లైఫ్ క్వాలిటీని దెబ్బతీస్తున్న రోజువారీ అలవాట్లు.. మార్చుకోకపోతే ప్రమాదంలో పడ్డట్టే!

మనం రోజువారీ జీవితంలో సంతోషంగా ఉండాలనుకోవడంలో తప్పులేదు. కానీ ప్రతీ పని సులువుగా అయిపోవాలని ఆలోచిస్తుంటాం. మనసుకు నచ్చిన పనిని ఎక్కువసేపు చేసేస్తుంటాం. అయితే అన్ని సందర్భాల్లోనూ, అన్ని విషయాల్లోనూ ఇదే పద్ధతిని వర్తింప జేస్తే మాత్రం నష్టపోతాం.

Update: 2024-05-15 14:43 GMT

దిశ, ఫీచర్స్ : మనం రోజువారీ జీవితంలో సంతోషంగా ఉండాలనుకోవడంలో తప్పులేదు. కానీ ప్రతీ పని సులువుగా అయిపోవాలని ఆలోచిస్తుంటాం. మనసుకు నచ్చిన పనిని ఎక్కువసేపు చేసేస్తుంటాం. అయితే అన్ని సందర్భాల్లోనూ, అన్ని విషయాల్లోనూ ఇదే పద్ధతిని వర్తింప జేస్తే మాత్రం నష్టపోతాం. లైఫ్ రిస్కులో పడుతుంది. ఎందుకంటే కొన్ని రకాల డైలీ రోటీన్స్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు చెప్తున్నారు. వాటిని వెంటనే మానుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు. అవేమిటో చూద్దాం.

ఎక్కువసేపు వేడినీటి స్నానం

మనలో చాలామందికి గోరు వెచ్చటితో స్నానం చేయడం హాయిగా అనిపిస్తుంది. కానీ ఎక్కువ హాట్ వాటర్ షవర్ కింద ఉండటంవల్ల రిస్కులో పడ్డట్లే. ఎందుకంటే వేడి నీటికి ఎక్కువసేపు గురికావడంవల్ల నేచురల్ ప్రొటెక్టివ్‌గా ఉండే ఆయిలీ స్కిన్ లేయర్స్ దెబ్బతింటాయి. దీంతో చర్మం పొడిబారుతుంది. స్కిన్ అలెర్జీలు రావచ్చు. కాబట్టి ఈ అలవాటును మానుకోవడం బెటర్.

ఆహారాన్ని వేడిచేసి తినడం

వంట చేయడానికి ఓపిక లేకనో, రాత్రింబవళ్లు వండటం దేనికనో కొందరు ఒకేసారి వండేసి, ఫ్రిజ్‌లో పెట్టేసి తిన్నప్పుడల్లా వేడి చేసి తింటుంటారు. కానీ ఇలా చేయడం ప్రమాదకరం. రెడీమీడ్ మీల్స్ మీ సమయాన్ని ఆదా చేయవచ్చు కానీ అందులో సంతృప్త కొవ్వులు, అధిక సోడియం ఉంటాయి. వేడిచేయడంల్ల అనారోగ్యాలను కలిగిస్తాయి.

సింథటిక్ సువాసనలు

ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, ముఖ్యంగా బాత్‌రూమ్ నీట్‌గా ఉంచుకోవాలని భావిస్తారు. అందుకోసం సువాసనలు వెదజల్లే సింథటిక్ లిక్విడ్స్‌‌ను స్ర్పే చేస్తుంటారు. కానీ ఇలా చేయవద్దు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ అలర్జీ, ఆస్తమా అండ్ ఇమ్యునాలజీ ప్రకారం ఇది ఆస్తమా, శ్వాసకోశ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.

రాత్రిపూట గిన్నెలను నానబెట్టడం

రాత్రిపూట తినేసిన తర్వాత చాలామంది మహిళలు వంట పాత్రలను సింక్ బేసిన్‌లో నానబెడుతుంటారు. అలా చేయడంవల్ల మరుసటి ఉదయం కడగడం ఈజీ అవుతుందని భావిస్తారు. కానీ ఇది ప్రమాదకరం కూడాను. ఎందుకంటే అందులో మిగిలిపోయిన పదార్థాలు బాగా నానడంవల్ల అందులో బ్యాక్టీరియా పుట్టుకొస్తుంది. ఇది వివిధ అలెర్జీలకు కారణం కావచ్చు.

