Sleep tourism : స్లీప్ టూరిజం.. అందమైన ప్రకృతి మధ్య నిద్రపోతే కలిగే ఆనందమే వేరంటున్న నిపుణులు!

అందమైన ప్రాంతాలు, కొంగ్రొత్త ప్రదేశాలను చుట్టి రావడమంటే చాలా మందికి ఇష్టమే. అందుకే నచ్చిన పర్యాటక ప్రాంతాలను ఎంచుకొని ఒంటరిగానో, కుటుంబంతోనో, ఫ్రెండ్స్‌తోనో టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు.

Update: 2024-09-12 08:10 GMT

దిశ, ఫీచర్స్ : అందమైన ప్రాంతాలు, కొంగ్రొత్త ప్రదేశాలను చుట్టి రావడమంటే చాలా మందికి ఇష్టమే. అందుకే నచ్చిన పర్యాటక ప్రాంతాలను ఎంచుకొని ఒంటరిగానో, కుటుంబంతోనో, ఫ్రెండ్స్‌తోనో టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు. పైగా ఇలాంటి ప్రయాణాలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయని, ఆరోగ్యానికి మేలు చేస్తాయని పలు అధ్యయనాలు కూడా పేర్కొన్నాయి. మెంటల్ హెల్త్‌తో ముడిపడి ఉన్నందున స్ట్రెస్ తగ్గించుకోవడానికి నిపుణులు కూడా విహార యాత్రలకు వెళ్లడాన్ని ప్రోత్సహిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే స్లీప్ టూరిజం అనే ఓ నయా ట్రెండ్‌ పుట్టుకొచ్చింది.

ఒత్తిడి నుంచి ఉపశమనం

స్లీప్ టూరింజం.. పేరును బట్టే దాని ప్రత్యేకత ఏమిటో దాదాపు అర్థమైపోతుంది. దీనిని న్యాప్‌కేషన్స్ లేదా ఎన్ఏపీ హాలిడేస్ అని కూడా పిలుస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొందరు రకరకాల సమస్యలు, ఒత్తిళ్లతో సతమతం అవుతున్నారు. దీంతో నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాంటివారు అందమైన పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తూ.. అక్కడ వివిధ పద్ధతులను అనుసరిస్తూ, బాగా నిద్రపోవడం ద్వారా స్ట్రెస్ రిలీఫ్ పొందుతారు. అందుకోసం ఎంచుకునే ప్రత్యేక ప్రయాణాలను, నిద్రవేళలకు అనువైన ప్రదేశాల సందర్శనను స్లీప్ టూరిజంగా ట్రావెలింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇది మానసిక ప్రశాంతతను కలిగిస్తున్నందువల్ల చాలా మంది మొగ్గు చూపుతున్నారు.

నిద్రలేమికి పరిష్కారం

కారణాలేమైనా కొందరు ఇంట్లో ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలతో, బాధలతో కంటినిండా కునుకుతీయడంలో ఇబ్బందులు పడుతుంటారు. మరి కొందరు మానసిక అలసటను అనుభవిస్తుంటారు. చేస్తున్న ఉద్యోగంలోనో, కుటుంబ, ఆర్థిక సమస్యల కారణంగానో నిరంతరం నిద్రలేమిని ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి వారికి ఇప్పుడు ‘స్లీప్ టూరిజం’ ఒత్తిడి నుంచి బయటపడే చక్కటి పరిష్కార మార్గంగా పనిచేస్తోంది. అయితే ఈ విధమైన టూరిజంలో అనుసరించే పద్ధతులే చక్కటి నిద్రకు, మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తుంటాయని మానసిక నిపుణులు చెప్తున్నారు. కేవలం పర్యాటక ప్రదేశాలకు ప్రయాణాలే కాకుండా అక్కడ రకరకాల క్రీడలు, స్విమ్మింగ్, ట్రెక్కింగ్, యోగా, పార్లర్ సెషన్, మెడిటేషన్ వంటివి యాక్టివిటీస్‌లలో భాగస్వామ్యం చేయడం ద్వారా నిద్రకు అవసరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తారని నిపుణులు అంటున్నారు. దీంతో మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ కూడా మెరుగు పడతాయి.

నిద్రను ప్రేరేపించే పద్ధతులు

స్లీప్ టూరిజంలో భాగంగా ట్రావెల్ ఏజెన్సీలు అందుకు పద్ధతులను అనుసరిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. మానసిక ఒత్తిడిని ఎదుర్కొనేవారు తమ ప్యాకేజీలను బట్టి చక్కటి అనుభూతిని పొందే వీలుంటుంది. అందమైన ప్రకృతికి నిలయమైన టూరిస్టు ప్రాంతాలను సందర్శిస్తూ ఒక్కోచోట నచ్చినన్ని రోజులు గడపవచ్చు. ఈ సందర్భంగా ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే కార్యక్రమాలు ఉంటాయి. కల్చరల్ ప్రోగ్రాములు, క్రీడల నిర్వహణ, యోగాసనాలు, ధ్యానం, ఆయుర్వేద పద్ధతిలో మసాజ్, ఆధునిక మసాజ్ థెరపీలు, వ్యాయామాలు వంటి సౌకర్యాలను స్లీప్ టూరిజం ఏజెన్సీలు కల్పిస్తున్నాయి. అవసరమైన వారికి టూరిస్టు ప్లేస్‌లోనే సైకాలజిస్టుల ద్వారా కౌన్సెలింగ్ వంటివి కూడా ఇప్పిస్తారు. కానీ దాదాపు ఇలాంటి అవసరం లేకుండా కేవలం ప్రకృతి ఆస్వాదన కారణంగానే చాలామంది స్ట్రెస్ రిలీఫ్ పొందుతుంటారు.

