Brain stroke: పరిశోధనల్లో షాకింగ్ విషయాలు.. బ్రెయిన్ స్ట్రోక్‌కు అది కూడా కారణమే!

Brain stroke: పరిశోధనలో షాకింగ్ విషయాలు.. బ్రెయిన్ స్ట్రోక్‌కు అది కూడా కారణమే!

Update: 2024-09-20 07:20 GMT

దిశ, ఫీచర్స్ : ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటు తర్వాత అత్యంత ప్రమాదకరమైన హెల్త్ ఎమర్జెన్సీగా బ్రెయిన్ స్ట్రోక్‌ను పేర్కొంటారు నిపుణులు. ఏటా 1.5 కోట్ల మంది దీని బారిన పడుతుండగా.. 50 లక్షల మరణాలు సంభవిస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇంకెంతో మంది శాశ్వత వికలాంగులుగా మారుతున్నారు. ఒకప్పుడు వృద్ధుల్లోనే ఈ సమస్య ఎక్కువగా కనిపించేది. ఇటీవల ఏజ్‌తో సంబంధం లేకుండా అందరికీ వస్తోంది.

మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు స్ట్రోక్ వస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇది అత్యవసర వైద్య పరిస్థితి. రక్తనాళాలు సన్నబడటం లేదా బ్రెయిన్‌కు సరఫరా అయ్యే మార్గాల్లో గడ్డకట్టడం వల్ల సంభవిస్తుంది. ఒత్తిడితో కూడుకున్న జీవిన విధానం, ఆహారపు అలవాట్లు, స్మోకింగ్, శరీరంలో కొవ్వు శాతం అధికంగా పేరుకుపోవడం, డయాబెటిస్, అధిక బరువు, అధిక రక్తపోటు, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వంటివి ఇందుకు కారణం అవుతుంటాయని చెప్తారు. అయితే దీంతోపాటు మరికొన్ని అంశాలు కూడా బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణం అవుతున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

ఇప్పటి వరకూ ఉన్న కారణాలతోపాటు గాలి కాలుష్యం, అధిక ఉష్ణోగ్రతలు సైతం బ్రెయిన్ స్ట్రోక్‌కు రిస్కును పెంచుతున్నాయని ‘లాన్సెట్ న్యూరాలజీ జర్నల్’లో పబ్లిషైన అధ్యయన వివరాలు పేర్కొంటున్నాయి. 1990 తర్వాత నమోదైన బ్రెయిన్ స్ట్రోక్ కేసులను విశ్లేషిస్తే 73 లక్షల మందికి ఫస్ట్ టైమ్ స్ట్రోక్ రాగా.. 2021లో ఇది 1.19 కోట్లకు చేరుకున్నట్లు పరిశోధకులు అంటున్నారు. కాగా గతంతో పోలిస్తే బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం కారణంగా అత్యధిక మరణాలు పెరిగేందుకు అధిక ఉష్ణోగ్రతలు, గాలి కాలుష్యం కూడా ప్రధాన కారణమని పరిశోధకులు కనుగొన్నారు. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు. కాగా గాలి కాలుష్యం బ్రెయిన్ స్ట్రోక్‌ను కలిగిస్తుందనే విషయం మొదటిసారిగా బయటపడింది. కాబట్టి దాని నివారణ కోసం ప్రపంచం ఆలోచించాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజలు కూడా కాలుష్యం లేని ప్రాంతాల్లో నివసించడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని, ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించలేదు. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.  


Similar News