women Safety : ఒంటరిగా క్యాబ్‌లో జర్నీ చేస్తున్నారా?.. ఈ ఉమన్ సేఫ్టీ టిప్స్ మీ కోసమే!

ప్రస్తుతం ఎక్కడికి వెళ్లాలన్నా ఒకప్పటితో పోలిస్తే జర్నీ చాలా ఈజీ అయిపోయింది. చేతిలో ఫోన్ ఉంటే చాలు ఏ క్యాబో, బైకో బుక్ చేసుకొని నచ్చిన చోటుకు వెళ్లవచ్చు.

Update: 2024-08-21 12:17 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ఎక్కడికి వెళ్లాలన్నా ఒకప్పటితో పోలిస్తే జర్నీ చాలా ఈజీ అయిపోయింది. చేతిలో ఫోన్ ఉంటే చాలు ఏ క్యాబో, బైకో బుక్ చేసుకొని నచ్చిన చోటుకు వెళ్లవచ్చు. మహిళలు కూడా ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి సేవలను వినియోగించుకుంటున్నారు. ఆఫీసులకు, షాపింగ్‌లకు వెళ్లాల్సి వచ్చినప్పుడు రైడ్ బుక్ చేసుకొని ఒంటరిగా జర్నీ చేస్తున్నారు. అదే సందర్భంలో మహిళల భద్రతపై ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే సేఫ్టీగా ఇంటికి చేరేందుకు ఏం చేయాలనే విషయమై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అవేంటో చూద్దాం.

* క్యాబుల్లో, బైకులపై ఒంటరిగా జర్నీ చేయాల్సి వస్తే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ముందుగా మీరు అలర్ట్‌గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొందరు తమ నివాసం లేదా ఆఫీసు నుంచి బయటకు వచ్చాక రైడ్ బుక్ చేస్తుంటారు. ఏదైనా జరిగితే లొకేషన్ పరంగా ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి బుక్ చేశాక మాత్రమే బయలు దేరడం భద్రతా పరంగా మంచిదని నిపుణులు చెప్తున్నారు.

* కంగారు వద్దు : ఒంటరిగా వెళ్తున్నప్పుడు మీరు ఆందోళనగా కనిపిస్తే భయపడుతున్నారని ఇతరులకు అర్థమైపోతుంది. నేర ప్రవృత్తిగలవారు మిమ్మల్ని భయపెట్టి ఏదైనా చేయవచ్చునని అనుకునే చాన్స్ ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. మీ బాడీ లాంగ్వేజ్‌ మీ పట్ల మీకు విశ్వాసం ఉన్నట్లు కనిపించాలి. మీరు ధైర్యంగా కనిపిస్తేనే క్రిమినల్ మెంటాలిటీ కలిగినవారు మీ జోలికి రావడానికి భయపడతారు.

*వెహికల్ నెంబర్ చెక్ చేసుకోండి : మీరు ఆటోనో, క్యాబో, బైకో బుక్ చేస్తారు. అది రాగానే సదరు వెహికల్ నడిపే వ్యక్తి బుకింగ్ ఆర్డర్ చెప్పగానే.. కనీసం నెంబర్ ప్లేట్ కూడా చెక్ చేసుకోకుండా వెళ్లి కూర్చుంటారు. కానీ ఇలా చేయకూడదు. కొన్నిసార్లు మీరు బుక్ చేసిన వాహనానికి బదులు వేరే వాహనం వచ్చి ఉంటే.. ఇబ్బంది పడతారు. కాబట్టి ఒకటికి రెండుసార్లు నెంబర్ ప్లేట్ చెక్ చేసుకోవడం మంచిది. అవసరమైతే వెహికల్ నెంబర్ మీ మొబైల్‌తో ఫొటో తీసి పెట్టుకోండి.

* డోర్ హ్యాండిల్స్‌ను తనిఖీ చేయండి : క్యాబ్‌లో ఒంటరిగా వెళ్తున్నప్పుడు డోర్ హ్యాండిల్స్ కూడా చెక్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే కొన్నిసార్లు అవి ఎవరైనా లాక్ చేసి ఉంటేనో, సరిగ్గా పనిచేయకుంటేనో రిస్కులో పడవచ్చు.

