Beauty and health: అందాన్ని, ఆరోగ్యాన్ని దెబ్బతీసే కొన్ని అలవాట్లు.. ఏవి ఎలా ప్రభావితం చేస్తాయంటే..

Beauty and health : అందాన్ని, ఆరోగ్యాన్ని దెబ్బతీసే కొన్ని అలవాట్లు.. ఏవి ఎలా ప్రభావితం చేస్తాయంటే..

Update: 2024-09-26 13:26 GMT

దిశ, ఫీచర్స్ : చూడ్డానికి తాము అందంగా, అట్రాక్టివ్‌గా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. వయస్సుతో సంబంధం లేకుండా యవ్వనంగా కనిపించే ప్రయత్నం చేస్తుంటారు. అందుకోసం రకరకాల దుస్తులు ధరించడం, మేకప్ చేయడం వంటి అంశాలపట్ల ఆసక్తి చూపుతుంటారు. అయితే ఎన్ని చేసినా, కొన్ని రకాల అలవాట్లు, జీవితంలో ఎదుర్కొనే సమస్యలు మనుషుల్లో యవ్వన ఛాయలను దూరం చేస్తాయని, వయస్సుకంటే ముందగానే వృద్ధాప్యానికి దారితీస్తాయని నిపుణులు చెప్తున్నారు. అవేమిటో, ఎలా జాగ్రత్త పడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మూడు పదుల వయస్సు కూడా దాటక ముందే ముఖంపై ముడతలు, జుట్టు రాలిపోవడం, ముఖ వర్ఛస్సు తగ్గడం వంటి లక్షణాలు కొందరిలో కనిపిస్తుంటాయి. ఇందుకు రోజువారీ ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, మానసిక ఆందోళనలు కూడా కారణం అవుతాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురయ్యే వారిలో వయస్సుతో సంబంధం లేకుండా గ్లామర్ తగ్గవచ్చు. మిగతా వారితో పోలిస్తే వీరిలో వృద్ధాప్య ఛాయలు కనిపించే అవకాశం ఎక్కువ. కాబట్టి నిరంతరం ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితులను అవైడ్ చేయాలంటున్నారు నిపుణులు. అలాగే ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాటిని ఎదుర్కొనే ఎనర్జీని సంపాదించుకోవడం ద్వారా కూడా సమస్య నుంచి బయటపడవచ్చు.

మితిమీరిన ఆహారాలు

అందంగా కనిపించాలంటే ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఇక్కడ అందం అంటే నలుపు, తెలుపు వంటివి కావు. ఎలా ఉన్నా ముఖంలో ఒక విధమైన గ్లామర్, ఆకర్షణ వంటవి కనిపిస్తాయి. దీనినే అందం అంటున్నారు నిపుణులు. అలా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. అయితే సమయం, సందర్భం లేకుండా మితిమీరిన ఆహారపు అలవాట్లు కూడా ఆరోగ్యాన్ని, అందాన్ని పాడుచేస్తాయని చెప్తున్నారు. ఎందుకంటే శరీరానికి కావాల్సిన పోషకాలు లభించకపోతే ఎముకలు, కండరాలు బలహీనపడతాయి. చర్మం అందవిహీనంగా మారుతుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు పెరిగిపోయి అందాన్ని దెబ్బతీస్తాయి. అలాగే ప్లాస్టిక్ కవర్లలో ఆహారాలు స్టోర్ చేసుకొని తినడం, ప్లాస్టిక్ కంటైనర్లలో అంచ్ బాక్స్‌లు కట్టుకెళ్లడం, వేడి వేడి పదార్థాలు ప్లాస్టిక్ గ్లాసుల్లో, గిన్నెల్లో తీసుకొచ్చి యూజ్ చేయడం వంటి అలవాట్లు ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి. వీటిలోని కెమికల్స్‌కు ఎక్స్‌పోజ్ అవడంవల్ల వృద్ధాప్య ఛాయలు పెరుగుతాయి. వయస్సుతో సంబంధం లేకుండానే గ్లామర్ దెబ్బతింటుంది.

నీళ్లు, పాలు, సోడా, కాఫీ కూడా..

అందానికి, ఆరోగ్యానికి కొన్ని రకాల పానీయాలు కూడా ముఖ్యం. అలాగే కొన్నింటివల్ల నష్టం కూడాను. ముఖ్యంగా ప్రతిరోజూ సరిపడా నీళ్లు తాగకపోతే బాడీ డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఇది డ్రై స్కిన్‌కు, అలాగే వృద్ధాప్య ఛాయలకు దారితీస్తుంది. దీంతో మీలోని శారీరక అందం తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఇక ప్యాకేజ్డ్ పాలు, సోడాలు, కాఫీలు వంటి కెఫిన్ రిలేటెడ్ పానీయాలు ఎక్కువగా తీసుకోవడం కూడా మీ గట్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. చర్మంపై వృద్ధాప్య ఛాయలను పెంచుతాయి. కాఫీ మరీ ఎక్కువగా తాగితే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అలాగే అందంగా కనిపించాలని వాడే కొన్ని రకాల లోషన్లు, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా చర్మాన్ని డ్రైగా మారుస్తాయి. వాస్తవానికి అవి సహజమైన అందాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఈ అలవాట్లు మానుకోవడం బెటర్.

స్క్రీన్ల ముందు ఎక్కువగా గడపడం

అధిక స్క్రీన్ సమయం కూడా మీలో అందాన్ని తగ్గించే అలవాట్లలో ఒకటి. గంటల తరబడి టీవీలు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్లను చూస్తూ గడపడం, ముఖ్యంగా రాత్రిళ్లు నిద్రమేల్కొని మరీ వాటికి అతుక్కుపోవడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ అలవాట్లు ఉన్నవారిలో అవి లేనివారికంటే ముందుగానే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. నిద్రలేమికి సమస్యకు దారితీస్తాయి. తద్వారా కళ్లకింద నల్లటి మచ్చలు, వలయాలు ఏర్పడతాయి. దీంతోపాటు మితిమీరిన వ్యాయామాలు, జంక్ ఫుడ్స్, మేకప్ తొలగించుకోకుండా పడుకోవడం, అతి ఆలోచనలు, ఆందోళనలు కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మీ అందాన్ని తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వీటిని తగ్గించుకోవడంతోపాటు సరైన పౌష్టికాహారం, శారీరక శ్రమ, నాణ్యమైన నిద్ర కలిగి ఉండటం వంటి జీవన శైలిని అలవర్చుకోవడం మీ అందాన్ని సహజంగానే పెంచుతుందని నిపుణులు చెప్తున్నారు.


Similar News