక్టీరియా ప్లాస్టిక్‌ను తిని, అరిగిస్తాయి. ఈ ప్రతిచర్య నుండి విచ్ఛిన్నమైన ఉత్పత్తులను ఇతర సూక్ష్మజీవులు బయోప్లాస్టిక్స్ వంటి అధిక-విలువ కలిగిన సమ్మేళనాలను రూపొందించడానికి ఉపయోగించవచ్చు" అని రింకే పేర్కొన్నారు. ఈ క్రమంలో పరిశోధకులు ఇప్పుడు ఈ గట్ బ్యాక్టీరియాను విడిగా పెంచే మార్గాలను పరిశోధిస్తున్నారు. అలాగే, పాలీస్టైరిన్‌ను మరింత విచ్ఛిన్నం చేసే సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. "మొత్తం రీసైక్లింగ్ ప్లాంట్‌కు అవసరమైన స్థాయికి ఈ ప్రక్రియను ఎలా పెంచొచ్చో పరిశీలిస్తున్నాము" అని UQలో పీహెచ్‌డీ అభ్యర్థి సహ రచయిత జియారుయ్ సన్ పరిశోధనా పత్రంలో వెల్లడించారు