Raw foods : పచ్చి పాలు, పచ్చి మాంసం ప్రాణాంతకమే!!

Raw foods : పచ్చి పాలు, పచ్చి మాంసం ప్రాణాంతకమే!!

Update: 2024-11-03 13:41 GMT

దిశ, ఫీచర్స్ : ఎలాంటి ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదనే విషయాలు ఎల్లప్పుడూ క్యూరియాసిటీగానే ఉంటాయి. ఎందుకంటే ప్రజలు తమ ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటారు. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, చేపలు, గుడ్లు, పాలు, మాంసం వంటివి రోజువారీ ఆహారాల్లో భాగంగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం కారణంగా ఈ ఆహారాలకు సంబంధించి పలు అపోహలు కూడా ప్రజల్లో నెలకొంటున్నాయి. ఏంటంటే.. వండిన వాటికంటే పచ్చివి తినడం మంచిదని కొందరు చెప్తుంటారు. అది నిజమేనా? ఇంతకీ పోషకాహార నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

బంగాళ దుంపలు, రబ్బర్ లీవ్స్

కొందరు బంగాళ దుంపలను పచ్చివిగా తింటే బలం వస్తుందని చెప్తుంటారు. కానీ ఇది నిజం కాదు. పైగా అలా తినడంవల్ల ఆరోగ్యానికి నష్టం జరుగుతుంది అంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే రా పొటాటోస్‌ తినడంవల్ల వీటిలోని పిండి పదార్థాలు జీర్ణ వ్యవస్థను గందరగోళ పరుస్తాయి. అంతేకాకుండా వీటిలో గ్లైకో ఆల్కలాయిడ్స్ అనే విషపూరిత సమ్మేళనాలు ఉంటాయని, ఇవి జీర్ణ సంబంధింత సమస్యలకు, అలర్జీలకు దారితీస్తాయని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి పచ్చివి తినకూడదు. వండుకొని తినడమే సేఫ్. అట్లనే కొందరు రబ్బర్ లీవ్స్ అనే ఆకు కూరను పచ్చిగా తినాలని చెప్తుంటారు. అలా తినడంవల్ల ఇందులో ఉండే ఆక్సాలిక్ యాసిడ్ అనే విషపూరిత ఆమ్లం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

చిక్కుడుగాయ, బొబ్బర్లు

చిక్కుడుగాయ విత్తనాలను, బొబ్బర్లను (Lima beans, red kidney beans) పచ్చిగా తింటే కిడ్నీల ఆరోగ్యానికి మంచి జరుగుతుందనే అపోహ కూడా ఉంది. వాస్తవానికి ఇలా తినడం ఆరోగ్యానికి హానికరం. ఫుడ్ పాయిజన్ సంభవించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిక్కుళ్లు, బొబ్బర్లు వంటివి పచ్చిగా ఉన్నప్పుడు లినామరిన్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటాయి. వండుకొని తింటే మేలు జరుగుతుంది. కానీ పచ్చిగా తింటే అందులోని లినామరిన్ సైనైడ్‌గా మారుతుంది. ఇక రెడ్ కిడ్నీస్ లేదా బొబ్బర్లలో కూడా పచ్చిగా ఉన్నప్పుడు లెక్టిన్స్ కలిగి ఉంటాయి. ఇవి జీర్ణాశయాంతర సమస్యలకు కారణం అవుతాయి. వండటం లేదా ఉడకబెట్టడంవల్ల అవి నాశనం అవుతాయి.