ఇండియాలో స్లీప్ టూరిజం ప్రేదేశాలు

స్లీప్ టూరిజానికి ప్రత్యేకంగా ఫలానా ప్రదేశాలు మాత్రమే బాగుంటాయి అనుకోవడానికి లేదు. కానీ చాలా మందికి మానసిక ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగించే వాటిని ఎంచుకోవడం ఇందులో భాగంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా చూసినప్పుడు అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇక భారత దేశం విషయానికి వస్తే కూడా ప్రముఖ టూరిజం స్పాట్లు ఉన్నాయి. అలాంటి వాటిలో రిషికేశ్, గోవా, సౌత్ ఇండియాలోని అనేక ప్రాంతాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

రిషికేశ్ సందర్శన

స్లీప్ టూరిజానికి చక్కటి ప్రదేశం రిషికేశ్. ఉత్తరాఖండ్‌లోని యోగా సిటీగా ఇది ప్రసిద్ధి చెందింది. జీవితంలో ఒక్కసారైన ఇక్కడికి వెళ్తే కలిగే మానసిక ఆనందమే వేరని పలువురు చెప్తుంటారు. ఇక్కడ 1961లో యోగా, ధ్యానం నేర్పించడానికి గుడిసెను నిర్మించారట. ఇప్పుడిది పెద్ద మెడిటేషన్ సెంటర్‌గా మారింది. అంతేకాకుండా ఇక్కడి గంగానది ఒడ్డున ఉన్న ఆస్తా మార్గాన్ని మెరైన్ డ్రైవ్ అంటారు. ఇది త్రివేణి ఘాట్ నుంచి బ్యారేజీ వరకు విస్తరించి ఉంది. వేలాది మంది వనభోజనాలకోసం ఉదయం, సాయంత్రం ఇక్కడికి వస్తుంటారు. అలాగే గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం, బీచ్ ఆఫ్ రిషికేశ్ కూడా పర్యాటకులను బాగా ఆకట్టుకుంటాయి. సముద్రపు ఒడ్డున కూర్చొని అలలను వీక్షించడం, నీటిలో ఆడుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందమైన ప్రకృతి దృశ్యాలు, యోగా కేంద్రాలు స్లీప్ టూరిస్టు స్పాట్లుగా ఉన్నాయి.

గోవా బీచ్, టిటో వీధి

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన స్లీప్ టూరిజం స్పాట్లలో భారతదేశంలోని గోవా ఒకటి. ఇక్కడి బీచ్‌లో విహరిస్తూ, పరిసరాలను ఆస్వాదిస్తూ ఉంటే కలిగే మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారని అంటారు. ఆ తర్వాత రాత్రిబసకోసం అందమైన హోటళ్లు, ప్రకృతిని ఆస్వాదిస్తూ నిద్రంచే ప్రత్యేక గెస్ట్ హౌజ్‌లు ఇక్కడ ఉంటాయి. ఘాట్ బీచ్ సమీపంలోని టిటో వీధి రాత్రి సమయంలో చూడముచ్చటగా ఉంటుంది. ఇక్కడి నైట్ క్లబ్‌లు స్ట్రెస్ రిలీఫ్‌గా ఉపయోగపడతాయని చెప్తారు. దీంతోపాటు కల్చర్ ప్రోగ్రాములు ఆకట్టుకుంటాయి. అలాగే మాండోవి నదిపై ఉన్న దూద్ సాగర్ జలపాతం కూడా స్లీప్ టూరిజం స్పాట్‌గా ఆకట్టుకుంటోంది. వాటర్ స్పోర్ట్స్, ఫైన్ డైనింగ్, విండ్ కైట్ సర్ఫింగ్, జెట్ స్కీయింగ్ వంటివి చాలామంది ఇష్టపడతారు.

 స్లీప్ టూరిజం స్పాట్లుగా ఇవి కూడా..

రిషికేశ్, గోవాతోపాటు దక్షిణ భారత దేశంలో స్లీప్ టూరిజానికి ప్రసిద్ధి చెందిన అనేక ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని అందమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తాయి. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో అందమైన కొండలు, జలపాతాలు కేరళలో చాలానే ఉన్నాయి. అలాగే కూర్గ్, మున్నార్ వంటి టూరిస్టు ప్రాంతాలు కూడా ఎగుడూ దిగుడు లోయలతో ఆకట్టుకుంటాయి. ఎత్తైన పర్వతాలు, పచ్చని మైదానాలు, జాలువారే జలపాతాలతో అలరిస్తాయి. ఇలాంటి అందమైన ప్రదేశాల్లో విహరిస్తున్నప్పుడు రాత్రివేళలు, పగటిపూట నిద్రపోయే సమయాలు మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి కాబట్టి ఇవన్నీ స్లీప్ టూరిజం స్పాట్లుగా ప్రసిద్ధి చెందాయి. 


Similar News