Self-Acceptance : 2025లో మీ లక్ష్యం నెరవేరాలా..? మిమ్మల్ని మీరు అంగీకరించండి!
Self-Acceptance : 2025లో మీ లక్ష్యం నెరవేరాలా..? మిమ్మల్ని మీరు అంగీకరించండి!
దిశ, ఫీచర్స్ : మీకు తెలుసా..? ప్రతీ సక్సెస్‌ఫుల్ వ్యక్తి సహజంగానే సెల్ప్ యాక్సెప్టెన్స్ బిహేవియర్‌ను కలిగి ఉంటాడని నిపుణులు చెబతుంటారు. అదే వారిలో పాజిటివ్ ఆలోచనలకు, ఆచరణకు కారణం అవుతంది. ఎందుకంటే స్వీయ అంగీకార గుణం కలిగి ఉన్నప్పుడు మనం తొందరపాటు ప్రదర్శించం. మన తప్పొప్పులకు ఇతరులను నిందించం. మనం చేసిన పొరపాట్లను మనం అంగీకరిస్తాం. అవసరమైన విషయాల్లో ఆత్మపరిశీలన చేసుకుంటాం. ఇటువంటి ప్రవర్తనే వ్యక్తులను విజయ తీరాలకు నడిపిస్తుందని పర్సనల్ స్కిల్స్ అండ్ మోటివేషనల్ ట్రైనింగ్ నిపుణులు అంటున్నారు. 2025లో మీరు సక్సెస్ సాధించాలంటే దీనిని అలవర్చుకోవాలని చెబుతున్నారు.
మిమ్మల్ని మీరు అంగీకరించండి
వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదగాలంటే.. ఏ రంగంలోనైనా సక్సెస్ సాధించాలంటే సెల్ఫ్ యాక్సెప్టింగ్ తప్పనిసరి. మిమ్మల్ని ఇతరులు యాక్సెప్ట్ చేయగలగాలంటే ముందు మిమ్మల్ని మీరు అంగీకరించడం నేర్చుకోవాలి అంటున్నారు నిపుణులు. అదే ఆరోగ్యకరమైన జీవితానికి అసలైన పునాది. అందుకోసం ఆత్మపరిశీలన లేదా లోపాలను అంగీకరించడం చాలా ముఖ్యం. అయితే ఇది అందరికీ అంత తేలికగా రాకపోవచ్చు. ఇదే కొన్నిసార్లు ఇతరులు మీతో సంబంధాన్ని కోల్పోయేలా చేస్తాయి. అందుకే మీ చుట్టూ ఉన్న వాతావరణం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుందో, ఎలా మారుస్తుందో అంచనా వేయగలగాలి. అలాంటి స్పృహతో ఉన్నప్పుడు మాత్రమే మీరు వాస్తవాలు తెలుసుకుంటారు. ఆత్మ పరిశీలనకు, స్వయం అంగీకారానికి మీ మనసు మొగ్గు చూపుతుంది. దాదాపు 95% మంది తమలో తాము ఇష్టపడేవి, అలాగే తాము ఇష్టపడని లక్షణాలను గుర్తించడానికి కూడా ఇబ్బంది పడుతుంటారని మానసిక నిపుణులు చెప్తుంటారు. కారణం ఆత్మ పరిశీలన లేదా లోపాలు అంగీకరించే గుణం లేకపోవడమే.
ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి..
సెల్ఫ్ యాక్సెప్టింగ్ అనేది మిమ్మల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితివైపు నడిపించే వంతెన లాంటిది. మిమ్మల్ని మీరు తెలుసుకోకుండా, మీ లోపాలను అంగీకరించకుండా సరిద్దుకోవడం అస్సలు సాధ్యం కాదు. కాబట్టి చదువులో, వృత్తిలో, పనిలోనూ సక్సెస్ అవ్వకుండా మిమ్మల్ని నిరోధించేది ఏమిటి? మీరు దేనికి భయపడుతున్నారు?. ఇదంతా ఒకసారి అబ్జర్వ్ చేయాలి. అప్పుడు మీలో అనేక లోపాలు కనిపించవచ్చు. చేయాల్సిందల్లా వాటిని అంగీకరించి, సరిదిద్దుకొని, వాస్తవాల ఆధారంగా ఆత్మ పరిశీలన చేసుకొని అడుగు ముందుకు వేయడమే. 2024లో మీరు ఇలా చేయడంలో విఫలం అయి ఉండవచ్చు. కానీ 2025లో మాత్రం అందుకు భిన్నంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. మిమ్మల్ని ఇతరులు అంగీకరించాలంటే, మీరు సక్సెస్ సాధించాలంటే.. ముందుగా మిమ్మల్ని మీరు అంగీకరించడం నేర్చుకోవాలి.