Dangerous products: లోషన్లు, సన్ స్క్రీన్లతో పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు.. పరిశోధనలో వెల్లడైన షాకింగ్ నిజాలు !
మీ పిల్లల చర్మ సంరక్షణ కోసమని, బాడీ హైడ్రేట్‌గా ఉండేందుకుని లోషన్లు, సన్స్క్రీన్లు, కండిషనర్లు వాడుతున్నారా? అయితే ఇక నుంచి జాగ్రత్త. ఎందుకంటే అవి వారిలో హార్మోన్ల సమస్యలకు, ఇతర అనారోగ్యాలకు దారితీసే అవకాశం ఉందని ఒక కొత్త అధ్యయనంలో వెల్లడైంది.
దిశ, ఫీచర్స్ : మీ పిల్లల చర్మ సంరక్షణ కోసమని, బాడీ హైడ్రేట్‌గా ఉండేందుకుని లోషన్లు, సన్స్క్రీన్లు, కండిషనర్లు వాడుతున్నారా? అయితే ఇక నుంచి జాగ్రత్త. ఎందుకంటే అవి వారిలో హార్మోన్ల సమస్యలకు, ఇతర అనారోగ్యాలకు దారితీసే అవకాశం ఉందని ఒక కొత్త అధ్యయనంలో వెల్లడైంది. పీర్ రివ్యూడ్ ఎన్విరాన్ మెంటల్ హెల్త్ పెర్స్‌పెక్టివ్స్ జర్నల్‌లో పబ్లిషైన వివరాల ప్రకారం.. వీటిలో ఎండోక్రైన్ వ్యవస్థ మొత్తానికి అంతరాయం లేదా హాని కలిగించే ‘థాలేట్స్’ అని పిలువబడే రసాయనాలు ఉంటాయని, ఇవి పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయని పరిశోధకులు అంటున్నారు.
యూరిన్‌లో విష పదార్థాలు
అధ్యయనంలో భాగంగా యూఎస్‌లోని జార్జ్ మాసన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 2017 నుంచి 2019 వరకు 4 నుంచి 8 సంవత్సరాల మధ్య వయస్సుగల అనేక మంది పిల్లల యూరిన్ నమూనాలను సేకరించి పరీక్షించారు. ఈ సందర్భంగా వారు పలువురి యూరిన్ శాంపిల్స్‌లో మోనో- బెంజైల్ థాలేట్, మోనో ఇథైల్ థాటేట్, మోనోబ్యూటిల్ థాలేట్ లెవల్స్ అధికంగా ఉన్నట్లు కనుగొన్నారు. కాగా లోషన్లు, షాంపూలు, కండిషనర్లు, సన్ స్క్రీన్లు వంటి చర్మ సంరక్షణ ఉత్పత్తులను వాడిన పిల్లల్లోనే ఈ సమస్య ఉందని కూడా గుర్తించారు. ఈ రసాయనాలు సాధారణంగానే స్త్రీలలో హార్మోన్ల మార్పులకు కారణం అవుతాయని కూడా ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రభావం
ప్రస్తుతం పిల్లలకు వాడే చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఉండే ఆయా రసాయనాలు వివిధ రూపాల్లో వాటిని వాడుతున్న వారిలో ఇప్పటికే పలు సమస్యలను కలిగిస్తున్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. ముఖ్యంగా షాంపూ, కండిషన్లు, లోషన్లు వాడే స్త్రీలలో హర్మోన్ల మార్పులకు కారణం అవుతున్నాయి. వీరిలో నడుము చుట్టు కొలతలను, ఇన్సులిన్ నిరోధకతను పెంచుతున్నాయి. ఇక స్త్రీ, పురుషులిద్దరిలోనూ రీ ప్రొడక్టివ్ హెల్త్‌ను ప్రభావితం చేస్తున్నాయి. అంతేకాకుండా ఇవి తామర, రినైటిస్ (rhinitis) వంటి చర్మ, శ్వాసకోశ సమస్యల పెరుగుదలకు దారితీస్తాయని పరిశోధకులు అంటున్నారు.
శ్వాసకోశ సమస్యలకు కారణం
చర్మ సంరక్షణ ఉత్పత్తులు ఎందుకు ప్రమాదకరమంటే.. వాటి తయారీలో ఆకృతిని, మన్నికను మెరుగు పర్చడానికి హానికారక థాలేట్‌లను ఉపయోగిస్తారు. కాబట్టి వాడేక్రమంలో వీటికి గురికావడం అనేది సహజంగానే హార్మోన్ల సమస్యతో ముడిపడి ఉందని పరిశోధకులు చెప్తున్నారు. అలాగే పారాబెన్‌లు (parabens), బలమైన సువాసనలు (strong fragrances) సాధారణంగానే హెయిర్ అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌లో ఉంటున్నాయని, ఇవి ఇవి పిల్లల చర్మంపై దద్దుర్లు, స్కిన్ అలెర్జీలు, అలాగే కొందరిలో శ్వాసకోశ సమస్యలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు.
ప్రత్యామ్నాయమే బెటర్
హానికారక రసాయనాలు, ముఖ్యంగా థాలేట్స్ కలిగిన చర్మ సంరక్షణ ఉత్పత్తులు పిల్లల శారీరక ఎదుగుదల, వారి జీవ క్రియరేటు మెరుగుదల, అలాగే పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. అందుకే ఏవి ఎంపిక చేసుకోవాలనే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రసాయనిక ఉత్పత్తులకు బదులు మినరల్ ఆధారిత సన్‌స్క్రీన్లు, లోషన్లు కొబ్బరి లేదా షియా బటర్ (shea butter) వంటి సహజమైన నూనెలతో తయారు చేసిన చర్మ సంరక్షణ ఉత్పత్తులను, లోషన్లను పిల్లలకు వాడటం మంచిదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సంబంధిత అధ్యయన వివరాల నుంచి సేకరించబడింది. అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు.