అంత్య క్రియలకు అదిరిపోయే ఆఫర్స్.. మీ తల్లిదండ్రులు చనిపోయినా బాధే అవసరం లేదు?

ఇండియాలో తల్లిదండ్రులు.. ఫారిన్‌లో పిల్లలు. పేరెంట్స్‌లో ఎవరో ఒకరు చనిపోతే తప్ప స్వదేశానికి రానంత బిజీ లైఫ్ ఒకరిదైతే.. తలకొరివి పెట్టి పున్నామ నరకం నుంచి

Update: 2022-11-23 02:27 GMT

దిశ, ఫీచర్స్: ఇండియాలో తల్లిదండ్రులు.. ఫారిన్‌లో పిల్లలు. పేరెంట్స్‌లో ఎవరో ఒకరు చనిపోతే తప్ప స్వదేశానికి రానంత బిజీ లైఫ్ ఒకరిదైతే.. తలకొరివి పెట్టి పున్నామ నరకం నుంచి తప్పించే కన్నపేగు కోసం తల్లడిల్లే ఆరాటం మరొకరిది. అయినా కెరియర్ గోల్స్, డాలర్ డ్రీమ్స్‌పై ప్రేమ.. కొన్నిసార్లు అమ్మానాన్నలను అనాథలుగానే కాటికి పంపుతోంది. ఇక చివరి చూపునకు నోచుకోని పిల్లల గిల్టీ ఫీలింగ్ వారిని జీవితాంతం వెంటాడుతుంది. కానీ ఇదంతా సిల్లీ కల్చర్ అంటోంది ఓ కార్పొరేట్ సంస్థ. పుట్టించిన వారి కోసం అంత కష్టపడటమెందుకు? పైసలిస్తే ఆ పనేదో మేమే చేసిపెడతామని సెలవిస్తోంది. ఎంతోకొంత ఇచ్చేస్తే ఆ బాధ్యతలన్నీ తామే నిర్వహిస్తామని అంత్యక్రియలకు కార్పొరేట్ కల్చర్‌ జోడిస్తోంది. ఇంతకీ ఆ సంస్థ ఏంటి? ఎలాంటి ఆఫర్స్ ఇస్తోంది? తెలుసుకుందాం.

అంత్యక్రియల తీరు.. అదిరిపోయిన ఆఫర్స్

ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో వాణిజ్యాలకు సంబంధించిన మేళా జరుగుతోంది. ఇందులో ఓ నూతన కార్పొరేట్ సంస్థ వ్యాపార కార్యకలాపాలు నిజంగా అబ్బురపరుస్తున్నాయి. అందరినీ ఆకర్షిస్తూనే ఒకింత ఆలోచింపజేస్తున్నాయి. ఈ కార్పొరేట్ కంపెనీ పేరు 'సుఖాంత్ అంతిమ్ సంస్కార్.. ఫ్యూనరల్ అండ్ క్రిమేషన్ సర్వీసెస్'. అంత్యక్రియలు నిర్వహించడమే ఈ సరికొత్త సంస్థ వ్యాపారం. దిక్కులేని వాళ్లకు దహన సంస్కారాలు నిర్వహించి మానవత్వం చాటుకున్న అనేక ఎన్జీవోలను చూశాం కానీ ఇందులో సభ్యత్వం కోసం సదరు కంపెనీ మాత్రం రూ. 37,500 రుసుము కట్టాలని సూచిస్తోంది. ఈ డబ్బు కట్టి సభ్యులుగా చేరితే.. తల్లిదండ్రులు చనిపోయినా ఎలాంటి బాధ, హైరానా లేకుండా విదేశాల్లో హాయిగా కాలుమీద కాలేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు అని యాడ్ ఇస్తోంది. అంత్యక్రియల కోసం హుటాహుటిన స్వదేశానికి తిరిగిరావాల్సిన అవసరమే లేదంటోంది. శవాన్ని ఫ్రీజర్‌లో పెట్టి మీరొచ్చి అంత్యక్రియలు చేయాల్సిన పని అసలే లేదంటోంది. మొత్తానికి మెంబర్‌షిప్ తీసుకున్న కస్టమర్ల తల్లిదండ్రులకు ఈ కంపెనీయే అంత్యక్రియలు నిర్వహిస్తోంది.

పాడె మోసేందుకు నలుగురిని సెట్ చేస్తున్న.. 'గోవింద గోవింద', 'రామ్ నామ్ సత్య్ హై' అని దారిపొడువునా అరిచేందుకు, బంధువుల పాత్రలో ఏడ్చేందుకు, ఆ తర్వాత శవానికి తలకొరివి పెట్టేందుకు కూడా మనుషులను సెట్ చేస్తోంది. మరి దహన సంస్కరాలు పూర్తయ్యాక చేయాల్సిన తతంగం.. అంటే అస్థికలు సేకరించి గంగలో కలుపుతుంది. ఇందుకోసం మీకు నచ్చిన నదితో పాటు ఏ ప్లేస్‌లో అస్థికలను కలపాలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.

