చంద్రుడిపై భారీ అగాధాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏలియన్స్ ఉన్నారా?

Update: 2024-07-16 06:37 GMT

దిశ,ఫీచర్స్: విశ్వ రహస్యాలను ఛేదించే క్రమంలో శాస్త్రవేత్తలు నిరంతర పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు. అలాగే అమెరికన్ నేషనల్ ఏరోనాటిక్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) కూడా అంతరిక్ష పరిశోధనలపై మరింత ఫోకస్ చేసింది. ఇప్పటికే చంద్రుడిపై అనేక రహస్యాలను పరిశోధకులు గుర్తించినప్పటికీ తెలియనివి ఇంకెన్నో ఉన్నాయని కూడా పేర్కొంటున్నారు. వాస్తవానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి భూమి నుంచి చంద్రుడిని చేరాలంటే శాస్త్రవేత్తలకు మూడు రోజుల సమయం పడుతుంది. అయితే ఇక్కడ జీవజాలం మనుగడ, భవిష్యత్తులో మానవ నివాసాలకు అనుకూలమైన వాతావరణం కోసం శాస్త్రవేత్తలు నిరంతర అన్వేషణ కొనసాగిస్తున్నారు.

నివాసయోగ్యమేనా?

ఇప్పటి వరకు చేసిన పరిశోధనల ప్రకారం.. చంద్రుడిపై రేడియేషన్ ఎక్కువ ఉంటుందని కనుగొన్న సైంటిస్టులు ఒకవేళ నీటి జాడను కనుగొన్నప్పటికీ.. నివాసం అనేది సాధ్యం కాదని భావిస్తూ వచ్చారు. ఇక చంద్రుడిపైకి వెళ్లిన అంతరిక్ష పరిశోధకులు కొంతకాలం అక్కడ నివసించాలన్నా భారీ సొరంగాలు తవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక నుంచి అలాంటి అవసరం ఉండకపోవచ్చునేమో అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నాసా సైంటిస్టులు. ఎందుకంటే ప్రస్తుతం చండ్రుడిపై ఓ భారీ అగాధాన్ని వారు కనుగొన్నారు. దీనిని కొందరు గుహ అని, మరి కొందరు గొయ్యి అని కూడా పిలుస్తున్నారు.

మరో 30 ఏండ్ల తర్వాత!

అయితే చంద్రుడిపై భారీ అగాధాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు అది అత్యంత లోతుగా ఉన్నట్లు చెప్తున్నారు. పైగా వచ్చే 20 నుంచి 30 ఏండ్లలో మనుషులు జీవించే అవకాశాలు కూడా సాధ్యం కావచ్చని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే వ్యోమగాములను పంపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు నాసా పరిశోధకులు పేర్కొంటున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా కనుగొన్న అగాధం ఏర్పడటానికి గల కారణాలపై కూడా లోతైన పరిశోధనలు జరుగుతున్నాయి. 1969లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఆల్డ్రిన్, చంద్రుడిపై సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అనే ప్రదేశంలో దిగారు. ప్రస్తుతం నాసా గుర్తించిన అగాధం కూడా ఈ ప్రదేశానికి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఓ లావాతో కూడి భారీ సొరంగం ఉండి ఉంటుందని, అది కూలిపోవడంవల్ల ఈ అగాధం ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

ఏలియన్స్ ఉన్నారా?

ఇప్పటికే ఏలియన్స్ పట్ల ప్రజల్లో ఉన్న క్యూరియాసిటీ కారణంగా.. చంద్రుడిపై నాసా సైంటిస్టులు భారీ గొయ్యిని గుర్తించిన నేపథ్యంలో పలు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అక్కడ గొయ్యి ఏర్పడటానికి లావా‌తో కూడిన  సొరంగాలు కారణమని సైంటిస్టులు  భావిస్తుండగా.. కొందరు నెటిజన్స్ మాత్రం ఏలియన్స్ ఉండి ఉండవచ్చని, అవి తమ నివాసాలకోసం చంద్రుడిపై గొయ్యి తవ్వి ఉండవచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏలియన్స్ విషయంలో కచ్చితమైన ఆధారాలు అయితే  లేవు కానీ, చంద్రుడిపై అగాధాన్ని గుర్తించింది మాత్రం నిజమని నిపుణులు పేర్కొంటున్నారు.


Similar News