Kitchen cleaning : వామ్మో.. రోగాలకు నిలయంగా వంటగది.. ఈ వ్యాధులకు అదే కారణం!

పరిశుభ్రత ఆరోగ్యంతో ముడిపడి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఇండ్లను, బయటి పరిసరాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు.

Update: 2024-09-12 09:35 GMT

దిశ, ఫీచర్స్ : పరిశుభ్రత ఆరోగ్యంతో ముడిపడి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఇండ్లను, బయటి పరిసరాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కిచెన్ శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ వంట సామగ్రి మొదలు కొని తినే ప్లేట్ల వరకు అన్నీ ఉంటాయి. వాటిపై చీమలు, వివిధ సూక్ష్మ జీవులు, బ్యాక్టీరియాలు చేరే అవకాశం ఎక్కువ. కాబట్టి ఎల్లప్పుడూ క్లీన్‌గా, నీట్‌గా ఉంచడానికే అందరూ ప్రయత్నిస్తారు. అయితే గిన్నెలు, డబ్బాలు శుభ్ర పర్చడానికి చాలా మంది కిచెన్‌లో మెత్తని గుడ్డలు, స్పాంజ్‌లు ఉపయోగిస్తుంటారు. ఒకసారి వాడాక వీటిని వెంటనే నీటితో శుభ్రం చేయాలి. అయితే కొందరు తర్వాత చేద్దాం లే అని పక్కన పెట్టేస్తుంటారు. కానీ దీనివల్ల రోగాలు వచ్చే అవకాశం ఉందని డ్యూక్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.

హానికారక బ్యాక్టీరియాలు

వంటగదిలో వాడే స్పాంజ్‌లు, గుడ్డలను శుభ్రం చేయకపోవడంవల్ల వాటిపై టాయిలెట్ బౌల్స్‌పై కంటే కూడా ఎక్కువ హానికారక బ్యాక్టీరియాలు చేరుతాయని డ్యూక్ యూనివర్సిటీకి చెందిన బయో మెడికల్ ఇంజినీర్లు కనుగొన్నారు. ఒక గుడ్డ లేదా స్పాంజ్‌పై పరిశీలించినప్పుడు సెంటీమీటర్‌ పరిమాణంలో సుమారు 54 బిలియన్ల చిన్నపాటి హానికారక బ్యాక్టీరియాలు ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీటిలో సాల్మొనెల్లా సహా అనేక బ్యాకీరియాలు ఉంటున్నాయి. ఇవన్నీ వంటగది మొత్తాన్ని కలుషితం చేస్తాయని, ఫుడ్ పాయిజనింగ్‌కు కారణం అవుతాయని రీసెర్చర్స్ అంటున్నారు.

ఏ వ్యాధులు వస్తాయంటే..

కిచెన్‌లో క్లీనింగ్ కోసం యూజ్ చేసే స్పాంజ్‌లను, క్లాత్‌లను శుభ్రపర్చకుండా వదిలేయడం వల్ల వాటిపై క్యాంపులో బాక్టర్, ఎంటెరోబాక్టర్, ఈ కొలీ, సాల్మొనెల్లా, మోరాక్సెల్లా ఒస్లోన్సిస్, క్లెబ్సినెల్లా, ప్రోటీస్ వంటి హానికారక బ్యాక్టీరియాలు ఫామ్ అవుతున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఇవి వివిధ రోగాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్, న్యుమోనియా, మెనింజైటిస్, సెప్టిసినియా వంటి వ్యాధులు వస్తాయని పరిశోధకులు చెప్తున్నారు. అందుకే వాటిని కిచెన్‌‌లో గిన్నెలు, సింక్, స్టౌ వంటి సామగ్రి వంటి క్లీనింగ్‌కు ఉపయోగించిన వెంటనే నీటితో ఉతికి ఎండలో ఆరబెట్టాక యూజ్ చేయాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇలా చేయడంవల్ల బ్యాక్టీరియాలు చేరకుండా, వ్యాధులు వ్యాపించకుండా ఉంటాయి. 


Similar News