మహిళలకు తప్పని తిప్పలు.. ఆ పనులు స్త్రీలే చేయాలా ?

దిశ, ఫీచర్స్ : ప్రియాంక ఓ స్కూల్ టీచర్, రోజూ ఉదయాన్నే లేచి ఇంట్లో పనంతా చేసుకుని, పిల్లల్ని స్కూలుకు సిద్ధం చేస్తుంది. ఈ హడావిడిలో తను టిఫిన్ కూడా చేయకుండా లంచ్‌బాక్స్‌ పట్టుకుని ఆఫీసుకు బయలుదేరుతుంది..Latest Telugu News

Update: 2022-08-16 07:58 GMT

దిశ, ఫీచర్స్ : ప్రియాంక ఓ స్కూల్ టీచర్, రోజూ ఉదయాన్నే లేచి ఇంట్లో పనంతా చేసుకుని, పిల్లల్ని స్కూలుకు సిద్ధం చేస్తుంది. ఈ హడావిడిలో తను టిఫిన్ కూడా చేయకుండా లంచ్‌బాక్స్‌ పట్టుకుని ఆఫీసుకు బయలుదేరుతుంది. వర్క్‌ప్లేస్‌ నుంచి తిరిగి వస్తూ, పిల్లల్ని పికప్ చేసుకుని ఇంటికి రాగానే యథావిధిగా బాధ్యతలన్నీ ఆమెకోసమే ఎదురుచూస్తుంటాయి. ప్రియాంకకు ఇంట్లో ఏ ఒక్కరూ సాయం చేయకపోగా, చిన్నతప్పు చేసినా అంతెత్తున లేచే కుటుంబ సభ్యులు. అయితే ప్రస్తుత సమాజంలో ఇది ప్రియాంకకు మాత్రమే ఎదురవుతున్న సమస్య కాదు, ఎంతోమంది వర్కింగ్ ఉమెన్స్ ఎదుర్కొంటున్నదే. నిజానికి పని చేసే మగవాళ్ళు ఇంట్లో పని చేయనప్పుడు, ఆడవాళ్ళే ఎందుకు చేయాలి? ఇక్కడే 'పురుషులు ఆర్థిక వ్యవహారాలు చూసుకోవాలి? గృహావసరాలను ఆడవాళ్లు మాత్రమే చేయాలి' అనే సమాధానం సంప్రదాయవాదుల నుంచి వినిపిస్తోంది. ఇది ఏమాత్రం 'ఫెయిర్ డీల్' కానప్పటికీ, మహిళలే ఎందుకు పని చేయాల్సి వస్తుంది? దీనికి ముగింపు ఉందా? లేదా?

మన సమాజంలో స్త్రీ ఎంత చదువుకున్నా, ఇంటిపనిలో ఎంత రాణిస్తుందనే దాని ఆధారంగానే ఆమె విలువను కొలుస్తారు. ఇంటిని, కుటుంబ సభ్యుల అవసరాలను చూసుకోవడం స్త్రీ అంతర్గత కర్తవ్యంగా పరిగణించడం, ఉద్యోగవ్యాపారాలు చేస్తున్నా గృహిణిగా ఆమె బాధ్యతలు మరవకూడదనే భావన వెరసి ఆమెపై అనవసర పనిభారం మోపుతున్నారు. ఈ ప్రపంచంలో జీతానికి పనిచేస్తున్నా ఉద్యోగుల నుంచి జీతాలిచ్చే యజమాని వరకు అందరికీ వారంతాల్లో విశ్రాంతి దొరుకుతుంది. అంతెందుకు ప్రతీరోజు పనిచేసి వచ్చినా పురుషులందరూ ఇంటికి చేరగానే అలసిపోయామంటూ కూర్చొన్న చోటికే అన్నీ తెప్పించుకుంటారు. కానీ మహిళల విషయంలో మాత్రం ఇది జరగదు. ఓ స్త్రీ పని నుంచి తిరిగి వచ్చినప్పుడు, ఆమెకు విశ్రాంతి తీసుకునే స్వేచ్ఛ ఉండదు, గడప లోపల అడుగుపెట్టగానే ఆమె మళ్లీ గృహిణిగా మరో డ్యూటీ ఎక్కాల్సిందే. అలసిన ఆ దేహం మళ్లీ అందరికీ ఆహారం సిద్ధం చేసి, వడ్డించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న ఇతర ఇంటి పనులు చేయాలి. ఇక వీకెండ్స్‌లో, పండుగ సమయాల్లో ఆమె పడే కష్టం అంతా ఇంతా కాదు. ఇంత బిజీ షెడ్యూల్‌లో స్త్రీలకు విశ్రాంతి తీసుకునేందుకు, తమను తాము చూసుకోవడానికి సమయం ఎక్కడిది? కనీసం వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునేందుకైనా వారికి వీలు చిక్కుతుందా? కాబట్టి మన సమాజంలో వర్కింగ్ ఉమెన్స్‌కు ఆఫీసు పని, ఇంటిపనుల కంటే రెట్టింపు భారం పడుతున్నదనేది నిర్వివాదాంశం.