* ఫ్యామిలీ మెంబర్స్‌కు చెప్పండి : రైడ్ బుక్ చేసుకొని జర్నీలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులకు తెలియజేయండి. మధ్యలో ఉన్నప్పుడు కూడా కాల్ చేసి చెప్పడం, మాట్లాడటం మంచిది. ప్రజెంట్ లొకేషన్, ఇంకా ఎంతసేపటిలో చేరుకుంటారో చెప్పండి. అవసరం అయితే మీ చుట్టు పక్కల వ్యక్తులకు వినిపించేలా గట్టిగా మాట్లాడండి.

* ఫోన్‌లో మాట్లాడుతూ ఉండండి : మీకేదైనా అనుమానం అనిపిస్తే రైడ్ పూర్తయ్యే వరకు ఫోన్‌లో మాట్లాడుతూ ఉండాలనో, లైన్‌లోనే ఉండమనో మీ కుటుంబ సభ్యులకు లేదా ఫ్రెండ్స్‌ను అడగవచ్చు. అలాగే ఎప్పటికప్పుడు లొకేషన్ కూడా షేర్ చేయవచ్చు.

* ఎమర్జెన్సీ నెంబర్స్ : ఒంటరిగా ప్రయాణించే ముందు మీ ఫోన్‌లోని స్పీడ్ డయల్‌లో ఎమర్జెన్సీ సర్వీస్ నెంబర్లను ఉంచండి. జర్నీకి ముందే ఫోన్‌లో తగిన చార్జింగ్ ఉండేలా చూసుకోండి. అలాగే మహిళలు తప్పకుండా ఉమెన్ సేఫ్టీ అండ్ హెల్ప్‌లైన్ నెంబర్లు సేవ్ చేసుకొని పెట్టుకోండి.

* జీపీఎస్ యూజ్ చేయండి : ఎంతకైనా మంచిది, ఒంటరిగా క్యాబ్‌లో వెళ్తు్న్నప్పుడు మీ సొంత GPS ని ఉపయోగించండి. దీంతో మీరు ఏ సమయంలో ఏ ప్లేస్‌లో ఉన్నారో చెక్ చేసుకుంటూ అలర్ట్‌గా ఉండవచ్చు. అట్లనే Google Maps లో మీ వర్క్ ప్లేస్ అండ్ హోమ్ అడ్రస్‌లు కూడా నమోదు చేయండి.

* షార్ట్‌కట్ రూట్లలో వెళ్లకండి : మీరు ఒంటరిగా ఉన్నప్పుడు వెహికల్ డ్రైవర్ త్వరగా వెళ్లొచ్చని షార్ట్‌కట్ రూట్లలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే గనుక వద్దని చెప్పండి. షార్ట్ కట్ పేరుతో నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లే చాన్స్ ఉంటుంది. మెయిన్ రోడ్స్ లేదా ఎప్పుడూ ప్రజలు తిరిగే రూట్లలో మాత్రమే వెళ్లాలని చెప్పండి.

* పెప్పర్ స్ప్రేను దగ్గర ఉంచుకోండి : అత్యవసర పరిస్థితుల్లో సహాయపడే కొన్ని వస్తువులను దగ్గరగా ఉంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మీ హ్యాండ్ బ్యాగ్‌లో పెప్పర్ స్ప్రే, సేఫ్టీ టార్చ్ వంటి ఉంచుకుంటే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడతాయి.

* అలర్ట్‌గా ఉండండి : వాహనంలో మీరు ఒంటరిగా వెళ్తున్నప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో నిమగ్నం అవడమో, నిద్రపోవడమో చేయకండి. బయట రోడ్డుపై ఫోకస్ చేయండి. దీనివల్ల మీరు ఎక్కడున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో తెలుస్తుంది. అత్యవసరం వస్తే మీరున్న ఏరియా పేరు, ప్లేస్, ల్యాండ్ మార్క్ వంటివి చెప్పేందుకు ఇది సహాయపడుతుంది. 

Tags:    

Similar News