పడుకునే ముందు తలస్నానం

ఎక్కువసేపు పనిచేయడం, అలసటకు గురికావడం వల్ల పడుకోవడానికి ముందు తలస్నానం చేయడం రిలాక్స్‌గా అనిపిస్తుంది. కానీ స్నానం తర్వాత చాలామంది తలను తుడుచుకోకపోవడం లేదా సక్రమంగా తుడుచుకోకపోవడం చేస్తుంటారు. దీనివల్ల చుండ్రు, జుట్టు రాలే సమస్య తలెత్తుతుంది. కాబట్టి ఈ అలవాటును మార్చుకోవాలి.

మేకప్‌తో నిద్రపోవడం

కొందరు బయట వివిధ ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు మేకప్ వేసుకుంటారు. కానీ ఇంటికి తిరిగి వచ్చాక అది తొలగించకుండానే పడుకుంటారు. ఇది ప్రమాదకరం. మేకప్‌లో హానికారక రసాయనాలు ఉంటాయి. అలాగే పడుకోవడంవల్ల చర్మ వ్యాధులు వస్తాయి. ఈ అలవాటు వెంటనే మానుకోండి.

సోడాలు తాగడం

భోజనం తర్వాత సోడా తాగే అలవాటు కొందరికి ఉంటుంది. ఇలా చేస్తే గ్యాస్ ప్రాబ్లం పోతుందని భావిస్తుంటారు. అయితే ప్రతిరోజూ ఇలా చేస్తే మాత్రం ప్రమాదంలో పడ్డట్లే. ఎందుకంటే సోడాలు వాస్తవానికి అధిక చక్కెర స్థాయిలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని అవయవాలను బలహీన పరుస్తాయి.

ముక్కులో వెంట్రుకలు తీయడం

చాలామంది ముక్కులో వెంట్రుకలు కట్ చేస్తుంటారు. కానీ అవి ముక్కులోకి దుమ్ము, ధూళి వంటివి నేరుగా పోకుండా రక్షణగా ఉంటాయి. కాబట్టి కట్ చేయకపోయినా ఏమీ కాదు. ముక్కు లోపలి భాగాన్ని దాటి పెరిగితే మాత్రమే ఎక్స్‌ట్రా హెయిర్‌ను కట్ చేసుకోవవచ్చు.

షేవింగ్‌లో ఒకే రేజర్‌ను వాడటం

ప్రస్తుతం చాలామంది ప్రతిరోజూ షేవింగ్ చేసుకోవడం కామన్ అయిపోయింది. మీరు రేజర్‌తో షేవింగ్ చేస్తుంటే గనుక ఒకే రేజర్‌ను ఎక్కువసార్లు ఉపయోగించ కూడదు. ఎందుకంటే రేజర్‌పై బ్యాక్టీరియా పేరుకుపోయి ఉండవచ్చు. అది స్కిన్ అలెర్జీలకు కారణం అవుతుంది.

లంచ్ తర్వాత నిద్ర

మధ్యాహ్న భోజనం తర్వాత నిద్ర నిద్రపోవడం ఉత్సాహంగా అనిపించవచ్చు. కానీ దీనివల్ల అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. మెటబాలిక్ సైకిల్ దెబ్బతింటుంది. నిద్రలేమి, రిఫ్లెక్స్ వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఉదయం టిఫిన్ చేయకపోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.

నీళ్లు తాగకపోవడం

చాలామంది బిజీ షెడ్యూల్ కారణంగా రోజు మొత్తంలో తగినంత నీరు తాగడం మర్చిపోతుంటారు లేదా నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ దీనివల్ల ఆరోగ్యం రిస్కులో పడుతుంది. శరీరానికి తగినంత నీరు అందకపోతే బాడీ డీహైడ్రేషన్ బారిన పడుతుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి అవసరమైనన్ని నీళ్లు తాగడం మాత్రం మర్చిపోవద్దు. ఇవన్నీ ఆరోగ్యకరమై, సంతోషకరమైన జీవితానికి చాలా ముఖ్యం. ఇందుకు అనుగుణంగా మీ అలవాట్లను మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


Similar News