శ్రమకు విలువేది

ఇక్కడ సమస్యను మరింత దిగజార్చేది ఏమిటంటే, స్త్రీ సంపాదనకు విలువ ఇవ్వకపోవడం లేదా ఆమె చేసే ఇంటిపనులకు డబ్బు చెల్లించకపోవడం. ఒక ఇంటికి పురుషుడి సంపాదన ఎంత ముఖ్యమో, ఒక ఇల్లాలి జీతం కూడా ప్రధానమైందే. ఈ కాలంలో ఏ ఒక్కరి సంపాదనతో కుటుంబ ఆర్థిక అవసరాలను నిర్వహించడం అంతా తేలిక కాదన్నది జగమెరిగిన సత్యం. ఇక్కడ ఆమెకు సరైన విలువ దక్కకపోగా, ఉద్యోగం చేయడాన్ని తప్పు పట్టడం మరింత దారుణం. ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యత ఆమెపై ఉండగా, అదనపు శ్రమను తీసుకోవడం ఆమె తప్పేనంటూ నాలుగు వేళ్లు, నలభై నోళ్లు ఆమెనే చూపిస్తాయి. కాబట్టి పనిచేసే మహిళలు.. మల్టీ టాస్క్ చేసి అలసిపోయినా ఎవరూ పట్టించుకోరు.

కానీ వీళ్లు కూడా తాము చేస్తున్న పని వల్ల గౌరవాన్ని పొందలేనప్పుడు ఎంతకాలమని కొనసాగిస్తారు? తమ ఆత్మగౌరవాన్ని పణంగాపెడుతూ ఎన్నాళ్లు నెట్టుకొస్తారు?శ్రమకు తగ్గ ప్రతిఫలితం దక్కనప్పుడు ఎలా ముందుకు వెళతారు? దాని ఫలితంగానే చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ వివాహం తర్వాత తమ ఉద్యోగాన్ని వదిలివేస్తున్నారు. ఈ మేరకు వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం, వారి శ్రామిక శక్తి భాగస్వామ్యం 1990లో 30.27 ఉండగా, 2019లో 20.8కి తగ్గింది. భారతదేశంలో కేవలం 32 శాతం మంది వివాహిత మహిళలు మాత్రమే NFHS-5 ప్రకారం పనిచేస్తున్నారు. నిజానికి పనిని జెండర్ డ్యూటీగా కాకుండా సమానత్వంగా చూస్తే ఈ సమస్య సులభంగా పరిష్కారమవుతుంది.

'రెండు బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళలకు ఊపిరి పీల్చుకునే సమయం ఇవ్వాల్సింది ఆ కుటుంబ సభ్యులే. ఇంటిబాధ్యతలతో పాటు, అన్ని పనుల్లోనూ పురుషులను, పిల్లల్ని, పెద్దల్ని కూడా భాగస్వామ్యం చేయాలి. వర్కింగ్ ఉమెన్స్ ఇంటికి వచ్చాక పనులు చేయకపోతే, అపరాధ భావాన్ని కలిగించడం మానేద్దాం. వారిని నిరంతంర ఓ మెషీన్‌లా మల్టీ టాస్కింగ్ కోసం పీఠమెక్కించడం కూడా మానేద్దాం. పిల్లల పెంపకం, కుటుంబంలోని వృద్ధ సభ్యుల ఆరోగ్యం కేవలం స్త్రీకి సంబంధించినవి ఏమాత్రం కావని అర్థం చేసుకుందాం. కాబట్టి ఇందులో ఇద్దరూ సమానంగా పాల్గొనాలి. మహిళలు తమ ఉద్యోగాన్ని వదిలేయమని చెప్పడం కంటే ఇంట్లో ఆమె చేసే జీతం లేని శ్రమకు విలువ ఇవ్వండి, మద్దతు ఇవ్వండి. అవసరమైతే వాటికి డబ్బులు చెల్లించండి. ఒకవేళ పనికి వెలకట్టడం సాధ్యం కాకపోయినా కనీసం ఒంటెద్దులా కష్టపడుతున్న స్త్రీలను గౌరవించండి. ఇంట్లో పురుషుల కంటే రెట్టింపు కష్టపడి పనిచేస్తున్న వారి పనికి గుర్తింపునివ్వండి. ఆమెను కాస్త సంతోషపెట్టడంతో పాటు, ఆరోగ్యాన్ని పట్టించుకోవాలి.

- గాయత్రి వర్మ, సామాజికవేత్త

అయస్కాంతాల నుంచి ఆక్సిజన్.. అంతరిక్ష అన్వేషణలో కీలక అడుగు 


Similar News