Self motivation : స్వీయ ప్రేరణే సక్సెస్ మార్గం.. ఆచరణలో పెడితే అద్భుతాలే..!

ఎవరైనా ఒక వ్యక్తి.. ఏదైనా ఒక విషయంలో విజయం సాధించడం వెనుక అనేక కారణాలు, ప్రేరణలు ఉంటాయి. చదివిన చదువు, చేస్తున్న పని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం, స్నేహితుల సహాయం, సామాజిక సంబంధాలు, ఆర్థిక వనరులు ఇవన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనకు సహాయపడుతుంటాయని పెద్దలు చెప్తుంటారు.

Update: 2024-09-14 13:51 GMT

దిశ, ఫీచర్స్: ఎవరైనా ఒక వ్యక్తి.. ఏదైనా ఒక విషయంలో విజయం సాధించడం వెనుక అనేక కారణాలు, ప్రేరణలు ఉంటాయి. చదివిన చదువు, చేస్తున్న పని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం, స్నేహితుల సహాయం, సామాజిక సంబంధాలు, ఆర్థిక వనరులు ఇవన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనకు సహాయపడుతుంటాయని పెద్దలు చెప్తుంటారు. ఇదంతా తెలిసిన విషయమే. అయితే స్వీయ ప్రేరణ కూడా మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తుందని నిపుణులు అంటున్నారు. నిరాశలో మీరు కూరుకుపోయినప్పుడు ఆశల తీరానికి చేర్చే నావ లాంటిదే ఈ ‘సెల్ఫ్ మోటివేషన్’. అపజయాలు కలిగిన చోటే విజయానికి శ్రీకారం చుట్టడంతో.. మీకు మీరే ప్రేరణ పొందడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

మీకు మీరే ధైర్యం..

నిజానికి మనుషులు అనేక విషయాల్లో పరస్పర ఆధారిత జీవులు. కాబట్టి  సొంత నిర్ణయాలు అంత ఎఫెక్టివ్‌గా ఉండవని కూడా అనిపించవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం అవే పనిచేస్తాయి. అలాంటిదే సెల్ఫ్ మోటివేషన్ అంటున్నారు నిపుణులు. జీవితంలోని అనేక సమస్యల నుంచి, నిరాశా నిస్పృహల నుంచి, బాధలు, భావోద్వేగాల నుంచి రియలైజ్ అవడానికి అన్నింటికంటే ఉత్తమమైన మార్గం ఏదైనా ఉందంటే అదే స్వీయ ప్రేరణ. మిమ్మల్ని పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దడంతోపాటు విజయం వైపు నడిపిస్తుంది. అందుకే సమస్యల సుడిగుండాలు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు మీకు మీరే ప్రేరణగా నిలువాలి. మీకు మీరే ధైర్యం చెప్పుకోవాలి. కష్టాల నుంచి బయటపడే మార్గమేంటని ఇతరులను అడగవచ్చు. నలుగురి అభిప్రాయాలను కూడా తీసుకోవచ్చు. కానీ చివరిగా మీకు మీరే సెల్ఫ్ మోటివేషన్ చేసుకోకపోతే ఇవన్నీ పనిచేయవు. కాబట్టి వాస్తవాలను విశ్లేషిస్తూ మిమ్మల్ని మీరు మార్చుకోండి. లక్ష్యం సాధించే దిశగా మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకోండి’’ అంటున్నారు నిపుణులు.

