Relationship Tips : ప్రేమొక్కటే కాదు.. రిలేషన్‌షిప్‌లో అవి కూడా ముఖ్యమే!

సంబంధాలు సాఫీగా కొనసాగాలంటే ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటే చాలు అనుకుంటారు కొందరు. కానీ ఇది మాత్రమే సరిపోదని నిపుణులు చెప్తున్నారు. సంతోషంగా ఉండాలంటే జీవితంలో ఇంకెన్నో అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని పేర్కొంటున్నారు.

Update: 2024-09-14 07:33 GMT

దిశ, ఫీచర్స్: సంబంధాలు సాఫీగా కొనసాగాలంటే ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటే చాలు అనుకుంటారు కొందరు. కానీ ఇది మాత్రమే సరిపోదని నిపుణులు చెప్తున్నారు. సంతోషంగా ఉండాలంటే జీవితంలో ఇంకెన్నో అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా పరస్పర గౌరవం, నమ్మకం, భద్రత వంటివి కూడా సంబంధాల్లో కీలక పాత్ర పోషిస్తాయని చెప్తున్నారు. చక్కటి రిలేషన్‌షిప్‌కు భాగస్వాముల మధ్య ప్రేమతోపాటు ఇంకా ఎలాంటి విషయాలు దోహదపడతాయో ఇప్పుడు చూద్దాం.

* ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ : సంబంధాలు, జీవితంలోని పలు విషయాలపట్ల అందరిలో ఒకే విధమైన అభిప్రాయం ఉండకపోవచ్చు. ఒక్కొక్కరి అనుభవం ఒక్కో విధంగా ఉంటుంది. ఇలాంటి కారణాలవల్ల కొందరు రిలేషన్‌షిప్‌లోకి అడుగు పెట్టాక భాగస్వామి లేదా అతని కుటుంబ సభ్యులు ఏమనుకుంటారోనని తమ భావాలను వ్యక్తం చేయలేకపోతుంటారు. పార్ట్‌నర్ అర్థం చేసుకోరేమోననే అనుమానం, ఇతరులు నవ్వుతారనే అభిప్రాయం, తనను పట్టించుకుంటారో లేదోననే ఫీలింగ్స్ వస్తుంటాయి. దీంతో చాలా విషయాలను మనసులోనే దాచేస్తుంటారు. కానీ ఇలా ఏదీ చెప్పకుండా ఉండటం కూడా ప్రమాదమే అంటున్నారు నిపుణులు. కాబట్టి ఎదుటి వ్యక్తులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. వారు మిమ్మల్ని అర్థం చేసుకునే సందర్భాలు ఉంటాయని, ఏదో ఒక సమయం చూసి మీ అభిప్రాయాలను, భావాలను తెలియజేయాలని, నచ్చకపోతే వ్యతిరేకించడం, నిర్ణయాలు తీసుకోవడం కూడా మీహక్కులో భాగంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

* భయం వదిలి పెట్టాలి : సంబంధంలోకి అడుగు పెట్టాక కొందరిని పలు అనుమానాలు వెంటాడుతుంటాయి. తాము పార్ట్‌నర్‌‌కు సెట్ అవ్వలేదేమోనని, లేకపోతే తాము నచ్చడం లేదని ఫీలవుతుంటారు. అవతలి వ్యక్తి ప్రవర్తన చూసి తమది పర్‌ఫెక్ట్ జోడీ కాదేమోనని అనుమాన పడుతుంటారు. ఏదో ఒకరోజు తనను వదిలేస్తారనో, ఇబ్బంది పెడతారనో అనుకుంటారు కూడా మరికొందరు. మీ మనుసును కూడా ఇలాంటి ఆందోళన వెంటాడుతుంటే నిర్లక్ష్యం చేయకూడదని, వెంటనే భాగస్వామికి తెలియజేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడు అవతలి వ్యక్తి ఇచ్చే భరోసావల్ల మీలోని అనుమానాలు, భయాలు పోతాయనిచ దీంతో మీరు కంఫర్ట్‌గా ఫీలవుతారని చెప్తున్నారు.

* నమ్మకం ముఖ్యం : ఏ రిలేషన్‌షిప్‌‌లో అయినా పరస్పర నమ్మకం చాలా ముఖ్యం. ఇద్దరిలో ఎవరికి లేకపోయినా ఆ సంబంధం దీర్ఘకాలంపాటు సవ్యంగా కొనసాగడం కష్టం అంటున్నారు మానసిక నిపుణులు. అయితే ఇది వెంటనే ఏర్పడదు. ఒకరు చెప్పడంవల్ల అస్సలు రాదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, అన్ని విషయాల్లో ఓపెన్‌గా మాట్లాడుకోవడం, మనసులో ఏదీ దాచుకోకుండా చర్చించుకోవడం కారణంగా ఒకరంటే ఒకరికి పూర్తిగా తెలిసిపోతుంది. అప్పుడే నమ్మకం ఏర్పడుతుందని నిపుణులు చెప్తున్నారు.

* మూడవ వ్యక్తి జోక్యాన్ని నివారించాలి : పార్ట్‌నర్స్ పర్సనల్ సంభాషణల్లో, నిర్ణయాల్లో మూడవ వ్యక్తి జోక్యంవల్ల ఆ సంబంధం దెబ్బతినే అకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. క్లోజ్ ఫ్రెండ్ అయినా, కుటుంబ సభ్యులైనా, బంధువులైనా సరే భాగస్వాముల వ్యక్తిగత అంశాల్లో వారి జోక్యం ఉండకూడదు. ఇందుకోసం ఏం చేయాలనేది పార్ట్‌నర్స్ కూర్చొని మాట్లాడుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అంతేకానీ ఇద్దరి మధ్య సరైన కమ్యూనికేషన్ లేకుండా, ఎవరో చెప్పింది వింటూ భాగస్వామిని అపార్థం చేసుకోవడం వంటివి ఆ సంబంధంలో విచ్ఛిన్నానికి దారితీస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

* ఓపెన్ కమ్యూనికేషన్ : ఓపెన్ కమ్యూనికేషన్ అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారమని ఫ్యామిలీ అండ్ రిలేషన్‌షిప్ కౌన్సెలింగ్ నిపుణులు చెప్తున్నారు. ఎవరో చెప్పింది వినడమో, లేకపోతే మనసులో కలిగిన అనుమానాలను బయటపెట్టకుండా పరోక్షంగా ఇబ్బందికి గురిచేయడమో అస్సలు మంచిదంటున్నారు. ఏవైనా అనుమానాలు, సమస్యలు, అభిప్రాయ భేదాలు ఉంటే ఓపెన్‌గా మాట్లాడుకోవడమే చక్కటి పరిష్కారం. రిలేషన్‌షిప్‌లో ప్రేమతోపాటు ఇవన్నీ అనుసరించినప్పుడే ఆ సంబంధం కలకాలం కొనసాగే అవకాశం ఉంటుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. 


Similar News