Self-improvement : నిత్య జీవితంలో స్వీయ అభివృద్ధి వ్యూహాలు.. వీటిని అలవర్చుకుంటే సక్సెస్ మీ సొంతం!

Update: 2024-08-23 13:13 GMT

దిశ, ఫీచర్స్ : అనుకున్నది సాధించలేక నిరాశకు గురవుతున్నారా?, కెరీర్‌లో ఏ అంశానికి ప్రయారిటీ ఇవ్వాలనే సందేహాలు వెంటాడుతున్నాయా?, మీరున్న రంగంలో ఎలా ఎదగాలన్న విషయాల్లో ఆందోళన చెందుతున్నారా? ఇలాంటి వాటికి చక్కటి పరిష్కార మార్గాల్లో ‘స్వీయ అభివృద్ధి వ్యూహాలు’ (Self-improvement strategies) కూడా ఉన్నాయంటున్నారు మానసిక నిపుణులు. అవేమిటి? ఎలా ప్రభావితం చేస్తాయి? ఎలా అలవర్చుకోవాలి? తదితర విషయాలు తెలుసుకుందాం.

నిత్య జీవితంలో అనేక అంశాలు మనల్ని ప్రభావితం చేస్తుంటాయి. మానసిక, శారీరక ఆరోగ్యాలు కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎఫెక్ట్ చూపుతుంటాయి. వ్యక్తిగత, సామాజిక, వృత్తి జీవితాల్లో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్‌కు కారణం అవుతుంటాయి. అలాంటప్పుడు కొన్ని సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ స్ట్రాటజీస్‌తో మనల్ని మనం తీర్చి దిద్దుకోవచ్చునని నిపుణులు చెప్తున్నారు. ప్రధానంగా మానసిక ఆరోగ్యం, శారీరక దృఢత్వం, నాణ్యమైన నిద్ర, ఒత్తిడిని ఎదుర్కొనే పద్ధలు, సానుకూల సంబంధాలు మన స్వయం ఎదుగుదలకు దోహదపడతాని పేర్కొంటున్నారు ఎక్స్‌పర్ట్స్.

మానసిక, శారీరక ఆరోగ్యం

మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ మన స్వీయ ఎదుగుదలలో కీలకపాత్ర పోషిస్తుంది. ఒక వ్యక్తి సక్సెస్ సాధించాలంటే బాడీ అండ్ మైండ్‌కి మధ్య సమన్వయం కూడా ముఖ్యమేనని పలు అధ్యయనాలు కూడా పేర్కొన్నాయి. అంటే ఇక్కడ ప్రతికూల ఆలోచనలు కలిగిన జీవన శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం చేయగలిగే చిన్న చిన్న మార్పులు కూడా కొన్నిసార్లు మానసిక, శారీరక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపడం ద్వారా మేలు చేస్తాయి. స్వయం అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఉదాహరణకు జంక్ ఫుడ్, మద్యపానం, ధూమపానం వంటివి మానేయడం వంటివి కూడా ఇందులో భాగమే.

సరైన స్లీప్ షెడ్యూల్

ఉరుకుల పరుగుల జీవితంలో కొన్నిసార్లు హెల్తీ స్లీప్ షెడ్యూల్ మెయింటైన్ చేయడం కూడా ఈ రోజుల్లో కష్టం అవుతోందని కొందరు చెప్తుంటారు. కానీ స్లీప్‌లెస్ రొటీన్స్ తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయి. మెంటల్ అండ్ ఫిజికల్‌ హెల్త్‌పై ప్రభావం చూపుతాయి. ఏకాగ్రత కోల్పోవడం, జ్ఞాపక శక్తి తగ్గడం, చేస్తున్న పనిలో నాణ్యత లోపించడం, యాక్టివ్‌నెస్ తగ్గడం వంటివి జరుగుతాయి. క్రమంగా మెంటల్ డిజార్డర్‌కు దారితీయవచ్చు. కాబట్టి సరైన స్లీప్ షెడ్యూల్‌ను పాటించాలంటున్నారు నిపుణులు. మీ స్వీయ అభివృద్ధి వ్యూహాల్లో భాగంగా క్వాలిటీ స్లీప్ చేర్చుకోవడం ద్వారా చాలా విషయాల్లో సానుకూల మార్పులు సాధ్యం అవుతాయి.

ఒత్తిడిని జయించండి

చాలా మంది మానసిక ఒత్తిడి నుంచి బయట పడటానికి లేదా రిలాక్స్ అవడానికి నిద్ర మాత్రమే ఏకైక మార్గం అనుకుంటారు. కానీ దాంతోపాటు రోజువారీ ప్రణాళికలో చేర్చుకోదగ్గ అనేక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా యోగా, మెడిటేషన్, ఒంటరిగా గడపడం, నిశ్శబ్ద వాతావరణంలో కూర్చొని ప్లాన్ చేసుకోవడం, డీప్ బ్రీతింగ్స్, వంటివి మీలోని మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి. యాక్టివ్‌నెస్ పెంచుతాయి. సంతోషానికి, మైండ్ ఫుల్ నెస్‌కు కారణం అవుతాయి. కాబట్టి వీటిని బెస్ట్ సెల్ఫ్ ఇంప్రూవ్ మెంట్ స్ట్రాటజీగా నిపుణులు పేర్కొంటున్నారు. రోజుకూ 5 నుంచి 20 నిమిషాల డీప్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేయడం మానసిక ఆనందానికి, స్వీయ అభివృద్ధికి దోహదం చేస్తుంది.

గుడ్ కనెక్షన్స్ - సెల్ఫ్ కేర్

ఇతరులతో సత్సంబంధాలు కూడా స్వీయ అభివృద్ధికి దోహదం చేస్తాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా చుట్టు పక్కల వ్యక్తలతో చర్చించడం మీలో స్థిరత్వానికి, మానసిక దృఢత్వానికి దోహదం చేస్తాయి. పరస్పర సహకారం, ఆలోచనలు షేర్ చేసుకోవడం ఒత్తిడి భావాల నుంచి మిమ్మల్ని బయట పడేస్తాయి. దీంతోపాటు మీకు ఇష్టమైన పనులు, వ్యాయామాలు, రోజువారీ కార్యకలాపాలు కూడా స్వీయ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. అలాగే స్వీయ సంరక్షణ, స్వయం ఎదుగుదల అంశాలపై కేంద్రీకరించడం, టాక్సిక్ రిలేషన్స్‌కు దూరంగా ఉండటం వంటివి సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ స్ట్రాటజీస్‌గా ఉపయోగపడతాయి. మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తాయి. 

Tags:    

Similar News