వైఫల్యాలకు భయపడకండి

జీవితంలో విజయం మాత్రమే శాశ్వతం కాదు. నిజానికి అది వైఫల్యాల పునాదుల మీద నిర్మించుకుంటేనే మంచి ఫలితాన్ని ఇస్తుంది. లేకుంటే మధ్యంతరంగానే కుప్పకూలి పోతుంది. కాబట్టి చదువులో, ఉద్యోగంలో, జీవితంలో ఏవైనా సమస్యలు మిమ్మల్ని వెంటాడుతుంటే నిరాశ చెందకండి. ఎందుకంటే ఆ నిరాశే మిమ్మల్ని మరిన్ని సమస్యల్లోకి నెట్టేస్తుంది. అలాగే ఓటమి గురించి భయపడుతూ కూర్చోకండి. వాటికి గల కారణాలను విశ్లేషించుకోండి. జీవితంలో మీకు వచ్చిన మంచి అవకాశంగా భావించండి. వాస్తవానికి ఆల్రెడీ సక్సెస్‌ అనుభవిస్తున్నవారికంటే ఓటమి బాధను అనుభవిస్తున్నవారికే చాలా విషయాలు తెలుస్తాయంటారు. మరోసారి ఓడిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్ణయాల వీరు తీసుకునే నిర్ణయాలు సరైనవిగా ఉండే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే అప్పటికే వారు గుణపాఠం నేర్చుకొని ఉంటారని, ఓటమి అన్నీ నేర్పిస్తుందని నిపుణులు అంటున్నారు. అందుకే ఏ సందర్భంలో కూడా నిరాశను, తాత్కాలిక ఒడిదుడుకులను వైఫల్యంగా భావించి, రోదిస్తూ కూర్చోవద్దు. వాటిని సక్సెస్ సాధించడానికి గుణపాఠాలుగా స్వీకరిస్తే అదే సెల్ఫ్ మోటివేషన్‌కు నిలువెత్తు నిదర్శనం.

ఆలోచనల్లో స్పష్టత

మీ ఆలోచనలు ఏవైనా కావచ్చు. వాటిలో స్పష్టత చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. బయటి వ్యక్తులు తరచుగా నీతులు చెప్పినంత మాత్రాన మీలో మార్పు రాదు. ముందు మీలో కూడా ఆ చిత్తశుద్ధి ఉండాలి. అందుకు అనుగుణంగా మీ ఆలోచనలు మార్చుకోవాలి. అందుకోసం ఏ మానసిక నిపుణులో అవసరం లేదు. మీకు మీరే సెల్ప్ మోటివేట్ చేసుకోవచ్చు. అసలు మీరేం అనుకుంటున్నారు? మీ లక్ష్యం ఏమిటి? మీకు ఇబ్బందికరమైన విషయాలేమిటి? ఏ విషయాల్లో మారాలనుకుంటున్నారు? ఇలా మిమ్మల్ని ప్రశ్నించుకోండి. అప్పుడు వాటిని ఓ కాగితంపై రాయండి. సమాధానం కూడా మీ బుర్రలోనే ఉంటుంది. కాస్త ఆలోచించి దానిని కూడా రాయండి. సరైన మార్గంలో ఎలా వెళ్లాలో అప్పుడు మీకే అర్థమవుతుంది. ఇదే స్వీయ ప్రేరణ. అప్పటిదాకా ఉన్న ప్రతికూల ఆలోచనలను పోగొట్టి మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.

ఆచరణకు అదే ప్రేరణ 

ఏదైనా అనుకోవడం, చెప్పడం, ఉచిత సలహాలు ఇవ్వడం ఎవరైనా చేయగలుగుతారు. కానీ ఆచరణకు వచ్చే సరికే చాలా మంది వెనుకడుగు వేస్తారు. సమాజం నుంచి, మానసిక నిపుణుల నుంచి, పుస్తకాలు చదవడం ద్వారా మీరు అనేక విషయాలు నేర్చుకుంటారు. కానీ అవసరమైన వాటిని ఆచరణలో పెట్టకపోతే మాత్రం లాభం లేదంటున్నారు నిపుణులు. అందుకే వెనుకబడిపోతారు. అలా జరగకూడదంటే మిమ్మల్ని ముందుకు నడిపించే గొప్ప మార్గం ఒకటుంది. అదే స్వీయ ప్రేరణ. మీరు సాధించాల్సిన విజయం కోసం కష్టపడేలా మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. లక్ష్యం కోసం కష్టపడేలా ప్రేరేపిస్తుంది. ఇతరులను చూసి అసూయ చెందడం, ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకుంటూ నిరాశ చెందడం వంటి భావాల నుంచి, అనుకోని ఆపదల నుంచి, జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాల నుంచి బయటపడేలా చేస్తుంది స్వీయ ప్రేరణ. అనుకున్న లక్ష్యంవైపు, విజయంవైపు నడిపించడంలో దానికి మించిన అద్భుతమైన మార్గం మరొకటి లేదంటున్నారు నిపుణులు. ప్రతికూల ఆలోచనల నుంచి, పరిస్థితుల నుంచి మిమ్మల్ని గట్టెక్కించడంలో సెల్ఫ్ మోటివేషనే ది బెస్ట్ మోటివేషన్ అనేది మర్చిపోకండి!


Similar News