మష్రూమ్స్, పచ్చి పాలు, పచ్చి గుడ్లు

సూపర్ మార్కెట్లలో ప్రస్తుతం రకారకాల మష్రూమ్స్ దొరుకుతున్నాయి. అలాంటి వాటిలో వైల్డ్ మష్రూమ్స్ కూడా ఒకటి. అయితే వీటిని పచ్చివిగా తినడం సేఫ్ కాదు, తిన్న తర్వాత ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తాయి. కాబట్టి ఏ పుట్టగొడుగులైనా సరే ఉడికించి లేదా వండి తినడంవల్ల రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇక చాలా మందిలో ఉండే మరో అపోహ ఏంటంటే పచ్చి పాలు, పచ్చి గుడ్లు తినడం, తాగడంవల్ల బలం వస్తుందని చెప్తుంటారు. వాస్తవానికి ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు పోషకాహార నిపుణులు. పచ్చి పాలల్లో, గుడ్లల్లో వ్యాధికారకమైన సాల్మొనెల్లా బ్యా్క్టీరియా ఉంటుంది. పైగా వీటిలోని ప్రోటీన్స్ పచ్చిగా ఉన్నప్పుడు తినడంవల్ల జీర్ణం కావు. కాబట్టి పచ్చివి ఎప్పుడూ సేఫ్ కాదని గుర్తుంచుకోండి.

వివిధ జంతువుల మాంసం

సాధారణంగా చికెన్, ఫోర్క్, బీఫ్ ఇలా ఏ మాంసమైనా వండుకొని తింటారు. అయితే కొందరు పచ్చిగా తింటే శరీరానికి బలం వస్తుందని చెప్తుంటారు. బలం రాదు కానీ ప్రాణహాని మాత్రం సంభవించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. నిజానికి పచ్చి మాంసంలో క్యాంపిలో బాక్టర్, క్లోస్ట్రిడియం, పెర్ఫ్రింజెన్స్ అండ్ సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. పచ్చిగా తింటే ఇవి ఫుడ్ పాయిజనింగ్ కలిగిస్తాయి.

పచ్చి మొలకలు, పచ్చి వంకాయ

పచ్చి మొలకలు, పచ్చి వంకాయ తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు అనే ప్రచారం కూడా ఉంది. కానీ ఇవి హానికరం. పచ్చి వంకాయలో సోలనిన్ అనే సమ్మేళనం ఉంటుంది. వాస్తవానికి ఇది గ్లైకోల్కలాయిడ్ పాయిజన్. పచ్చిగా తింటే ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. తినకూడదు, కొందరు పఫర్ ఫిషెస్‌ను పచ్చిగా తినాలని అంటుంటారు. వాస్తవానికి ఇవి వండి తిన్నా నష్టమే. వీటిలో టెట్రోడోటాక్సిన్ అనే పాయిజనింగ్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి తినకూడదు. చాలా మంది పచ్చి మొలకలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అపోహ పడుతుంటారు. వీటిలో కూడా ఈ కోలీ, సాల్మొనెల్లా, (E. coli, salmonella) వంటి వ్యాధికారక బ్యాక్టీరియాలు ఉంటాయి. పచ్చివిగా తినడం ప్రమాదకరం.

కాలీ ఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీ, ముడితేనె

కాలీ ఫ్లవర్‌ పచ్చిగా ఉన్నప్పుడు విషపూరిత గుణాలు లేనప్పటికీ, తినడంవల్ సరిగ్గా జీర్ణం అవదు. దీంతో ఇబ్బందులు తలెత్తుతాయి. ఉడికించి లేదా వండుకొని తినడమే సేఫ్. బ్రోకలీ విషపూరితం కానప్పటికీ పచ్చిగా తింటే సరగ్గా జీర్ణం కాదు. ఇబ్బంది తలెత్తవచ్చు. క్యాబేజీ, బ్రోకలీలో కూడా పచ్చిగా ఉన్నప్పుడు తినడంవల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు అవి ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తాయి. కొందరు ముడితేనె ఆరోగ్యానికి మంచిది అంటారు. కానీ ఇందులో క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బ్యాక్టీరియా ఉంటుది. తినడంవల్ల ఇది హానికరమైన విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. చిన్న పిల్లలు, గర్భిణులు తింటే ప్రాణహాని సంభవించవచ్చు. కాబట్టి పచ్చివి తినకూడదు. వాస్తవానికి తినే ఆహారాల్లో చాలా వరకు ఉడకబెట్టి లేదా వండుకొని తింటేనే అందులోని పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పచ్చివిగా తింటే విషపూరితమై అనారోగ్యాలకు దారితీస్తాయి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 

Tags:    

Similar News