Snoring : గురక అలవాటు.. నిర్లక్ష్యం చేస్తే ఆ సమస్యలు పెరగుతాయ్!
Snoring : గురక అలవాటు.. నిర్లక్ష్యం చేస్తే ఆ సమస్యలు పెరగుతాయ్!
దిశ, ఫీచర్స్ : అందరూ గాఢంగా నిద్రపోతుంటారు. సడెన్‌గా ఓ వ్యక్తి పెద్దగా గురకపెట్టడం స్టార్ట్ చేశారనుకోండి!.. ఇంకేముందు ఆ సౌండ్‌కు చుట్టు పక్కల ఉన్నవారు కూడా మేల్కొంటారు లేదా ఆ గురక పెట్టే వ్యక్తి పక్కన ఉన్నవారు మేల్కొంటారు. ఇలా ఏదో ఒకరోజు అయితే పర్లేదు. రోజూ అదే పరిస్థితి ఎదురైతే.. గురక పెట్టే వ్యక్తితోపాటు కుటుంబంలోని ఇతర వ్యక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రతిరోజూ నిద్ర మధ్యలో మేల్కోవడం వల్ల క్రమంగా అది నిద్రలేమికి దారితీయవచ్చు. కాబట్టి గురకను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని, దానివల్ల వచ్చే హెల్త్ రిస్క్‌ను తగ్గించుకునే ప్రయత్నం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తు్న్నారు.
గురక ఎందుకు వస్తుంది?
వాస్తవానికి గురక స్లీప్ సైకిల్‌కు ఆటంకం కలిగించే తీవ్రమైన సమస్యగా చెప్పవచ్చు అంటున్నారు నిపుణులు. ఇది అలసటకు, పగటి నిద్రకు ప్రేరణగా మారుతుంది. ఫలితంగా తరచూ నీరసం ఆవహించడం, వర్క్ ప్రొడక్టివిటీ తగ్గడం వంటి ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంటాయి. అసలు ఈ గురక ఎందుకు వస్తుందంటే.. నిద్రపోతున్నప్పుడు ముక్కు, నోటి ద్వారా పీల్చే గాలికి అడ్డంకి ఏర్పడటంవల్ల వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆటంకం ముక్కు, గొంతులోని చుట్టు పక్కల టిష్యూస్ వైబ్రేట్ అవ్వడంవల్ల పెద్దగా శబ్దం వస్తుంది. అంతేకాకుండా ముక్కు బ్లాక్ అవడం, నాలుక, గొంతు కండరాలు బలహీన పడటం వంటి సందర్భాల్లోనూ గురకవస్తుంది. అలర్జీలు, సైనస్ ఇన్‌ఫెక్షన్స్, ముక్కు కండరం వంకరగా ఉండటం(Deviated septum) వంటివి ఉన్నప్పుడు నోస్ హోల్స్‌ను బ్లాక్ చేస్తాయి. దీనివల్ల కూడా గురక వస్తుంది.
ఊబకాయం లేదా అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్న వారిలో, అలాగే తరచుగా మద్యపానం సేవించే వారిలో గురక సమస్య ఏర్పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా నెక్ దగ్గర ఫ్యాట్ పెరగడంవల్ల ఎయిర్ వే కుంచించుకుపోతుంది. దీనివల్ల కూడా గురక వస్తుంది. అట్లనే ఆల్కహాల్ గొంతు కండరాలను ప్రభావితం చేయడం ద్వారా నిద్రపోతున్నప్పుడు శ్వాసలో ఆటంకాలు ఏర్పడినప్పుడు గురక వస్తుంది.
గురకవల్ల వచ్చే అనారోగ్యాలు
గురక చిన్న సమస్యే కదా అని నిర్లక్ష్యం చేస్తే క్రమంగా ఇతర అనారోగ్యాలకు, వ్యాధులకు దారితీసే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA)కు దారితీస్తుంది. అంటే ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్న వ్యక్తుల్లో నిద్రపోతున్నప్పుడు గురక వచ్చే క్రమంలో సడెన్‌గా కొన్ని క్షణాలు శ్వాస ఆగిపోయి మళ్లీ ప్రారంభం అవుతుంది. దీనివల్ల శరీరంలో జీవక్రియలకు, రక్త సరఫరాకు ఆటంకాలు ఏర్పడి అనారోగ్యాలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక గురక సమస్యను దీర్ఘకాలికంగా ఎదుర్కొనే వారిలో స్లీప్ అప్నియా కారణంగా ఇన్సులిన్ పనితీరు మందగిస్తుంది. దీంతో టైప్ 2 డయాబెటిస్ డెవలప్ అయ్యే చాన్స్ ఉంటుంది. అట్లనే నిద్ర సరిగ్గా లేకపోవడం, శరీరానికి ఆక్సిజన్ లెవల్స్ సక్రమంగా అందకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. అధిక రక్తపోటు, స్ట్రోక్, గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుంది. నిద్రకు ఆటంక కలిగించడంవల్ల స్ట్రెస్, యాంగ్జైటీస్ పెరుగుతాయి. ఏకాగ్రత దెబ్బతింటుంది. తలనొప్పి, మైగ్రేన్ వంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి అలర్ట్ అవ్వాలంటున్నారు నిపుణులు.
ఏం చేయాలి?
గురక సమస్య ప్రారంభంలోనే దానికి కారణాలను గుర్తించగలిగితే నివారణ సులభం అవుతుందంటున్నారు నిపుణులు. దీర్ఘకాలంగా అధిక ఒత్తిడిని ఎదుర్కోవడం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం వంటి జీవనశైలి కారణంగా గురక సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఇక అప్పటికే గురక సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే.. నిద్రపోతున్నప్పుడు స్లీప్ పొజిషన్ మార్చుకోవాలి. ముఖ్యంగా పక్కకు తిరిగి పడుకోవడంవల్ల నాలుక గొంతును అడ్డుకోదు. దీంతో గురక వచ్చినప్పుడు శ్వాసకు ఆటంకాలు ఏర్పడకుండా ఉంటాయి. అట్లనే అధిక బరువు తగ్గడానికి వ్యాయామాలు చేయాలి. వెయిట్ లాస్ వల్ల గొంతులో ఫ్యాట్ తగ్గి.. గురక కూడా దగ్గుతుంది. ఇక ముక్క దిబ్బడ వంటివి ఉంటే నోస్ స్ట్రిప్స్ వాడవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సమయానికి నిద్రపోవడం, శారీరక శ్రమ కలిగి ఉండటం, స్ట్రెస్, యాంగ్జైటీస్ వంటివి దూరం చేసుకోవడం గురక నివారణ చర్యల్లో భాగంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అప్పటికీ పరిష్కారం లభించకపోతే వైద్య నిపుణులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.