దిశ, ఫీచర్స్ : 'శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు' అన్నట్లు.. ఇప్పుడు ఏ అవసరానికైనా పనివాళ్ల కోసం ప్రతీచోట వెతకాల్సిన పనిలేదు. ఆన్‌లైన్ అంగట్లో అన్ని సర్వీసులు అందుబాటులో ఉంటున్నాయి. ఇంటి క్లీనింగ్ నుంచి ఒంటి మసాజ్ వరకు సత్వర సేవలందించేందుకు అనేక సంస్థలు పోటీ పడుతున్నాయి. అంతేకాదు ఇప్పుడు పర్టిక్యులర్ సర్వీస్ కోసం ప్రత్యేకంగా షాప్ ఓపెన్ చేయాల్సిన పనిలేదు. ఇండిపెండెంట్ ప్రొఫెషనల్ వర్కర్స్.. ఫోన్ కాల్స్‌పైనే కంప్లయింట్ తీసుకుని డోర్ టు డోర్ సర్వీస్ అందిస్తున్నారు. అయితే సరికొత్తగా వెలుగులోకి వచ్చిన కాల్ సర్వీస్ గురించి వింటే షాక్ అవ్వాల్సిందే!
టెక్నాలజీ బేస్డ్ సొసైటీని, పెరిగిన విజ్ఞానాన్ని ఆవిష్కరిస్తున్న ఈ పురోగతి.. ఓ వైపు 'మూఢ నమ్మకాలు, బ్లాక్ మ్యాజిక్(చేతబడి)' వంటి అపోహలను సవాల్ చేస్తుంటే, మరోవైపు అదే చేతబడి కోసం ఆన్‌లైన్ ప్రకటనలు కనిపిస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో 'ఎవరికైనా చేతబడి చేయబడును.. సంప్రదించాల్సిన నంబరు *' అని యథేచ్చగా పోస్టర్లు అంటించడం సొసైటీ గమనంపై, అక్షరాస్యులైన పౌరుల మానసిక స్థితిపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
మారుమూల పల్లెల్లో, అక్షరజ్ఞానం లేని వ్యక్తులే ఈ తరహా విశ్వాసాలు కలిగి ఉంటారనుకుంటే పొరపాటే. ఇప్పుడు నగరాల్లోనే కాక ఉన్నత విద్యావంతులు కూడా చేతబడి వంటి చర్యలను ఆశ్రయిస్తున్నారనేందుకు ఈ ప్రకటన పోస్టరే ఉదాహరణ. కెరియర్ ఒత్తిళ్లు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సవాళ్లు చుట్టుముట్టడంతో వివేకాన్ని కోల్పోతున్న జనం.. ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఆమోదయోగ్యంకాని పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. ఎదుటివారి ఎదుగుదలను చూసి ఓర్వలేక వారికి హాని తలపెట్టే మార్గాలను వెతుకుతున్నారు. ఇలాంటి వ్యక్తిత్వాలు సమాజంలో ఉండబట్టే.. ఈ టెక్నాలజీ ఎరాలో చేతబడి చేస్తామంటూ ప్రజలను నమ్మించగలిగే వాళ్లు మనగలుగుతున్నారు. ఆన్‌లైన్ సేవల్లోకి ఎంటర్ అయిపోయి.. 'ఎవరికైనా చేతబడి చేయబడును' అని దర్జాగా కాంటాక్ట్ నంబర్ ఇస్తున్నారు.