ఆస్తమా అవస్థలు.. ఊపిరితిత్తులు, శ్వాసనాళాల్లో సమస్యలకు కారణాలను కనుగొన్న శాస్త్రవేత్తలు
ఆస్తమా.. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది కలిగించే శ్వాసకోశ వ్యాధి ఇది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 25 కోట్లమందికి పైగా ప్రజలు దీనివల్ల అవస్థలు పడుతున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్టు పేర్కొంటున్నది.
దిశ, ఫీచర్స్ : ఆస్తమా.. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది కలిగించే శ్వాసకోశ వ్యాధి ఇది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 25 కోట్లమందికి పైగా ప్రజలు దీనివల్ల అవస్థలు పడుతున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్టు పేర్కొంటున్నది. అయితే ఇప్పుడున్న మందులు లేదా ఇన్ హేలర్స్ పేషెంట్లకు ఉపశమనం కలిగించడంలో కాస్త మేలు చేస్తున్నప్పటికీ, ఎక్కువ మందిలో శ్వాసనాళాలు కుంచించుకుపోతున్నాయి. ఇలాంటి పరిస్థితికి పర్మినెంట్ సొల్యూషన్ కనుగొనేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు.
ఆస్తమా బాధితుల్లో లంగ్స్, అలాగే శ్వాస నాళాల్లో సమస్య ఎందుకు ఏర్పడుతుందో తెలుసుకునేందుకు కింగ్స్ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 54 వేలమందికి సంబంధించిన హెల్త్ డేటాను ఎనలైజ్ చేశారు. అలాగే ఎలుకలు, మానవ ఊపిరితిత్తులలోని కణాజాలాల నమూనాలను సేకరించి ల్యాబ్‌లో పరిశోధనలు జరిపారు. ఈ సందర్భంగా వారు ఆస్తమా బాధితుల్లోని శ్వాసనాళాల చుట్టూ ఉన్న సెన్సిటివ్ మస్కల్స్ బిగుసుకుపోతాయని గుర్తించారు. దీనిని శ్వాసకోశ సంకోచం (బ్రాన్ కోకన్ స్ట్రిక్షన్)గా పిలుస్తారు.
శ్వాసనాళాలు బిగుసుకుపోవడంవల్లే ఆస్తమా పేషెంట్లు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతారని, చివరికి నడిచినా, ఏదైనా పనిచేసినా వారిని ఆయాసం వెంటాడుతుందని పరిశోధకులు వెల్లడించారు. అంతేకాకుండా మానవ శరీరంలో వివిధ ఇన్ఫెక్షన్లు తలెత్తినప్పుడు వాటికి వ్యతిరేకంగా పోరాడేందుకు రక్షణ కవచాలుగా పనిచేస్తున్న ఎపిథీలియల్ కణాలు ఆస్తమా కారణంగా దెబ్బతింటాయని, అందువల్ల బాధితులు అవస్థలు పడాల్సి వస్తుందని పరిశోధకులు అంటున్నారు. అయితే ఈ కణాలను డ్యామేజ్ కాకుండా ఆపగలిగితే ఆస్తమా ప్రభావాన్ని శాశ్వతంగా తగ్గించవచ్చని చెప్తున్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరమని పేర్కొన్నారు.