కామన్ ఫోబియా.. మనుషుల్లో సాధారణంగా ఉండే భయాలు ఏవో తెలుసా?
మనుషుల్లో సాధారణంగానే కొన్ని రకాల ఫోబియాలు లేదా భయాలు ఉంటాయి.
దిశ, ఫీచర్స్ : మనుషుల్లో సాధారణంగానే కొన్ని రకాల ఫోబియాలు లేదా భయాలు ఉంటాయి. ఇవి సందర్భాన్ని బట్టి వ్యక్తం అవుతుంటాయి. అయితే వీటివల్ల ఎటువంటి నష్టమూ ఉండదు. పైగా మనుషులను అలర్ట్ చేయడానికి దోహదపడతాయి. కానీ సోషల్ ఫోబియో లాంటి అరుదైన కొన్ని భయాలు మాత్రమే ఇబ్బందిగా ఉంటాయని మానసిక నిపుణులు చెప్తున్నారు. చికిత్స ద్వారా వాటినుంచి బయటపడచ్చు అని చెప్తున్నారు. మనుషుల్లో ఉండే అతిసాధారణ ఫోబియాలేవో తెలుసుకుందాం.
ఒపిడియో ఫోబియా
పామును చూడగానే చాలా మంది భయపడుతుంటారు. దీనినే ఒపిడియో ఫోబియా అంటారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా మనుషులందరికీ ఉంటుంది. పాము కాటు వేస్తే చనిపోతామన్న ఆలోచన మెదడుపై ప్రభావం చూపడం కారణంగా ఈ భయం ఏర్పడుతుంది.
అక్రో ఫోబియా
ఎత్తైన పర్వతాలు, లోతైన ప్రాంతాలను చూసేందుకు కొందరు భయపడుతుంటారు. ఉదాహరణకు ఓ పది అంతస్తుల బిల్డింగ్‌పైకి ఎక్కి అక్కడి నుంచి కిందకు చూసినప్పుడు కలిగే ఫీలింగ్. ఇలాంటి భయాన్నే అక్రో ఫోబియా అంటారు.
కైనో ఫోబియా
కుక్కలను చూసిన వెంటనే భయంతో దూరంగా వెళ్లడమో, పారిపోవడమో చేస్తుంటాం. వ్యక్తుల్లోని ఈ పరిస్థితినే కైనో ఫోబియా అంటారు. చిన్నప్పుడు కుక్కలు కరవడం లేదా వెంటపడటం వంటి సంఘటనలు చూసినప్పుడు, అనుభవించినప్పుడు ఈ విధమైన భయం మెదడులో నిక్షిప్తమై జీవితాంతం అలర్ట్ చేస్తుందట.
అరాక్నో ఫోబియా
కొందరు సాలె పురుగును చూసి భయపడుతుంటారు. అరాక్నిడ్ ఫ్యామిలీకి చెందిన ఏ పురుగులను చూసినా భయం వేస్తూ ఉంటుంది. ఈ పరిస్థితినే అరాక్నో ఫోబియా అంటారు. ఇది చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది. ఈ భయం ఉన్నవారు సాలె పురుగులను ప్రత్యక్షంగానే కాకుండా, వాటి ఫోటోను చూసిన భయడపడుతుంటారు. ఇది ఆదిమకాలం నుంచి వచ్చిన భయం అని మానసిక నిపుణులు చెప్తుంటారు. ఎందుకంటే అప్పట్లో సాలె పురుగులను దగ్గరకు రాకుండా ఎలా వెళ్లగొట్టాలో తెలియక వాటిని చూసి భయపడేవారట. అలా మనిషి మెదడులో నాటుకుపోయిన భయం ఇప్పటికీ కొనసాగుతోంది.
నియో ఫోబియా
నియో ఫోబియా ఉన్నవాళ్లు మార్పును గానీ, కొత్త విషయాలను గానీ అంగీకరించడానికి భయపడుతుంటారు. అలాగే కొత్త ప్రదేశాలకు వెళ్లడానికి, కొత్త వ్యక్తులతో మాట్లాడటానికి సుముఖత చూపరు. లోలోన భయపడుతుంటారు. దీనినే నియో ఫోబియా అంటారు.
ట్రైపనో ఫోబియా
కొంతమందికి ఇంజెక్షన్ వేయించుకోవడం అంటే చాలా భయం. అవసరమైతే టానిక్ ఇవ్వండి, టాబ్లెట్ ఇవ్వండి అంటారు కానీ, వ్యాక్సిన్ మాత్రం వేయించుకోరు. దీనిని ట్రైపనో ఫోబియా అంటారు. ప్రపంచవ్యాప్తంగా 30 శాతం మందిలో ఈ విధమైన భయం ఉందట.
సోషియో ఫోబియా
కొందరు సమాజంలో జరిగే సంఘటనల పట్ల అతిగా ఆందోళన చెందడం, భయపడటం చేస్తుంటారు. ఇతర వ్యక్తులతో కలివిడిగా ఉండలేరు. ఫంక్షన్లు, సమావేశాలు, అత్యధిక మంది ఉండే ప్రాంతాలకు వెళ్లడానికి జంకుతారు. దీంతోపాటు తరచుగా తమను ఎవరైనా గమనిస్తున్నారేమో, తమ గురించి ఏదైనా మాట్లాడుకుంటున్నారేమో అని ఆలోచిస్తుంటారు. వ్యక్తుల్లో ఈ విధమైన పరిస్థితినే సోషియో ఫోబియా అంటారు. ఈ రకమైన రుగ్మతకు చికిత్స అవసరం అని మానసిక నిపుణులు చెప్తున్నారు.
Also Read..