సంతానలేమి సమస్యకు దారితీస్తున్న మానసిక ఒత్తిడి..
ఈ రోజుల్లో చాలామంది జంటల్లో సంతానలేమి సమస్యకు శారీరక సమస్యతోపాటు మానసిక ఒత్తిడి ప్రధాన కారణం అవుతోందని నిపుణులు చెప్తున్నారు.
దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో చాలామంది జంటల్లో సంతానలేమి సమస్యకు శారీరక సమస్యతోపాటు మానసిక ఒత్తిడి ప్రధాన కారణం అవుతోందని నిపుణులు చెప్తున్నారు. ఉరుకులు పరుగుల జీవితం, ఒత్తిడితో కూడిన కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, మహిళలకు ఇంట్లో హెవీ వర్క్ వంటివి మానసిక ఒత్తిడికి దారి తీస్తున్నాయి. వ్యక్తిగత, సామాజిక ప్రతికూల పరిస్థితుల మధ్య కొందరు మెదడులో ప్రశాంతతకు చోటులేని బిజీలైఫ్‌ను గడపాల్సి వస్తోంది. ఇవన్నీ కలిసి సంతాన లేమికి కారణం అవుతున్నాయి.
పిల్లల్ని కనాలనుకోడం ప్రతీ జంటకు ఓ అందమైన కల. దానిని నిజం చేసుకునేందుకు మానసిక ఒత్తిడి ప్రధాన ఆటంకంగా ఉంటోందని నిపుణులు చెప్తున్నారు. సంతాన సాఫల్యత పై ఇటువంటి పరిస్థితి తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఒత్తిడిలో ఉన్న జంట సెక్స్‌లో పాల్గొన్నప్పుడు సంతానానికి దోహదపడే హార్మోన్స్ కూడా సక్రమంగా రిలీజ్ కావు. అందుకే ఒత్తిడి అనే శత్రువును తరిమేయాలని సూచిస్తున్నారు.
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. సంతానం కోరుకుంటున్న ప్రతీ 10 మంది మహిళల్లో ఒకరిని సంతానలేమి సమస్య వేధిస్తోంది. గర్భధారణ సమస్యలు ఎదురవుతున్నాయి. మరో విషయం ఏంటంటే ఓ రెండేళ్ల వరకు పిల్లలు కలుగని మహిళలు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ‘ఇక నాకు సంతానం కలగదేమో.. నలుగురు ఏమనుకుంటారు. పిల్లలు కలగకపోతే భర్త తనను వదిలేసి మరో పెళ్లి చేసుకుంటాడు’ అనే ఆలోచన మహిళలను మరింత కృంగిపోయేలా చేస్తోంది. అలాగే కొన్ని రకాల జీవనశైలి ప్రభావాలు, ఆరోగ్య సమస్యలు కూడా సంతానలేమి కి దారి తీస్తున్నాయి. వాటిని గుర్తించి నివారించుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు.
శారీరక శ్రమ..
ఈ రోజుల్లో శారీరక శ్రమ లేకపోవడం అనేది ఇతర అనారోగ్యాలతోపాటు సంతాన లేమికి కూడా కారణం అవుతోంది. శారీరక శ్రమ ఒత్తిడిని తగ్గించడంతోపాటు సంతానోత్పత్తి అవకాశాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి స్త్రీ పురుషులిద్దరు తగిన శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. తమ ఇండ్లలో అలాంటి శ్రమకు తగిన అవకాశం లేని వారు వ్యాయామాన్ని ఎంచుకోవాలి.
అధిక బరువు..
పిల్లలు కలుగకపోవడానికి అధిక బరువు కూడా ఒక కారణంగా ఉంటోంది. స్త్రీ, పురుషులిద్దరి పైనా అధిక బరువు, ఊబకాయ సమస్యలు ప్రభావం చూపుతాయి. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గుదలకు కారణం అవుతాయి. టైమ్ పాటించకుండా ఎప్పుడు పడితే అప్పుడు అతిగా తినే అలవాటు కూడా ఊబకాయానికి, సంతానలేమి సమస్యకు దారి తీయవచ్చు. అలాగే మరీ తక్కువ తినడం, బలహీనంగా ఉండటం కూడా సంతానలేమి సమస్యకు కారణం అవుతుంది. విపరీతమైన ఆహార నియంత్రణ వల్ల ‘అనోరెక్సియా’ అనే ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది. హర్మోన్ల లోపానికి కారణం అవుతుంది. కాబట్టి శరీరానికి తగిన పోషకాలు లభించే ఆహారం టైం ప్రకారం తీసుకోవడం మంచిది. అలాగే డయాబెటిస్, హై బీపీ సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
కెఫిన్ ప్రభావం..
కాఫీలోని కెఫిన్ అనే పదార్థం అధికంగా తీసుకుంటే సంతానలేమి సమస్యకు దారి తీస్తుంది. కాబట్టి రోజుకూ 4 కప్పులకు మించి తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అంతకుమించి కాఫీ తాగే జంటల్లో సంతానం కలిగే అవకాశాలు 26 శాతం తగ్గుతాయి.
మద్యపానం..
కొందరు ఒత్తిడిని తట్టుకోవడానికి డ్రింక్ చేస్తున్నామని సాకులు చెప్తుంటారు. కానీ ఆల్కహాల్ సంతానలేమి సమస్యకు ప్రధాన కారణాల్లో ఒకటి. ఒక అధ్యయనం ప్రకారం వారానికి 3 లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గడంతో పాటు మహిళల్లో అండాశయ సమస్యలు తలెత్తుతాయి.
నిద్రలేమి..
దీర్ఘకాలంగా నిద్రలేమి సమస్య కూడా సంతానలేమికి కారణం అవుతుంది. కాబట్టి నిద్రకు భంగం కలిగించే వాతావరణానికి దూరంగా ఉండాలి. రాత్రి సమయాల్లో గంటలకొద్దీ ఫోన్లు, డెస్క్ టాప్‌లు చూడటం వల్ల నిద్ర పట్టదు. కాబట్టి ఒకసారి బెడ్ రూమ్‌లోకి వెళ్లాక వాటికి దూరంగా ఉండటం మంచిది. మరో విషయం ఏంటంటే నిద్రలేమి అనేది 30 శాతం మంది మహిళల్లో వంధ్యత్వానికి కారణం అవుతోందట. అంతేగాక వారిలో అండాశయ నిల్వలు తగ్గుతాయి. నైట్ షిఫ్టులలో పనిచేసే స్త్రీలలో గర్భస్రావం అయ్యే అవకాశాలు 15 నుంచి 20 శాతం పెరుగతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.