పిల్లల్లోనూ డయాబెటిస్.. లక్షణాలు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవే..
డయాబెటిస్ ఒకప్పుడు వయస్సు పైబడిన వారిలో మాత్రమే వస్తుండేది. కానీ ఇప్పుడు ఏ వయస్సులో ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితులు ఉంటున్నాయి. అందుకే దీనిని వైద్య నిపుణులు ‘అంటువ్యాధి’గానూ అభివర్ణిస్తున్నారు.
దిశ, ఫీచర్స్ : డయాబెటిస్ ఒకప్పుడు వయస్సు పైబడిన వారిలో మాత్రమే వస్తుండేది. కానీ ఇప్పుడు ఏ వయస్సులో ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితులు ఉంటున్నాయి. అందుకే దీనిని వైద్య నిపుణులు ‘అంటువ్యాధి’గానూ అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది దీనిబారిన పడుతున్నారు. ఆందోళనకర విషయం ఏంటంటే.. ఇటీవల నెలలు నిండిన చిన్నపిల్లల్లోనూ డయాబెటిస్ లక్షణాలు కనిపిస్తుందటం నిపుణులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. టైప్ 2 డయాబెటిస్ శక్తి కోసం శరీరం చక్కెరను (గ్లూకోజ్) ఉపయోగించుకునే తీరును అడ్డుకుంటుంది. ముఖ్యంగా ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించకుండా ఆపుతుంది. ఒకవేళ ట్రీట్మెంట్ అందకపోతే రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కాలక్రమేణా టైప్ 2 డయాబెటిస్ మొత్తం శరీరానికి, ముఖ్యంగా నరాలు, రక్తనాళాలకు తీవ్రమైన హాని కలిగిస్తుంది. అందుకే దాని లక్షణాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లల్లో డయాబెటిస్ పెరిగే అవకాశాలు, లక్షణాలు ఏమిటో నిపుణులు వివరిస్తున్నారు.
ఒబేసిటీ
అధిక బరువు పెరగడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. డయాబెటిస్ టైప్ 2 వాటిలో ఒకటి. పొత్తికడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోయినప్పుడు, అది ఇన్సులిన్ నిరోధకతను కష్టతరం చేస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెరను నిర్వహించడం కూడా కష్టం అవుతుంది. కాబట్టి బరువు పెరుగుతున్నట్లు గమనిస్తే పిల్లలైనా, పెద్దలైనా తగిన నిర్ధారణ పరీక్షలతోపాటు జాగ్రత్తలు తీసుకోవాలి.
గర్భధారణ సమయంలో
గర్భధారణ సమయంలో డయాబెటిస్‌తో (Gestational Diabetes) బాధపడుతున్నతున్న తల్లుల వల్ల వారి పుట్టబోయే పిల్లలకు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో రెగ్యులర్ హెల్త్ చెకప్స్, డయాబెటిస్ కంట్రోల్ చేయగలిగే మెడికేషన్స్, ఆహారాలు డాక్టర్ల సూచన మేరకు వాడటం మంచిది.
కుటుంబ చరిత్ర
కొన్ని రకాల వ్యాధులకు కుటుంబ చరిత్ర అంటే జన్యుపరమైన అంశాలు ప్రధాన కారణాలుగా ఉంటాయి. మధుమేహం అభివృద్ధి చెందుతున్న కుటుంబ చరిత్ర కలిగినవారిలోని పిల్లలకు ఇది సంక్రమించే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు జన్యువులు ఇన్సులిన్ నిరోధకతను, అలాగే గ్లూకోజ్ జీవక్రియను ప్రభావితం చేస్తాయి.
ఆహారపు అలవాట్లు
ఆహార ఎంపికలు మొత్తం ఆరోగ్యం విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎక్కువగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, చక్కెర పానీయాలు, వంటి ఆహార ఎంపికలు పిల్లలలో డయాబెటిస్ రిస్కును పెంచుతాయి. శుద్ధి చేసిన పిండి పదార్థాలను (refined carbs) అధికంగా తీసుకోవడం వల్ల తరచుగా బరువు పెరుగడంతోపాటు డయాబెటిస్ బారినపడే చాన్స్ ఉంటుంది.
లేజీ లైఫ్ స్టైల్
పలు ఆరోగ్య సమస్యలను అభివృద్ధి చేయడంలో నిశ్చల జీవనశైలి ప్రధాన కారణంగా ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడంవల్ల పిల్లలలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఇటీవల పెరుగుతోంది. సాధారణ వ్యాయామాలలో పాల్గొనడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెరను మెరుగ్గా నిర్వహించడంలో సహాయపడుతుంది
లక్షణాలు, నిర్ధారణ, నివారణ
డబ్ల్యుహెచ్‌ఓ ప్రకారం.. “టైప్ 2 డయాబెటిస్ అభివృద్ధి చెందడానికి అధిక బరువు, తగినంత వ్యాయామం చేయకపోవడం, జన్యుశాస్త్రం వంటివి రిస్క్ ఫ్యాక్టర్స్‌గా ఉంటున్నాయి. టైప్ 2 డయాబెటిస్ యొక్క చెడు ప్రభావాలను నివారించడానికి ముందస్తు రోగ నిర్ధారణ చాలా ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. మధుమేహాన్ని ముందుగానే గుర్తించడానికి అన్నింటికంటే ఉత్తమ మార్గం రెగ్యులర్ చెక్-అప్‌లు, అలాగే బ్లడ్ టెస్టులు కూడాను. ఇక వీటితోపాటు తరచుగా అధిక దాహం, చాలా ఎక్కువసార్లు మూత్రవిసర్జన, నిరంతర అలసట, ఊహించని రీతిలో బరువు తగ్గడం, మానసిక కల్లోలం వంటివి డయాబెటిస్ సాధారణ సంకేతాలుగా, లక్షణాలుగా పేర్కొనవచ్చు. ఇవి దీర్ఘకాలం కొనసాగితే డయాబెటిస్ తీవ్రమై గుండె జబ్బులు, ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది. కాబట్టి పిల్లల్లో వాటి నివారణకు తగిన కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.