Poor social skills : సామాజిక నైపుణ్యాల్లో లోపం.. సంభాషణలపై ప్రభావం!
Poor social skills : సామాజిక నైపుణ్యాల్లో లోపం.. సంభాషణలపై ప్రభావం!
దిశ, ఫీచర్స్ : సంతోషంగా ఉండటానికి, సక్సెస్ సాధించడానికి, వృత్తి జీవితంలో రాణించడానికి ‘సోషల్ స్కిల్స్’ చాలా ముఖ్యం. సామాజిక సంబంధాల ద్వారా, అధ్యయనాల ద్వారా, రోజువారీ అనుభవాల ద్వారా ఇవి ఏర్పడుతుంటాయి. కాలానుగుణంగా అభివృద్ధి చెందుతుంటాయి. ఆయా సందర్భాల్లో మీలోని ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుంటాయి. ఉపయోగించే తీరును బట్టి మీకు సహాయపడుతుంటాయి. అయితే పూర్ సోషల్ స్కిల్స్ మాత్రం అందుకు భిన్నం. అనేక అంశాల్లో క్లారిటీ సంకేతాలను ప్రదర్శించే ప్రవర్తలో ఇవి కనిపిస్తుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. విషయ పరిజ్ఞానం, సామాజిక స్పృహ వంటివి లేకపోవడమే ఇందకు కారణం. ఆయా సందర్భాల్లో వ్యక్తులను ఇవి ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు చూద్దాం.
తప్పుగా అర్థం చేసుకోవడం
సామాజిక సూచనలు లేదా నైపుణ్యాలు కొన్నిసార్లు విచిత్రంగా ఉంటాయి. అవి సూక్ష్మ సంకేతాల రూపంలోనూ వ్యక్తం అవుతుంటాయి. అవసరమైనప్పుడు ఏమీ మాట్లాడకుండానే ఇతరులను అర్థం చేసుకోవచ్చు. అవతలి వ్యక్తులకు అర్థం అయ్యేలా వ్యవహరించవచ్చు. కేవలం చూపుల ద్వారా, భుజం తట్టడం ద్వారా, శారీరక కదలికల ద్వారా కూడా ఇది సాధ్యమే. విషయం ఏంటంటే.. ఇలాంటివి ప్రతి ఒక్కరూ డీ కోడ్ చేయలేరు. సామాజిక పరిజ్ఞానం లేదా నైపుణ్యం లేకపోవడమే ఇందుకు కారణం. అలాంటప్పుడే సోసల్ ఇంటరాక్షన్స్ కూడా అపార్థాలకు దారితీస్తాయి.
డామినేటింగ్ కన్వర్జేషన్స్
మీరు ఏవైనా పార్టీలు, ఫంక్షన్లు, మీటింగ్‌లలో ఎప్పుడైనా గమనించారా? నలుగురు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు అందులో ఎవరో ఒకరు కాస్త చలాకిగా కనిపిస్తుంటారు. పలకరించకపోయినా కల్పించుకొని మరీ నాన్ స్టాప్‌గా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. అవతలి వ్యక్తిని అస్సలు మాట్లాడనివ్వరు. వారు మాట్లాడే ప్రయత్నం చేసినా మధ్యలో ఏదో ఒక సాకుతో వెంటనే కట్ చేసి తమదే చెప్తుంటారు. డామినేటింగ్ కన్వర్జేషన్‌కు చక్కటి ఉదాహరణ ఇదే అంటున్నారు నిపుణులు. కొందరు ఇలాంటి వ్యక్తులను చూసి భలే హుషారుగా ఉన్నారని, తెలివైన వారనే ముద్ర కూడా వేస్తుంటారు. కానీ విషయ పరిజ్ఞానం, సామాజిక స్పృహ వంటి పూర్ సోషల్ స్కిల్స్ కలిగి ఉన్న వ్యక్తుల్లోనే ఇలాంటి ఆధిపత్య సంభాషణలు వ్యక్తం అవుతుంటాయని నిపుణులు చెప్తున్నారు.
