వ్యసనంగా మారుతున్న వ్యక్తిగత స్వార్థం.. సామాజిక వ్యతిరేక ప్రవర్తనతో..
మానసిక రుగ్మతలు మనిషి ప్రవర్తనను, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. కొన్నిసార్లు అవి వాటంతట అవే తగ్గిపోతుంటాయి. అయితే కొన్ని రకాల మెంటల్ డిజార్డర్స్ మాత్రం ఇబ్బందిగా మారుతుంటాయి.
దిశ, ఫీచర్స్ : మానసిక రుగ్మతలు మనిషి ప్రవర్తనను, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. కొన్నిసార్లు అవి వాటంతట అవే తగ్గిపోతుంటాయి. అయితే కొన్ని రకాల మెంటల్ డిజార్డర్స్ మాత్రం ఇబ్బందిగా మారుతుంటాయి. బాధితుల వ్యక్తిగత, సామాజిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంటాయి. అలాంటివాటిలో యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ (ASPD) కూడా ఒకటి. ఈ రుగ్మత కలిగిన బాధితులు సాధారణంకంటే భిన్నమైన ప్రవర్తనను కలిగి ఉంటారు. ఇతరుల సమస్యలను, భావోద్వేగాలను అర్థం చేసుకునే ప్రయత్నం అస్సలు చేయరు. పైగా నిర్లక్ష్యం వహిస్తారు. తమ స్వార్థం కోసం ఇతరుల శ్రేయస్సును వదిలేస్తారు. సామాజిక నిబంధనలు, నియమాలను ఉల్లంఘించే ప్రయత్నం చేస్తుంటారు.
మోసం, నిర్లక్ష్యం, హానికర ప్రవర్తన
యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ బాధితులు చాలా సందర్భాల్లో వాస్తవాలతో సంబంధం లేకుండా వ్యవహరిస్తుంటారు. పైగా వీరు తమ గోల్స్ సాధించడానికి ఇతరులను మోసం చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. పరిస్థితిని తమకు అనుకూలంగా మల్చుకోవడానికి అవసరమైతే ఇతరులను ద్వేషిస్తారు. దురుసుగా ప్రవర్తిస్తారు. వారిపై అభాండాలు మోపుతారు. బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తుంటారు. తమ సొంత భద్రతను, ఇతరుల శ్రేయస్సు గురించి కూడా పెద్దగా పట్టించుకోరు. కొందరు మాదక ద్రవ్యాల దుర్వినియోగం, సురక్షితం కాని లైంగిక సంబంధాలు, క్రిమినల్ యాక్టివిటీస్ వంటి వ్యసనాల బారిన పడుతుంటారు. ఇక తమకు ఏదైనా తీవ్ర హాని జరుగుతుంది అనుకున్నప్పుడు మాత్రమే వీరు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తుంటారు. ఇతరుల విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. ఈ విధమైన బిహేవియర్ కారణంగా వీరికి సొంత కుటుంబాలు, బంధువులు కూడా దూరం అవుతుంటారు.
బాధ్యతల్లో వైఫల్యం
సామాజిక వ్యతిరేక మనస్తత్వం కారణంగా ఏఎస్‌పీడీ బాధితులు బాధ్యతల నిర్వహణలో విఫలం చెందుతుంటారు. తమ కుటుంబ పోషణ, ఆర్థికపరమైన అంశాల నిర్వహణ వంటివి కూడా పట్టించుకోరు. పైగా ఇక్కడ కూడా మోసం, పెత్తనం వంటి ధోరణి ప్రదర్శిస్తుంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ బాధితుడు అయితే గనుక, అతను రోజూ తన భార్యను, ఇతర కుటుంబ సభ్యులను తిట్టడం, కొట్టడం, ఇంటిలో నుంచి వస్తువులు, డబ్బులు దొంగిలించి తన సొంత అవసరాలకు వాడుకోవడం వంటి ప్రవర్తనను కలిగి ఉండే అవకాశం ఉంటుంది. అయితే అందరిలో ఇదే తరహా ప్రవర్తన ఉంటుందని చెప్పలేం. ఒక్కొక్కరు ఒక్కో విధమైన వ్యతిరేక ప్రవర్తన కలిగి ఉండవచ్చు.
ఎలా డెవలప్ అవుతుంది?
అమెరికన్ అకాడమీ ఆఫ్ చైల్డ్ అండ్ అడాలోసెంట్ సైకియాట్రీ జర్నల్ ప్రకారం.. చిన్నప్పటి నుంచి ఎక్కువగా శారీరక, మానసిక హింస, వేధింపులను ఎదుర్కోవడం, కుటుంబ పరంగా, సమాజ పరంగా నిర్లక్ష్యానికి గురికావడం వంటి పరిస్థితిల కారణంగా యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇక అరుదుగా అనుకూలం కాని పేరంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఇందుకు కారణం కావచ్చు. కాబట్టి పిల్లలను సరైన వాతావరణంలో పెంచాల్సిన అవసరాన్ని మానసిక నిపుణులు గుర్తు చేస్తున్నారు.
పరిష్కారం ఏమిటి?
సామాజిక వ్యతిరేక మనస్తత్వ బాధితుల నిర్దిష్ట ప్రవర్తనను, లక్షణాలను బట్టి మానసిక వైద్య నిపుణులు థెరపీలను సజెష్ చేస్తారు. ఇందులో సైకో థెరపీ, మెడికేషన్స్, స్కిల్ ట్రైనింగ్, సపోర్టివ్ సర్వీసెస్ వంటి చికిత్సా పద్ధులు ఉన్నాయి. ప్రస్తుతం కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ కూడా అందుబాటులో ఉంది. అలాగే బాధితుల్లో డిప్రెషన్, యాంగ్జైటీ, ఉద్రేకం, కోపం వంటి లక్షణాలను బట్టి ఏ విధమైన ట్రీట్మెంట్, మెడికేషన్స్ అవసరమో నిర్ధారిస్తారు. యాంటీ సోషల్ బిహేవియర్‌ను మార్చడానికి సానుభూతి, కమ్యూనికేషన్, సంఘర్షణల నివారణ, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ వంటి అంశాలను కౌన్సెలింగ్‌లో భాగంగా బోధిస్తారు.