కంపెనీ అచీవ్‌మెంట్స్ :

ఇలా అంతిమసంస్కారానికి వ్యాపార సొబగులద్దిన ఈ స్టార్టప్ కంపెనీ తమ ఆలోచనా కోణాన్ని అర్థం చేసుకోవాలని కోరుతోంది. ఈ మేరకు ఇప్పటికే లక్షల్లో లాభాలు ఆర్జిస్తుండగా.. రాబోయే కాలంలో తమ టర్నోవర్ రూ. 2000 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తోంది. ఇక కొవిడ్ టైమ్‌లో శవాలు కాల్చేసిన అనుభవమే ఈ కంపెనీకి పునాది కాగా.. ఇప్పటి వరకు 5000 మందికి అంత్యక్రియలు జరిపినట్లు తెలిపింది. పాండమిక్ టైమ్‌లో కరోనా సోకిన శవాన్ని ఎవరూ ముట్టుకోలేదు. కన్నవారైనా సరే కట్టె కాలిందో లేదో చూడలేదు. అదే పద్ధతిని ఇక ముందు కూడా ఫాలో అవడమే ఈ కంపెనీ స్ట్రాటెజీ కాగా.. అన్ని దేశాల్లో వేరు వేరు రూపాల్లో ఉంటున్న ఈ నయా కల్చర్‌ను అడ్వాన్స్‌డ్ వెర్షన్‌గా చెప్పుకొచ్చింది.

నిజానికి ఇక్కడ కంపెనీకి ప్లస్ అవుతున్న విషయాలు : 'రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయకపోవడం.. బంధాలు, బాధ్యతల గురించి పట్టించుకోకపోవడం.. మానవత్వాన్ని మరిచి మనుషులు ఎమోషన్స్‌లేని రోబోలుగా మారిపోవడం.. ఎంత ఎక్కువ డబ్బు ఉంటే అంత గొప్ప అనుకోవడం.. స్థలాలు, పొలాలు, ఎస్టేట్స్ కొంటూ అయినవారిని అనాథాశ్రమంలో చేర్చడం.. కంఫర్టబుల్ లైఫ్ స్టయిల్‌కు అలవాటుపడిపోవడం.. ఒంటరిగా ఉంటేనే అన్ని సుఖాలు అనుభవిస్తామనే అపోహ'. కానీ ఈరోజు తమ తల్లిదండ్రుల అంతిమ సంస్కారాల గురించి రుసుం చెల్లిస్తున్న వ్యక్తికి రేపు అదే గతి పడుతుందన్న ఆలోచన ఒక్కటే ఇలాంటి కంపెనీల మనుగడకు అడ్డు తగులుతుంది. మన ఆచార వ్యవహారాలు కొనసాగేలా చేస్తుంది. తలకొరివి పెట్టడం ద్వారా కన్నవారి రుణం తీర్చుకునే అవకాశం దక్కుతుందనే విషయం మరిచిపోవద్దు.

సనాతన ధర్మాలు, హిందూ జీవన విధానాల్లో మిగిలిన ఆఖరి లింక్ ఇదే. దీని తర్వాత ఏ నియమాలను పాటించాల్సిన అవసరమూ లేదు. మనకు కన్వీనియంటుగా ఉండే ఇజం... డబ్బులు అనే మనీయిజం మనముందు సాక్షాత్కరిస్తుంది. తల్లితండ్రులు అంటే ఓల్డ్ మోడల్.. వారికేం తెలియదు.. మనం డబ్బులు సంపాదించగలిగితే చాలు ప్రపంచమంతా మనకే తెలుసు అనే కొత్త సమాజ ఆవిష్కరణ జరుగుతోంది. పాశ్చాత్య నాగరికత మనలోకి దూరిపోతోంది. రూ. 50వేలతో 'సుఖాంత్ అంతిమ్ సంస్కార్' అందిస్తున్న ఫ్యునరల్ సర్వీస్.. 5 వేల ఏళ్ల సనాతనధర్మాన్ని కాలరాస్తుందా? హిందూనాగరికతను ఓడించగలుగుతుందా? చూద్దాం.

ఇవి కూడా చదవండి: 

30 ఏళ్ల నాటి పిండాలతో కవల పిల్లలు.. పేరెంట్స్ కంటే వయసు ఎక్కువే.!

Tags:    

Similar News