ఐ కాంటాక్ట్‌ను అవైడ్ చేయడం
‘ది బెస్ట్ హ్యూమన్ కమ్యూనికేషన్’ ప్రాథమిక అంశాలలో ఐ కాంటాక్ట్ ఒకటి. మాట్లాడుతున్నప్పుడు కళ్లల్లోకి సూటిగా చూడటం, చూడకపోవడం, కళ్లు పక్కకు తిప్పుకోవడం, ప్రశాంతమైన కళ్లను కలిగి ఉండటం ఇలా రకరకాల వ్యక్తీకరణలకు సంబంధించిన ఫీలింగ్స్ కళ్లల్లో కూడా కనిపిస్తుంటాయి. ఉదాహరణకు కోపం వచ్చినప్పుడు కళ్లు పెద్దవిగా చేయడం, ఆనందంతో కళ్లు చెమ్మగిల్లడం వంటివి ఇందులో భాగమే. మీరు లేదా అవతలి వ్యక్తి సంభాషణలో యాక్టివ్‌గా ఉంటున్నారా? అవైడ్ చేయాలనుకుంటున్నారా అనేది ఐ కాంటాక్ట్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు. అలా ఎవరైనా అర్థం చేసుకోలేరంటే కాస్త తక్కువ సామాజిక నైపుణ్యలు కలిగి ఉన్నట్లు లెక్క.
మాట చిన్నదైనా ప్రభావం పెద్దది
మాట చిన్నదైనా కొన్నిసార్లు అది చాలా విలువైనది కావచ్చు. ఎక్కువ ప్రభావితం చేసేది కావచ్చు. ఒకరిని గాయపర్చేది లేదా మేల్కొల్పేది కూడా కావచ్చు. కాబట్టి మాటతీరు మంచిగా ఉండాలంటారు నిపుణులు. ఇతరులు మాట్లాడుతున్నప్పుడు మీరు శ్రోతలా వినడం మీలో గొప్ప సోషల్ స్కిల్స్ ఉన్నాయని తెలియజేస్తుంది. అలా కాకుండా అవతలి వ్యక్తి మాటలను నిర్లక్ష్యం చేయడం, మీరు చెప్పేదే వినాలనుకోవడం ఇతరులకు అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా మీరు పూర్ సోషల్ స్కిల్స్ కలిగిన వ్యక్తులుగా ఇతరులు అర్థం చేసుకుంటారు. దీంతో మీ నుంచి దూరంగా ఉంటారు.
పర్సనల్ స్పేస్‌ను ఇగ్నోర్ చేయడం
కొందరు ఎల్లప్పుడూ తమ కోణంలోనే ఆలోచిస్తుంటారు. అవతలి వ్యక్తులను అర్థం చేసుకోరు. మాటలకు, భావ వ్యక్తీకరణకు అవకాశం ఇవ్వరు. చివరికి వారి పర్సనల్ స్పేస్‌ను కూడా డామినేట్ చేస్తారు. వారికి ఇష్టంలేని కంఫర్ట్ జోన్‌లోకి అనుమతిలేకుండానే ప్రవేశిస్తారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటారు. సామాజిక, వ్యక్తి గత సరిహద్దులను పట్టించుకోరు. పర్సనల్ అండ్ ప్రైవేట్ కన్వర్జేషన్లలో కూడా కల్పించుకుంటారు. పూర్ సోషల్ స్కిల్స్ కలిగి ఉన్న వ్యక్తుల్లో కనిపించే అత్యంత వికృత ధోరణీల్లో ఇదొకటి.
తరచుగా క్షమాపణలు చెప్పడం
అతి వినయం ధూర్త లక్షణం అంటారు పెద్దలు. అక్కడక్కడా కొంతమంది ఇలాంటి వారు కనిపిస్తుంటారు. వీరు తాము నిజాయితీగా ఉన్నామని, క్రమశిక్షణ గలవారమని నిరూపించాలనుకుంటారు. అందుకోసం అవసరం లేకున్నా అతి మర్యాదగా ప్రవర్తించడం, సందర్భం కాకపోయినా క్షమాపణలు చెప్పడం వంటివి చేస్తుంటారు. తక్కువ సామాజిక నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం ఇది. పైగా అవసరం ఉన్నా లేకున్నా, ప్రతీ చిన్న విషయానికి అతిగా స్పందించడం, క్షమాపణలు చెప్పడం మీ చర్యలకు మీరు బాధ్యత వహిస్తున్నట్లే లెక్క. సందర్భోచితం కానీ ఇలాంటి ప్రవర్తన నలుగురిలో మిమ్మల్ని చులకనకు గురిచేస్తుంది.